తెలంగాణ అడిగితే గెంటేశారు

 

trsss
శాసనసభ నుంచి టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యుల సస్పెన్షన్
– సభలోలేని హరీశ్, అరవింద్‌రెడ్డి,
సోమారపుపై కూడా..
– అవాంతరాలు సృష్టిస్తున్నారంటూ
రెండు రోజులు వేటు
– తీర్మానం కోరితే సస్పెన్షనా? :
ఎమ్మెల్యేల ఆగ్రహం
– సర్కారు తీరుపై సీపీఐ వాకౌట్
తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌పై పట్టుపట్టినందుకు టీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వం సభ నుంచి రెండు రోజుల పాటు సస్పెండ్ చేసింది. వీరి సస్పెన్షన్‌పై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణడ్డి సోమవారం తీర్మానం ప్రవేశపెట్టారు. సభను సజావుగా జరగనివ్వనందుకు ఈ 22మంది సభ్యులను రెండు రోజులపాటు సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సస్పెండ్ అయినవారిలో 16 మంది టీఆర్‌ఎస్, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు.. ఇటీవలే బీజేపీలో చేరిన నాగం జనార్దన్‌డ్డి కూడా ఉన్నారు. సభలో లేని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు అరవిందడ్డి, సోమారపు సత్యనారాయణపైనా ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది.

సస్పెన్షన్‌కు గురయిన సభ్యులు సభ విడిచి వెళ్లాల్సిందిగా స్పీకర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభంకాగానే తెలంగాణ తీర్మానంపై పట్టుపట్టిన టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. జై తెలంగాణ అంటూ వారు చేసిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో కొద్ది నిమిషాలకే (9.08 గంటలకు) సభను అరగంటపాటు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం సభ నిర్వహణ సజావుగా సాగించేందుకు అన్ని పార్టీల ఎల్పీ నేతలతో బీఏసీ సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటల విరామం అనంతరం తిరిగి సభ మధ్యాహ్నం 12.25 గంటలకు తిరిగి ప్రారంభమైంది. వెంటనే టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు మళ్లీ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తెలంగాణ అంశంపై చర్చకు పట్టుబట్టారు. వీరిని సముదాయించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. బీఏసీలో తీర్మానం చేసిన అంశాలతో సభ నిర్వహిద్దామని సూచించారు.

పట్టువిడవకుండా జై తెలంగాణ నినాదాలతో టీఆర్‌ఎస్, బీజేపి ఆందోళనలు కొనసాగుతుండగానే ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణడ్డి సభను సజావుగా జరుపుకునేందుకు అన్ని పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘సమావేశాలు మొదలైన దగ్గర నుంచి ఎలాంటి చర్చ లేకుండా సభ వాయిదా పడుతూ వస్తున్నది. ముఖ్యమైన 12 బిల్లులను ఆమోదించాల్సి ఉంది. అందుకు రానున్న 5 రోజుల సమావేశాలను ఉపయోగించుకుందాం’ అని కోరారు. శాఖల వారీగా స్టాండింగ్ కమిటీలు ఇచ్చిన సూచనలపై చర్చించాల్సి ఉందన్న ఆయన.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉందని తెలిపారు. అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఇదే అంశంపై బీఏసీలో చర్చించామని అన్నారు. అయినా సభ్యులు తమ ఆందోళన విరమించక పోవడంతో టీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులతోపాటు నాగం జనార్దన్‌డ్డిని రెండు రోజులపాటు సభనుంచి సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందిందన్న స్పీకర్.. సస్పెండ్ అయిన సభ్యులు సభ విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

దీంతో టీఆర్‌ఎస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణపై తీర్మానం పెట్టమంటే సస్పెండ్ చేస్తారా? అంటూ నినాదాలు చేశారు. బయటికి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో సభలోకి ప్రవేశించిన అసెంబ్లీ మార్షల్స్ పలువురు సభ్యులను ఎత్తుకుని బయటకు తీసుకు ఈ సందర్భంగా స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న నాగం ‘అస్టులు, దమనకాండలు చేస్తున్నారు. తెలంగాణపై మాట్లాడే అవకాశం లేదా?’ అని ప్రశ్నిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సస్పెండయిన సభ్యులు నినాదాలు చేస్తూ సభనుంచి బయటకు వెళ్లారు. సభ్యుల సస్పెన్షన్, సభ నిర్వహణ తీరుపై అన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా సభ నిర్వహణ సాగడంలేదని, లేనిపోని హద్దులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల నోరు నొక్కుతున్నారని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చలో అసెంబ్లీని ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామని కోరితే ప్రభుత్వం అనుసరించిన తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా ఉందటూ సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణపై తేల్చకుండా అనుచిత ధోరణి ప్రదర్శిస్తున్న తీరుకు నిరసనగా సీపీఐ సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ తీరును సీపీఎం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం నాన్చుతోందని మండిపడింది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో సభ సరిగా నడవటం లేదని, ముఖ్యమైన ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం వాయిదాల పేరుతో సభను తప్పుదోవ పట్టిస్తోందని పలు పార్టీల నేతలు ఆక్షేపించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.