తెలంగాణే నా ఇన్‌స్పిరేషన్-తెలుగు జర్నలిజం పితామహుడు విశ్వేశ్వరరావు

ఒక్క బడి పాఠాలే చెప్పి తప్పుకున్నా..పరిసరాల నుంచి పాఠాలేవీ నేర్వలేకపోయినా.. అటు గురువుగా… ఇటు విద్యార్థిగా మనిషి ఫెయిలైనట్టే!అయితే ఆ రెండు విషయాల్లో పాస్ అయిన గురువు, విద్యార్థి  తెలుగు జర్నలిజానికి పితామహుడు పొన్నా లక్ష్మణరావు విశ్వేశ్వరరావు!పీఎల్‌వీ సర్ అని ప్రేమగా పిలుచుకునే స్టూడెంట్స్‌కి ఆయన కారిడార్ లెక్చరర్.. ప్రపంచ గవాక్షం! అమ్మ నుంచి మొదలు యూనివర్శిటీ దాకా ప్రతి వ్యక్తిని, ప్రతి అవకాశాన్నీ ఓ గురువుగా భావించాడు..ఎదిగిన వైనాన్ని పాఠంగా బోధించాడు! అందుకే ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇప్పటికీ స్టూడెంట్స్‌కి ఫెవరెట్ టీచరే!మాస్టర్ చెప్పే లెసన్సే కాదు ఆయన లైఫ్‌లోని టర్న్స్ .. అందుకు రీజన్స్ … ఆ ఇన్‌స్పిరేషన్స్‌కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయ్!ఈ విషయాల వెంట పరిగెత్తే కళ్లే ఆ ఆనందానికి మెరిసే సాక్ష్యాలు!
thathha
నా జీవితంలో మొదటి గురువు మా అమ్మే! తను సాదాసీదా గహిణి. చదువుకోలేదు. కానీ పిల్లలు మాత్రం బాగా చదవాలని ఆశపడింది. మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలని ఆమె కోరిక, తాపత్రయం కూడా! మాది న్యూ మిర్జాలగూడ (మల్కాజిగిరి దగ్గర). మా ఫాదర్ లక్ష్మణరావు రైల్వేస్‌లో పనిచేసేవాడు. మొదట్లో నేను మా ఇంటి దగ్గరే ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లిన. ఓ రెండేళ్లే అక్కడ చదువుకున్న. తర్వాత మా ఏరియాలోని పంచాయత్ స్కూల్‌కి వెళ్లాను. అయిదు వరకు అక్కడే ఉన్నా. సిక్త్స్ నుంచి ఎయిత్ వరకు మల్కాజిగిరి జిల్లా పరిషత్ స్కూల్. అక్కడి వరకు నా చదువంతా తెలుగు మీడియమే. ఈ చదువుతో మా అమ్మ సంతప్తి పడలేదు. అందుకే నైన్త్ క్లాస్‌లో నన్ను రైల్వే స్కూల్‌కి షిఫ్ట్ చేసింది. అది ఇంగ్లీష్ మీడియం. తనకు అక్షరాలు తెలియకపోయినా చిన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి చదివించేది. లెక్కలు చేశావా? ఇంగ్లీష్ చదివావా? సైన్స్ ఎక్కడిదాకా వచ్చింది? అంటూ ఆరు సబ్జెక్టుల గురించి ఆరా తీసేది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ మీద అభిమానం ఏర్పడి దానిమీద పట్టు రావడానికి కారణం అమ్మే! ఇది 1964 నాటి సంగతి. అప్పటికే ఇంగ్లీష్ మీద, మా చదువుల మీద మా అమ్మకు అలాంటి విజన్ ఉందంటే గ్రేట్ అనిపిస్తది. అట్లా నా చైల్డ్‌హుడ్‌ని ఒక మంచి ఫ్రేమ్‌లో పెట్టింది ఆమె! ఆ రకంగా అమ్మ నా ఫస్ట్ టీచరే కాదు నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసిన గ్రేట్ టీచర్ కూడా!

వరల్డ్స్ బిగ్గెస్ట్ మూవ్‌మెంట్
నేను డిగ్రీలోకి రాగానే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇదీ నాకు గురువు లాంటిదే. ఆ రోజుల్లో టీవీల్లేవ్, పేపర్లూ తక్కువే! మొబైల్స్ లేవ్. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ అనే ఊహ కూడా రాని సమయం. అయినా ఉద్యమం ఉప్పెనలా లేచింది. మాసివ్ మూవ్‌మెంట్ అది. అండ్ స్పాంటేనియస్ మూవ్‌మెంట్.. వరల్డ్స్ బిగ్గెస్ట్ మూవ్‌మెంట్. అందులో అందరూ విద్యార్థులే! సమావేశమవడానికి రెండే ప్లేస్‌లు.. ఒకటి సికింద్రాబాద్ క్లాక్ టవర్, రెండు.. నారాయణగూడ భవన్స్ కాలేజ్ దగ్గర! ప్రతిరోజు మీటింగ్‌కి వెళ్లేవాడిని. ఆ ఉపన్యాసాలు, డిబేట్స్.. నాకు చాలా నేర్పాయి. పెద్దపెద్ద వాళ్ల స్పీచెస్ విని తెలంగాణ గురించి చాలా చదవాలి.. ఒక అండర్‌స్టాండింగ్ ఏర్పర్చుకోవాలని క్లాక్‌టవర్ దగ్గరే ఉన్న గవర్నమెంట్ లైబ్రరీకి వెళ్లడం స్టార్ట్ చేసిన. ఎన్నో పుస్తకాలు చదివిన. అట్లా తెలంగాణ మూవ్‌మెంటూ నాకెన్నో నేర్పింది. నన్ను ఇన్‌స్పైర్ చేసిన రెండో గురువు అది. డిగ్రీలో నాది బీయస్సీబీజెడ్‌సీ. నాకు సైన్స్ కన్నా సోషల్‌సైన్సే ఎక్కువ ఇష్టం. అందుకే ఐ వజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై బీఎస్సీ. అయినా కంప్లీట్ చేయక తప్పదు కదా!

యూనివర్శిటీ.. బద్రిరాజు కష్ణమూర్తి
ఉస్మానియా యూనివర్శిటీ ప్లేడ్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్. ఇట్సె యాన్ ఐడియాలాజికల్ క్యాంపస్ ఆ రోజుల్లో! పీడీఎస్‌యూ వజ్ ది స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ క్యాంపస్‌లో. అక్కడే నాకు దాస్ కాపిటల్ పరిచయమైంది. ఆ లైబ్రరీ నాకో కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఎంతోమందిని ఫ్రెండ్స్‌గా చేసింది. పీజీ కోసం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్‌లో జాయిన్ అయిన. అయితే అంతకుముందే అంటే 1968 నుంచే నాకు ఉస్మానియా యూనివర్శిటీతో అసోసియేషన్ ఉంది. ఆ టైమ్‌లో మా అన్నయ్య క్యాంపస్‌లో జర్నలిజం చేస్తున్నాడు. ఆయనకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి.. ప్రతిరోజూ క్యాంపస్‌కి వచ్చేవాడిని. నాకు జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ కూడా మా అన్నయ్యవల్లే కలిగింది. ఎలాగైనా క్యాంపస్‌లో జర్నలిజం చేయాలి అనుకునేవాడిని. మా డిగ్రీ రిజల్ట్స్ లేట్‌గా రావడం వల్ల ఆ యేడు జర్నలిజం ఎంట్రెన్స్ రాయలేక పోయిన. అందుకే ఎమ్మేకి అప్లయ్ చేయాల్సి వచ్చింది. తర్వాత జర్నలిజం చేసిన. అదేకాదు సోషియాలజీ కంప్లీట్ చేసిన. మూడు పీజీలన్నమాట. ఎమ్మే లింగ్విస్టిక్స్‌లో ఉన్నప్పుడే నాకు ఒక ప్రొఫెసర్ కనపడ్డాడు. అతనే బద్రిరాజు కష్ణమూర్తి. నా జీవితం మీద ముద్రవేసిన వ్యక్తి. అవుట్‌స్టాడింగ్ ప్రొఫెసర్ ఇన్ ద వరల్డ్! నేను లింగ్విస్టిక్స్‌లో జాయిన్ అయినప్పుడు ఆయన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్. వెరీ యంగ్ ప్రిన్సిపల్. 35 ఏళ్లకే ఆర్ట్స్‌కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యాడు. ఎమ్మే అయినతర్వాత నువ్ పీహెచ్‌డీ చేయాలని నాకు చెప్పిన ఫస్ట్ పర్సన్ ఆయన. అసలప్పటిదాకా నాకు ఎమ్‌ఫిల్ .. పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఉన్నట్టు తెలియదు, రీసెర్చ్ చేయాలనీ తెలియదు. నీకు సబ్జెక్ట్ ఉంది. బాగా మాట్లాడ్తావ్, హార్డ్‌వర్కింగ్ కూడా. అందుకే యు మస్ట్ డూ ఎమ్‌ఫిల్ అండ్ పీహెచ్‌డీ అని చెప్పిండు. అట్లా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే కాదు గైడ్‌లైన్సూ ఇచ్చిండు. నన్ను చాలా అభిమానించేవాడు. అండ్ ఫైనల్లీ ఐ గాట్ పీహెచ్‌డీ అండర్ ది గైడ్‌లైన్ ఆఫ్ హిమ్. నా పీహెచ్‌డీ టైమ్‌లో ఆయన యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్. మా ఇద్దరి బంధం యూనివర్శిటీకే పరిమితం కాలేదు… ఆ అనుబంధం ఆయన చనిపోయేంత వరకూ సాగింది. నేను తెలంగాణ అని తిరుగుతుంటే ఎందుకు తెలంగాణ అని తిరుగుతున్నావ్ .. అకడమిక్స్‌కి సంబంధించి ఏవైనా కొత్త పుస్తకాలు రాసుకోక అని అనేవాడు. అవి వినకపోయేవాడిని. మా మధ్య ఇలాంటి ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నా దాన్ని మేమిద్దరం అంతవరకే పరిమితం చేసుకునేవాళ్లం! ఆయన భౌతికంగా లేడేమో కాని నా మనసులో మాత్రం చిరంజీవే!

స్కైలైన్.. సీతారామ్
25 ఏళ్లకే ఉస్మానియాలో లెక్చరర్ అయిన. అంత చిన్న వయసులో ఉస్మానియాలో లెక్చరర్ కావడమంటే ఇట్ వజ్ ఎ బిగ్ ఎచీవ్‌మెంట్ ఇన్ దోజ్ డేస్! అయితే అంతకుముందే నా జర్నలిజం కోర్స్ పూర్తికాగానే స్కైలైన్ అనే పత్రికలో పార్ట్‌టైమ్‌గా చేరిన. దాన్ని డి. సీతారామ్ నడిపేవాడు. వెరీ టఫ్ మన్. బట్ ఐ లర్డ్న్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్! కంపోజింగ్ నుంచి ఎడిటింగ్ దాకా .. న్యూస్ ఐటమ్స్ పెట్టడం దగ్గర్నుంచి పేపర్‌రూపంలో అవుట్‌పుట్ బయటకు వెళ్లేదాకా అన్నిటికీ స్కైలైన్ పత్రిక, సీతారామే నాకు గురువులు! స్కైలైన్‌లో పనిచేస్తూనే ఉస్మానియాలో అడహక్ లెక్చరర్‌గా చేస్తుంటి.

నాకు నేను.. పిల్లలే గురువులు
ఉస్మానియాలో రెగ్యులర్ లెక్చరర్‌గా జాయిన్ అయిన పదేళ్ల వరకు నేనే యాక్టివిటీలో లేను. అప్పుడు అంతా బెస్ట్ టీచర్‌గా పేరు తెచ్చుకోవాలనే తపనే! ఆ యాంబిషన్‌కి నాకునేనే గురువును. లెక్చరర్‌గా మై ఫస్ట్ జర్నీ జర్నలిజం డిపార్ట్‌మెంట్ నుంచే! అయితే ఇందులో బెస్ట్ టీచర్ ఎచీవ్‌మెంట్‌కి ఎంతోమంది స్టూడెంట్స్.. వాళ్ల ఉత్సాహం, జిజ్ఞాస, తపన నన్ను ఇన్‌స్పైర్ చేసిన మాటా వాస్తవమే! దానికితోడు ఫుల్ ఆఫ్ కమిట్‌మెంట్ కూడా! ఎనామస్ కమిట్‌మెంట్! ఆ కమిట్‌మెంటే యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో మాస్‌కమ్యూనికేషన్ కోర్స్‌కి నన్ను ఫౌండర్‌ని చేసింది. అమెరికాలోని బాస్టన్ యూనివర్శిటీలో ఫుల్ బ్రైట్ ఫెలోషిప్‌కి ఎలిజిబిలిటీని తెచ్చిపెట్టింది. ఎంతో ఎక్స్‌పోజర్‌నిచ్చింది. ఇది 1986 నాటి విషయం. అమెరికాలో టెలివిజన్ చేస్తున్న సందడి చూసొచ్చాకే ఇక్కడ చెప్పాను రాబోయే రోజుల్లో అంతా ఎలక్ట్రానిక్ మీడియాదే రాజ్యం అని. అందుకే హెచ్‌సీయూ వాళ్లు ప్రింట్ మీడియా కోర్స్‌ను ప్రవేశపెడ్తామంటే కూడా వద్దని మాస్‌కమ్యూనికేషన్ కోర్స్‌ని స్టార్ట్ చేయించా. దానికి సిలబస్‌ను నేనే ఫార్ములేట్ చేసిన. ఐ వజ్ ద ఫస్ట్ టీచర్. హెచ్‌సీయూలో యంగెస్ట్ ప్రొఫెసర్‌ని నేనే. 35 ఏళ్లకే ప్రొఫెసర్‌నయిన.

స్టూడెంట్స్ ఫెవరెట్
హెచ్‌సీయూలో మూడేళ్లు పనిచేశాక ఉస్మానియావాళ్లు పిలిచిండ్రు. వెళ్లిన. సెంట్రల్ యూనివర్శిటీలో దేశం నలుమూల నుంచి స్టూడెంట్స్ వస్తారు. అక్కడున్న గుర్తింపు వేరు కదా.. దాన్ని వదులుకొని ఉస్మానియాకెందుకెళ్తున్నావ్ అని చాలామంది అడిగిండ్రు. కావచ్చు కాని ఉస్మానియా ఈజ్ మై ఓన్ యూనివర్శిటీ. నా తెలంగాణ నలుమూల నుంచి స్టూడెంట్స్ వస్తారు. వాళ్లకు పాఠాలు చెప్తూ వాళ్లను తీర్చిదిద్దడంలో ఇంకా ఆనందం ఉంటుంది అని మనసులోనే అనుకున్నా. ఆ ఎంజాయ్‌మెంట్‌ను నేనెప్పుడూ మిస్‌కాలేదు. ఆ మాటకొస్తే టీచర్‌గా నేను చాలా యాక్టివ్. ఒక్క పాఠాలే కాదు సోషల్ ఇష్యూస్ మీద స్పందించడంలో కూడా నేను ముందుండేవాడిని. తెలంగాణ ఉద్యమంలో స్టూడెంట్స్ ైస్ట్రెక్‌కి దిగితే సపోర్ట్ చేసేవాడిని. వాళ్లకు పర్మిషన్ ఇప్పించేందుకు వీసీ చాంబర్ ముందు నేను ధర్నా చేసి వాళ్లకు అనుమతి ఇప్పించిన రోజులున్నాయ్. ఏమయ్యా… నువ్వు ఓ ప్రిన్సిపల్ (అప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్) అయి ఉండి ధర్నాకు దిగుతావా? వద్దని స్టూడెంట్స్‌ని వారించాల్సింది పోయి నువ్వే పర్మిషన్ కోసం ధర్నా చేస్తావా? అని వీసీ తలపట్టుకున్న సందర్భమూ ఉంది. అట్లా స్టూడెంట్స్‌కి సంబంధించి టెక్ట్స్‌బుక్ లెసన్స్ నుంచి సొసైటీ లెసెన్స్ దాకా ఏ విషయంలోనూ నేను కాంప్రమైజ్ కాలేదు. స్టూడెంట్స్‌నాకెంత ఫెవరెటో వాళ్లకూ నేనూ అంతే ఫెవరెట్ టీచర్‌ని. ఔటా(ఉస్మానియాయూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్ అయిన.. అకడమిక్ స్టాఫ్ కాలేజ్‌కి డైరెక్టర్‌నయిన.. డీన్ అయిన.. అట్లా ఉస్మానియా యూనివర్శిటీ నాకెన్నో బెస్ట్ పొజిషన్స్‌నిచ్చింది. ఆ పొజిషన్స్ అన్నీ నాకు గురువులే! అయితే ఇవన్నీ నాకు అందడానికి, నేను కేపబుల్‌గా నిలవడానికి నా గురువులు బద్రిరాజు కష్ణమూర్తి పంచిన స్ఫూర్తే. ప్లస్ నాలో ఉన్న తపన!

యంగ్ వొరేటర్స్ క్లబ్.. గార్డెన్ రెస్టారెంట్
ఆ రోజుల్లో సికింద్రాబాద్ వైఎమ్‌సీఏలో యంగ్ వొరేటర్స్ క్లబ్ ఉండేది. అప్పుడు ఈ ఎమ్‌సెట్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగుల్లేవ్. విపరీతంగా పుస్తకాలు చదవడం.. చదివిన వాటిని డిబేట్ చేయడం, రాయడం లాంటివే ఉండేవి. వాటికి డయాసే యంగ్ వొరేటర్స్ క్లబ్. సిటీలో ఉన్న బెస్ట్ డిబేటర్స్ అండ్ స్పీకర్స్ అంతా ఆ క్లబ్‌కి వచ్చేవాళ్లు. లాటరీ సిస్టమ్‌లో టాపిక్‌ను సెలక్ట్‌చేస్తుండె. ఎవరికి ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ మీద అనర్ఘళంగా మాట్లాడాలి. ఇది పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి ఎంత హెల్ప్ అయ్యేదో! ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. పదిమందిలో బెరుకు లేకుండా మాట్లాడడం వచ్చేది. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యేవి. నేనైతే ఈ క్లబ్‌కి వెళ్లడానికి సంబరపడేవాడిని. ఇదీ నా లైఫ్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈ క్లబ్ నేర్పిన విషయాలూ ఎన్నో! ఉస్మానియా యూనివర్శిటీ డిబేట్‌లో నేనెప్పుడు పార్టిసిపేట్ చేసినా విన్నర్‌గా నిలిచేవాడినంటే కారణం యంగ్ వొరేటర్స్ క్లబ్బే! అందులో ఆరేళ్లు మెంబర్‌గా ఉన్నా. ఇట్స్ రియల్లీ ఇన్‌ఫ్లుయెన్డ్స్ ఎ లాట్! ఈ క్లబ్‌లో యాక్టివిటీ అయిపోయాక అందరం కలిసి క్లాక్ టవర్ దగ్గరున్న గార్డెన్ రెస్టారెంట్‌కి వెళ్తుంటిమి. ఆ రోజుల్లో ఐదు పైసలకే ఛాయ్! ఛాయ్ తాగుతూ కొత్తగా వచ్చిన పుస్తకాల నుంచి ప్రపంచ పరిణామాల దాకా అన్నీ మాట్లాడుకునేవాళ్లం.. చర్చించుకునేవాళ్లం. ఈ మూమెంట్స్ ఇచ్చిన ఇన్‌స్పిరేషన్… చేసిన ఇన్‌ఫ్లుయెన్స్ ఏమని చెప్పగలం! ఇది 1978 నాటి ముచ్చట.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.