తెలంగాణలో టీఆర్‌ఎస్‌దేముఖ్య భూమిక-టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్

‘తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ముఖ్య భూమిక పోషిస్తుంది.. అధికారంలో ఉండేది మేమే… పునర్నిర్మాణంలో కీలక పాత్ర మాదే’ అని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. జాతీయ మీడియా సర్వే నివేదికల నేపథ్యంలో ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో విలీనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రజల మద్దతు టీఆర్‌ఎస్ వైపే ఉందని సర్వేలు స్పష్టం చేశాయని బదులిచ్చారు. మాపై ప్రజలకు విశ్వాసం పెరిగింది, వాళ్ల అంతరాత్మను సర్వేలు ఆవిష్కరించాయి అని చెప్పారు. తమకు యూపీఏ సర్కార్ వస్తుందా.. ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందా అనేదానికన్నా తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షల మేరకు కృషి చేయడమే ప్రధానమన్నారు.

తెలంగాణలోని 13 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని తేల్చిన టైమ్స్ నౌ సర్వే తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వాస్తవాన్ని ప్రతిబింబించిందని రాజేందర్ అన్నారు. గతంలోకూడా వివిధ సంస్థలు జరిపిన 5 సర్వేల్లోనూ ఇదే ఫలితం వచ్చిందని గుర్తు చేశారు. ఇక జాతీయ మీడియా సంస్థలు ప్రజల నాడికి అద్దం పడుతున్నా సీమాంధ్ర పత్రికలు మాత్రం వివక్షతో వ్యవహరిస్తున్నాయన్నారు. సర్వే నివేదికలను సైతం సీమాంధ్ర పత్రికలు వక్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1969 ఉద్యమం నుంచి నేర్చుకున్న పాఠంతో ‘రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ’ అన్న కేసీఆర్ విశ్వాసం విజయం సాధించిందన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలతో నెంబర్‌గేమ్ ముఖ్యమేనని కేసీఆర్ పార్టీ ప్రారంభించిన నాడే చెప్పారని గుర్తు చేశారు. యూపీఏ ఎజెండాలో తెలంగాణ అంశాన్ని పెట్టించడం, ప్రాణాలను ఫణంగా పెట్టి డిసెంబర్ 9 ప్రకటన సాధించడం కేసీఆర్ ఘనతేనన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ ప్రకటన వచ్చిందని చెప్పారు.

‘సంపూర్ణ తెలంగాణ’లో తేడా వస్తే యుద్ధమే!
ఇపుడు టీఆర్‌ఎస్‌పై మరింత బాధ్యత ఉంది.. సమస్యలు, శషబిషలు లేని 10జిల్లాల హైదరాబాద్‌తో కూడిన సంపూర్ణ తెలంగాణ కావాలని ప్రజలు కోరుతున్నారని ఆయన చెప్పారు. తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ గడ్డమీద ఉంటూనే తెలంగాణ ఇచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడుతున్న ద్రోహుల నిర్ణయాలను ప్రజలు ఒప్పుకునేందుకు సిద్దంగా లేరన్నారు. తెలంగాణపై షరతులు చెల్లవని ఆయన తెలంగాణ వ్యతిరేక పార్టీలకు హెచ్చరిక చేశారు. తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత టీఆర్‌ఎస్‌పై ఉందని, ఆ సత్తా టీఆర్‌ఎస్‌కే ఉందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు కట్టుబడి ఇప్పటికే కొంత కార్యాచరణ ప్రకటించామని, త్వరలో మరింత కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు, జగన్‌ల తెలంగాణకు వ్యతిరేక వైఖరిని గమనించి ఆ పార్టీనుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు హరీశ్వర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంప గోవర్ధన్, విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు.

8 ఎంపీలతో బాబు థర్డ్‌ఫ్రంట్‌కు నాయకుడవుతాడా?: శ్రావణ్
ఆంధ్రపెట్టుబడిదారుల సీమాంధ్ర చివరికి సర్వేలనూ వక్రించి ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడుస్తున్నాయని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ టైమ్స్ నౌ ప్రతిష్టాత్మక సర్వేను న్యూస్ కాదు వ్యూస్ అన్నట్లుగా చూపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రెండు సీట్లున్న టీఆర్‌ఎస్ 13 సీట్లు సాధిస్తుందన్న అంచనాను , 70నుంచి 80 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుందన్న నివేదికలోని అంశాన్ని తొక్కిపెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌కు 21నుంచి 23 శాతానికి ఓట్లు పెరిగాయన్నది సర్వే సారాంశం కాగా కలసిరాని కాలం అంటూ రాయడంపై విస్మయం వ్యక్తం చేశారు. 8 ఎంపీ స్థానాలు గెలిచే బాబు థర్డ్ ఫ్రంట్‌కి నాయకత్వం వహిస్తాడని రాసుకున్నారని ఎద్దేవా చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.