తెలంగాణలో జగన్,బాబు గాయబ్ టీఆర్‌ఎస్సే

-కారుకు 12, హస్తానికి 4, ఎంఐఎం 1
-సీమాంధ్రలో వైఎస్సార్సీపీ 13, టీడీపీ 9 కాంగ్రెస్ 3
-ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏకు 137 సీట్లే
-ఇండియా టుడే -సీఓటర్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు ఖాళీ అవుతాయని ఇండియాటుడే-సీ ఓటర్ సర్వే పేర్కొంది. విభజన అనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ సర్వే నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు 12 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని, కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. మరో స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంటుందని సర్వే పేర్కొంది. ఇక సీమాంవూధలో వైఎస్సార్సీపీ బలం పుంజుకుంటుందని, ఆ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక్కడ టీడీపీ 9 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు గెల్చుకుంటాయని తెలిపింది. మొత్తంగా దేశవ్యాప్త పరిస్థితిని చూస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి దాదాపు 122 స్థానాలు కోల్పోతుందని సర్వే వెల్లడించింది.

యూపీఏకు లోక్‌సభలో ప్రస్తుతం 259 స్థానాలుండగా ఆ సంఖ్య 137కు పడిపోతుందని తెలిపింది. యూపీఏతోపాటు ఎన్డీఏ కూడా స్వల్పంగా నష్టపోతుందని సర్వేలో తేలింది. తక్షణం ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 4 స్థానాలు కోల్పోయి 155 స్థానాలకు పరిమితమయ్యే అవకాశముందని సర్వే తేల్చింది. యూపీఏ కోల్పోయే స్థానాలను ప్రాంతీయపార్టీలు సాధిస్తాయని సర్వే వెల్లడించింది. ఎన్డీఏ, యూపీఏ యేతర పార్టీలు 251 స్థానాలు సాధించి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన బలాన్ని సాధిస్తాయని సర్వే తేల్చిచెప్పింది. యూపీఏకు లభించే ఓట్లు 8 శాతం కోల్పోయి 28కి పడిపోతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఎన్డీఏ తన ఓట్లవాటాను ఆరుశాతం పెంచుకుని 32శాతం వాటా సాధిస్తుందని తెలిపింది. ఆంధ్రవూపదేశ్‌లో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 33 ఎంపీలుండగా తక్షణం ఎన్నికలు జరిగితే అందులో కేవలం ఆరు మాత్రమే గెలవగలదని సర్వే తెలిపింది. బీహార్‌లో బీజేపీతో దశాబ్దన్నర స్నేహానికి వీడ్కోలు పలికిన జేడీయూ 10 స్థానాలు కోల్పోయి భారీ మూల్యమే చెల్లిస్తుందని సర్వే తేల్చింది.

అయితే బీజేపీకి పెద్దగా లాభముండకపోగా ఆర్జేడీ ప్రస్తుతమున్న 4 స్థానాలనుంచి 14 స్థానాలకు
తన బలాన్ని పెంచుకుంటుందని సర్వేలో తేలింది. గుజరాత్‌లో బీజేపీకి 25 స్థానాలు దక్కనుండగా, కాంగ్రెస్ కేవలం 5 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే తెలిపింది. అయితే కర్ణాటకలో బీజేపీ భారీ మూల్యమే చెల్లించుకుంటుందని, ఆ రాష్ట్రంలో బీజేపీ 12 స్థానాలు కోల్పోతుందని తెలిపింది. మహారాష్ట్రలో శివసేన బలం పుంజుకుంటుందని సర్వే పేర్కొంది. ఉత్తరవూపదేశ్‌లో అధికార ఎస్‌పీ34, బీఎస్పీ 27 స్థానాలు గెలుస్తాయని తెలిపిన సర్వే కాంగ్రెస్ 16 స్థానాలు కోల్పోతుందని వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంటుందని సర్వే తెలిపింది. 42 స్థానాలున్న ఆ రాష్ట్రంలో అధికారపార్టీ సగానికిపైగా స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఈ నెల 2 తేదీల మధ్య ఎంపికచేసిన 15,815 మంది ఓటర్ల అభివూపాయాలు సేకరించి ఈ సర్వేను రూపొందించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.