తెలంగాణపై మిన్నాగుల పన్నాగం? చివరి కుట్రా?


ప్రాధాన్యత సంతరించుకున్న అక్బరుద్దీన్ ‘విద్వేష ప్రసంగాలు’
అశాంతి నెలకొల్పి.. ‘తెలంగాణ’ను జాప్యంచేసే యత్నమా?
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలు కొనసాగుతున్నదా?
తెలంగాణవాదుల మదిలో మెదులుతున్న అనుమానాలు
అప్రమత్తంగా ఉండాలి.. కుట్రలను తిప్పికొట్టాలి
తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ క్షిశేణుల పిలుపు
మరో 20 రోజుల్లో తెలంగాణపై విస్పష్టమైన నిర్ణయం రానున్న తరుణాన.. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ విషయంలో సానుకూలంగా స్పందించనుందన్న సంకేతాలు వస్తున్న సమయాన.. వరుస కోర్ కమిటీ భేటీలు విధివిధానాలపై కసరత్తు జరుపుతున్నాయన్న సమాచారాల నడుమ.. తెలంగాణ నిర్ణయం కోసం కోట్ల మంది జనం ఉవ్విళ్లూరుతున్న వేళ.. మరో కుట్రకు తెర లేచిందా? వ్యతిరేక శక్తులు మళ్లీ అడ్డం నిలుస్తున్నాయా? సాకారంకానున్న దశాబ్దాల తెలంగాణ కలను చివరి నిమిషంలో చిదిమేసేందుకు మిన్నాగుల పన్నాగ రచన జరిగిందా? సగటు తెలంగాణవాసికి.. నిత్య ఉద్యమకారుడికి తలెత్తుతున్న అనుమానాలివి! ఈ అనుమానానికి కేంద్రబిందువుగా మారాయి నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసినట్లు చెబుతున్న విద్వేష ప్రసంగాలు.. అనంతర వ్యవహారాలు!! తెలంగాణపై కీలక.. తుది నిర్ణయం తీసుకునేందుకు యువనేత రాహుల్‌గాంధీ సమక్షంలో జరుగనున్న మినీ కోర్‌కమిటీ సమావేశానికి ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై ప్రజల అప్రమత్తత అవసరమని అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు! ఉచ్చులో పడకుండా.. శాంతియుతంగా మెలిగి.. ఐక్యతను చాటి.. తెలంగాణకు సొంతమైన లౌకిక గుబాళింపులతో సొంత రాష్ట్రానికి స్వాగతం పలకాలని తీర్మానిస్తున్నారు ఉద్యమనేతలు!మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల నిర్మల్‌లో జరిగిన సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక తెలంగాణ వ్యతిరేక కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణకు తాము వ్యతిరేకమని, రాష్ట్ర విభజన జరిగితే రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఎంఐఎం ఉంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తమ అభివూపాయాలకు భిన్నంగా తెలంగాణ ఎలా వస్తుందో చూస్తామంటూ మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటనలు చర్చనీయాంశం అవుతున్నాయి. గత నెలలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలంగాణపై మునుపెన్నడూ లేని స్పష్టతనిస్తూ.. నెలలోపు తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో మరో 20 రోజులుమాత్రమే మిగిలి ఉన్నాయి. అంతకుముందే అక్బరుద్దీన్ నిర్మల్‌లో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. చట్టం తన పని తాను చేసుకుపోవడంతో పాటు.. రాజకీయంగా వివిధ పక్షాలు ప్రత్యేకించి బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి మజ్లిస్ సభల్లో ఎంఐఎం నేతల వివాదాస్పద ప్రసంగాలు కొత్తేమీ కాదని, సాధారణంగా ఆ పార్టీ సమావేశాల్లో నేతల ప్రసంగాలు ఇదే మోస్తరుగా కొనసాగుతాయనే ప్రచారం లేకపోలేదు. అయితే హైదరాబాద్ వెలుపల నిర్మల్ పట్టణంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల వెనుక తెలంగాణ వ్యతిరేకశక్తుల కుట్ర దాగిఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో కొంత ముందడుగు నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎంఐఎం వివాదాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించి కేంద్రం నిర్ణయంపై ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ వాదులు అభివూపాయపడుతున్నారు. సీమాంవూధుల కుట్రలో భాగంగానే అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం కల్పించే కుతంవూతాలు పన్నుతున్నారనే వాదన ముందుకు వస్తున్నది. సోమవారం హైదరాబాద్‌లో ‘తెలంగాణ ఎందుకు ఆలస్యమవుతున్నది?’ అనే పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక స్పష్టత వచ్చే సమయంలో కొంత మంది మత విద్వేషాలు రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చిల్లర ఎత్తుగడలను ఎదుర్కొనే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందని అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు.. అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందని మండిపడ్డారు. చెంచల్‌గూడ జైలు నుంచే వ్యూహ రచన చేసి, హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ సృష్టించి తెలంగాణ ఉద్యమాన్ని మలినం చేసేందుకు జగన్ కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రెండు సమైక్యవాద పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ కోదాడలో జరిగిన ఒక సభలో విమర్శించారు.

అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి సమక్షంలో దాదాపు రాజకీయపార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా చెప్పకపోగా సకాలంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఈ విషయంపై పరిష్కార మార్గానికి చొరవ తీసుకుంటున్నది. అందులో భాగంగానే సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ల సమక్షంలో కోర్ కమిటీ సమావేశాలు జరిగాయి. రాహుల్‌గాంధీ విదేశాల నుంచివచ్చినందున మంగళవారం జరుగుతుందని భావిస్తున్న మినీ కోర్‌కమిటీ సమావేశం తెలంగాణపై మరింత స్పష్టత వచ్చే అవకాశాన్ని పెంచింది. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసం తెలంగాణవాదుల్లో నెలకొంది. అయితే మరో ఇరవై రోజుల్లో పరిష్కార మార్గం కనిపిస్తుండగా, కుట్రదారులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇస్తే మైనారిటీలకు అభవూదత ఉంటుందని, మతకలహాలు పెరుగుతాయని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్బరుద్దీన్ ఒవైసీ పరిణామాల వెనుక ఇలాంటి కుట్ర దాగిఉందనే అనుమానాలు లేకపోలేదు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తున్నది. దీంతో ఈ వివాదం చిలికి చిలిగా గాలివానగా మారి మరింత ముదురుతున్నది. తెలంగాణపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో సీమాంధ్ర నేతలు అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకు, రాష్ట్రంలో శాంతియుత వాతావరణం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ వాదులు అభివూపాయపడుతున్నారు. అక్బరుద్దీన్ నిర్మల్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ముందస్తు కుట్ర దాగిఉందన్న అనుమానాలను టీ వాదులు వ్యక్తం చేస్తున్నారు. తాజా ఉద్రిక్తతలకు కారణాలు ఏమైనా తెలంగాణవాదులు మజ్లిస్, తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రలను ఛేదించే దిశగా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని ఉద్యమకారులు పిలుపునిస్తున్నారు.

-(నమస్తే తెలంగాణ పత్రికలోని వార్త)

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.