తెలంగాణపై జీవోఎం రిపోర్ట్ రెడీ

నవంబర్ 27 :శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టే దిశగా.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరో కీలక ఘట్టాన్ని దాటింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన సిఫారసులు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర విభజనపై నెలకొల్పిన మంత్రుల బృందం తన కసరత్తును ముగించింది. బుధవారం హోం శాఖ కార్యాలయమైన నార్త్‌బ్లాక్‌లో దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన చివరి భేటీలో రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన పద్ధతులపై జీవోఎం నివేదిక తయారు చేయటం దాదాపు పూర్తయిందని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.

చిన్న చిన్న మార్పులు ఉంటే చూసి.. దానిని ఫైనల్ చేసి, కేబినెట్‌కు సమర్పించే బాధ్యతను హోం మంత్రి షిండేకు అప్పగిస్తూ జీవోఎం ఏకక్షిగీవంగా నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ముందు న్యాయపరమైన చిక్కులేమీ లేవని నిర్థారించుకునేందుకు మరోసారి న్యాయశాఖకు నివేదికను పంపుతారని సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే న్యాయశాఖ తెలంగాణ ఏర్పాటు బిల్లు/ఆంవూధవూపదేశ్ రాష్ట్ర విభజన బిల్లును కేబినెట్‌కు అందిస్తుంది. ఇప్పటికే సదరు బిల్లును న్యాయశాఖ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఆర్టికల్ 371 డీ, భద్రాచలం వంటి అంశాలను బిల్లులో చేర్చుతూ న్యాయశాఖ తుది ముసాయిదాను తయారు చేయడం లాంఛనంగానే కనిపిస్తున్నది. దీనిని గురువారం నాటి కేబినెట్‌కు నివేదిక సమర్పిస్తారని తొలుత భావించినా.. ఆ సమావేశానికి నివేదిక వెళ్లటం లేదని షిండే చెప్పారు.

అయితే షిండే, న్యాయశాఖల లాంఛనపూర్వక ఆమోదముద్ర మాత్రమే మిగిలిన ఉన్న నేపథ్యంలో జైరాం రమేశ్ చొరవ చేస్తే న్యాయశాఖ నుంచి ముసాయిదా బిల్లు సత్వరమే రెడీ అవుతుందని, గురువారం సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఐటమ్‌గా రావచ్చని అభివూపాయాలు వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో తదుపరి కేబినెట్ సమావేశానికి నివేదిక సమర్పిస్తారని, సమయం లేదనుకుంటే తెలంగాణ అంశంపై ప్రత్యేకంగా ఒకటి రెండు రోజుల్లో కేంద్ర కేబినెట్ తిరిగి భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితే కేబినెట్ ఆమోదించే ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అక్కడి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లి వస్తుంది. డిసెంబర్ మొదటివారంలోనే బిల్లు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే వీలుందని అంటున్నారు. ‘బిల్లు విధి విధానాలు పూర్తయ్యాయి. నిర్ణయాలు జరిగాయి. సమావేశాలు ముగిశాయి. ఇక చర్చలుండవు. జీవోఎం సిఫారసులను సిద్ధం చేసి షిండేకు అప్పగించాం. కేబినెట్ ముందుకు ఆ నివేదికను తీసుకెళ్లే బాధ్యత ఆయనదే’ అని సమావేశం ముగిసిన అనంతరం ఒక సభ్యుడు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. దీంతో జీవోఎం పని ముగిసినట్లు తేలిపోతున్నది.

ఆచితూచి తుది చర్చలు
బుధవారం జరిగిన సమావేశంలో జీవోఎం తాను నిర్దేశించుకున్న 11 అంశాలకు సంబంధించి ఒకొక్క అంశంపై చర్చలను ఒక కొలిక్కి తెచ్చిందని సమాచారం. ప్రధానంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే పదేళ్ల కాలంలో శాంతి భద్రతలు, విభజన తర్వాత ఆస్తులు, నీటి వనరుల పంపకం, పోలీసు సిబ్బంది తదితర అంశాలపై తుది చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ సమావేశానికి షిండే, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, పీ చిదంబరం, ఏకే ఆంటోనీ, ప్రత్యేక ఆహ్వానితుడు నారాయణ స్వామి హాజరయ్యారు. హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో పాటు, నీటిపారుదల, విద్యుత్, ఆర్థిక, పాలన, న్యాయ, సిబ్బంది శాఖల కార్యదర్శులు, పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వీరితో జీవోఎం సభ్యులు సాయంత్రం ఐదు గంటల వరకు చర్చలు జరిపారు. విభజన అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయాలకు అనుగుణంగా వివిధ శాఖల కార్యదర్శులు సమాచారాన్ని అందించారని, పవర్ పాయింట్ ప్రజెం ద్వారా వివరించారని తెలిసింది. హోంశాఖ భద్రతా సలహాదారుడు విజయ్‌కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నక్సల్స్ సమస్య, ఇతరత్రా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం లేదని, ఎలాంటి ప్రతిబంధకాలున్నా రాష్ట్ర పోలీసు యంత్రాంగం వాటిని సమర్థంగా ఎదుర్కొనగలదని విజయకుమార్ వివరించినట్లు తెలిసింది.

సీమాంవూధకు ప్యాకేజీ
రాష్ట్ర విభజన సందర్భంగా నూతనంగా ఏర్పాటు కానున్న సీమాంధ్ర రాష్ట్రానికి కేంద్రం భారీ ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని జీవోఎం సిఫారసు చేయనున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌కు దీటుగా కొత్త రాజధానిని అభివృద్ధి చేసుకునేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ.. దాని నిర్మాణానికి నిధులను కేంద్రమే అందించేలా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు అందించేలా సిఫారసులు ఉన్నాయని తెలుస్తున్నది. ఆర్టికల్ 371 డీని ఉభయ రాష్ట్రాల్లో కొనసాగించాలని జీవోఎం తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

కీలకంగా వ్యవహరించిన సీఎస్
ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మాత్రం విభజన ప్రక్రియలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, పరిపాలనా వ్యవహారాలు, శాంతి భద్రతలు, సరిహద్దులు, ఉద్యోగులు తదితర అంశాలపై జీవోఎం కోరిన వివరాలను మహంతి అందజేసినట్లు తెలుస్తున్నది. బుధవారం నాటికి రాష్ట్ర ఆదాయం ఎంత? ఆప్పులు, ఆస్తులు ఎన్ని? సహజవనరుల ఉపయోగం ఎలా ఉంది? శాంతి భద్రతల పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై అధికారులు, మంత్రులు అడిగిన వివరాలను వెంటనే అందజేసి.. వారి పనిని సులువు చేశారని తెలుస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయేదాక ముసాయిదా బిలు,్ల నివేదిక కసరత్తులో పాల్గొన్న మహంతి ఐదు గంటలకు తన సమావేశాన్ని పూర్తి చేసుకున్నారు. గురువారం కూడా అందుబాటులో ఉండాలని జీవోఎం నుంచి మహంతికి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. సమావేశానికి ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ హాజరు కాలేదు.

బిల్లు తయారీలో జైరాం తలమునకలు
జీవోఎం నివేదిక తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్.. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగా ముసాయిదా బిల్లు తయారు చేసేందుకు నివేదికను తయారు చేస్తున్నారు. వివిధ శాఖల కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చిన జైరాం.. బుధవారం నాటి జీవోఎం సమావేశంలో కూడా అంతే చొరవ చూపారని సమాచారం. మొత్తంగా జీవోఎం పరిష్కరించాల్సిన 11 అంశాలపై పూర్తి అవగాహనతో కూడిన నివేదికను ఆయన సహచర సభ్యుల సహకారంతో తీర్చిదిద్దారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే సాయంత్రం ఆరుగంటలకే జీవోఎం సమావేశం ముగిసిన తర్వాత షిండే, జైరాంరమేశ్‌లు హోంశాఖ అధికారులతో సమావేశాన్ని కొనసాగించారు. అనంతరం షిండే అక్కడి నుంచి బయటికి వెళ్లిపోగా.. జైరాంరమేశ్ మాత్రం అధికారులతో సంప్రదింపులు జరిపారు. రాత్రి తొమ్మిది గంటల దాకా ఆయన హోంశాఖ కార్యాలయంలోనే ఉండి.. నివేదిక తయారీ పనిని పూర్తి చేసుకుని దానిని తన వెంట తీసుకెళ్లారు.

ఐటమ్‌గా కేబినెట్ ముందుకు?
సాధ్యమైనంత వరకూ తెలంగాణ అంశం ఐటమ్‌గా కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, లేని పక్షంలో ఒకటిరెండు రోజుల్లో ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం జరుగుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గురువారం జరిగే కేబినెట్ భేటీ అజెండాలో తెలంగాణ అంశం లేదు. గతంలో కూడా తెలంగాణ అంశాన్ని ఐటమ్‌గా చేర్చారు. ప్రస్తుతం కూడా న్యాయశాఖ నుంచి ముసాయిదా బిల్లు ఖరారై అనుకున్న సమయానికి అందితే.. తెలంగాణ అంశం ఐటమ్‌గా కేబినెట్ అజెండాలో చేరుతుందని అంచనా వేస్తున్నారు. అనంతరం బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళుతుందని, ఆయన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ అభివూపాయం కోరుతూ పంపిస్తారని సమాచారం. రాష్ట్రపతి నుంచి బిల్లు రాగానే మూడు రోజుల్లోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, పోలీసు అధికారులతో మంగళవారమే ఆయన చర్చలు జరిపారు. బిల్లు రాగానే స్పీకర్ కార్యాలయం నుంచి సభ్యులకు ఈ-మెయిల్, సెల్‌ఫోన్ మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తారని, అతి త్వరగానే దీనిపై అభివూపాయాన్ని రాష్ట్రపతికి పంపించే వీలుంటుందని తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తానిచ్చిన మాట మేరకు సకాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల అయ్యేలా రాష్ట్రపతితోనూ చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.

సీమాంధ్ర మంత్రులతో జైరాం భేటీ
అంతకు ముందు ఉదయం జీవోఎం తరఫున సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులతో జైరాం భేటీ జరిపారు. రానున్న కొద్ది రోజుల్లో చేపట్టబోయే రాష్ట్ర విభజన మార్గదర్శిక ప్రణాళిక గురించి వారికి వివరించేందుకే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తున్నది. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన కేంద్రమంత్రి కే చిరంజీవి.. రాష్ట్ర విభజనను ఆపడం అసాధ్యమని తేల్చేశారు. ఇంకా సమైక్యవాదం వినిపించడం దండగని చిరంజీవి చెప్పారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు శాశ్వత కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇవ్వాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ఎంపిక చేసేందుకు ఒక కమిటీని నియమించాలని కోరినట్లు మరో కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. అనంతరం వారంతా కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరంతో సమావేశమయ్యారు. మరోవైపు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హోం మంత్రి షిండేను కలిశారు.
యూటీ అవసరం లేదు: దిగ్విజయ్
రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. పార్టీ విధేయుడిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉంచేందుకు యూటీ చేయాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణలు లేకుండానే ఉమ్మడి రాజధానిని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగం అనుమతిస్తున్నదని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు రావడం తథ్యమని అన్నారు.

నేడు హస్తినకు డిప్యూటీ సీఎం
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గురువారం ఢిల్లీ బయల్దేరి వెళుతున్నారు. కేంద్రం పిలుపుమేరకు ఆయన ప్రయాణం ఖరారైంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం ఢిల్లీలో సాయంత్రం జరగనున్నది. దీనికి ముందుగానే డిప్యూటీ సీఎంతో జీవోఎం చివరి సారిగా సమావేశం కానుంది. తెలంగాణ విషయంలో తీసుకోబోయే చర్యలను ఆయనకు వివరిస్తారని తెలుస్తున్నది. సీమాంధ్ర కేంద్రమంత్రులతో చివరిసారి మాట్లాడేందుకు పిలిచినట్లుగానే డిప్యూటీని కూడా పిలిచి ఉంటారన్న అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీని హుటాహుటిన ఢిల్లీకి పిలిచిన నేపథ్యంలో గురువారమే తెలంగాణ బిల్లు కేబినెట్‌కు వస్తుందన్న అంచనాలు బలపడుతున్నాయి.

అరుణాచల్ మోడల్‌గా హైదరాబాద్!
రాష్ట్ర విభజనలో అత్యంత కీలకంగా నిలిచింది హైదరాబాద్ విషయమే. దీనిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర నేతలు, ఆ ప్రాంత కేంద్ర మంత్రులు పట్టుపట్టుతుండగా.. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు విధించినా మళ్లీ ఉద్యమం తప్పదని తెలంగాణవాదులు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇతర అంశాలపై సులువుగానే ఒక అభివూపాయానికి వచ్చినా.. హైదరాబాద్ విషయమే నివేదిక తయారీలో ఇంతటి జాప్యానికి కారణమైందని తెలుస్తున్నది. దీంతో సీమాంధ్ర నేతలను సంతృప్తి పరిచేలా ఒక నిర్ణయానికి జీవోఎం వచ్చినట్లు తెలుస్తున్నది. ఒక రాజధానిని రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొంతకాలం కొనసాగించే క్రమంలో కేంద్రపాలితంగా మార్చకుండా రాజ్యాంగపరమైన వెసులుబాటును ఆర్టికల్ 371 (హెచ్) ప్రకారం కల్పించారు. దీని ప్రకారం హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, విద్య, వైద్యం, భూ పరిపాలన అంశాలు గవర్నర్ పర్యవేక్షణలో ఉంటాయి.

ప్రస్తుతం ఇదే విధానంలో అరుణాచల్‌వూపదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు, విద్య, వైద్యం, భూపరిపాలన గవర్నర్ చేతిలో ఉన్నాయి. అయితే రాష్ట్ర శాసన వ్యవస్థ తన అధికారాలను గవర్నర్‌కు అప్పగిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆర్టికల్ 258(ఏ) ప్రకారం ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంవూతులతో పాటు డీజీపీలు, కేంద్రం నుంచి ఓ ప్రతినిధితో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం మరో మార్గం. మరో కీలకాంశంగా నిలిచిన భద్రాచలం విషయంలో మధ్యేమార్గంగా ముంపు ప్రాంతాలను సీమాంవూధలో కలుపుతూ మిగిలిన భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే అంతర్భాగంగా ఉంచాలని జీవోఎం సిఫారసు చేయనుందని సమాచారం.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.