తెలంగాణపై ఇంచు కూడా తగ్గం- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

తెలంగాణపై ఒక్క ఇంచు కూడా వెనకకుతగ్గేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు బీజేపీ సంపూర్ణంగా మద్దతునిస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు మద్దతునిచ్చే విషయంలో కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. సవాల్ చేసి చెబుతున్నా.. తెలంగాణకు వ్యతిరేకంగా తమ పార్టీ నాయకులెవరూ మాట్లాడలేదని పేర్కొన్నారు.ఈ విషయంలో దుష్ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బందంతో ఢిల్లీకి వెళ్ళి జాతీయ నాయకులతో మాట్లాడామని, తెలంగాణ బిల్లును పాస్ చేయించే బాధ్యత బీజేపీదేనని వారు స్పష్టం చేశారని ఆయన తెలిపారు.

kishauncleతెలంగాణ ఉద్యమంలో జాతీయ పార్టీగా బీజేపీ క్రియాశీలంగా ఉద్యమించినందువల్లే కాంగ్రెస్ భయపడి విభజన ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి బీజేపీ మద్దతు అత్యవసరమన్నారు. బీజేపీ పట్ల మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సీమాంధ్ర ఎంపీలు గొడవచేస్తే వారిని సస్పెండ్ చేస్తారో, బహిష్కరిస్తారో కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చుకోవాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో బిల్లును తిరస్కరించడం, ఢిల్లీలో ధర్నాను నిర్వహించడం వంటి చర్యలకు దిగినా కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆహార భద్రత బిల్లు సందర్భంగా బీజేపీ ప్రతిపాదించిన సవరణలను పట్టించుకోకుండా బిల్లును పార్లమెంట్‌లో పెట్టినా బీజేపీ మద్దతునిచ్చిందని, తెలంగాణ బిల్లు విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తామని తెలిపారు.

నిజాయితీగా తెలంగాణ బిల్లుకు ఓటేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఎజెండా ముందుకు సాగుతామని, ఓట్లు, సీట్లు తమకు ముఖ్యం కాదన్నారు. పొత్తుల అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి ప్రభంజనం వీస్తోందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ వైస్ చైర్మన్ నాగురావు నామాజీ, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రమేందర్‌రెడ్డి, ప్రదీప్, కాచం వెంకటేషం, వసుధరారెడ్డి పాల్గొన్నారు.

బిల్లు పాసయ్యేదాకా నీడలా వెంటాడుతాం: విద్యాసాగర్‌రావు
తెలంగాణ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో పాసయ్యేదాకా నీడలా వెంటాడుతామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉందన్నారు. బిల్లుకు బీజేపీ సంపూర్ణంగా మద్దతునిస్తుందని, ఈ విషయంలో ఎవరూ అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. గిరిజనుల హక్కులను కాలరాస్తే సహించేది లేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌తో భేటీ అయిన విషయంపై విలేకరులు పలు ప్రశ్నలు సంధించగా.. వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో.. ప్రస్తుతం బాబు వ్యవహారంలో తమకూ అదే పరిస్థితి కలిగిందని విద్యాసాగర్‌రావు చమత్కరించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.