తెలంగాణకు లోక్‌సభ ఆమోదం

– చర్చలో పాల్గొన్న షిండే, సుష్మ, జైపాల్
– పటాకులు పేల్చి.. గులాల్ చల్లుకుని
– పండుగ చేసుకున్న తెలంగాణవాదులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నది మొదలు విజయసౌధపు మెట్లను ఒక్కొక్కటిగా అధిరోహిస్తూ వచ్చిన తెలంగాణ.. టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదంతో గెలుపు శిఖరానికి చేరుకుంది. బుధవారం రాజ్యసభలో ఆమోదం పొంది.. రాష్ట్రపతి సంతకంతో గెజిట్‌లో ప్రచురణతో విజయపతాకాన్ని ఎగరేయనుంది. అడ్డంకులను నెట్టేస్తూ ముందుకు సాగిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014పై తీవ్ర ఉత్కంఠ నడుమ మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో చర్చ మొదలైంది. తొలుత మధ్యాహ్నం 12.45 గంటలకు వాయిదాపడి.. తిరిగి సమావేశమైన తర్వాత పరిస్థితిలో మార్పులేకపోవడంతో మరోసారి మధ్యాహ్నం 3గంటలకు వాయిదా పడింది.

tgmapసంధికాలాన్ని సద్వినియోగం చేసుకున్న యూపీఏ పెద్దలు బిల్లు ఆమోదానికి మార్గం సుగమం చేశారు. సీమాంధ్ర ఎంపీలు, ఇతర పార్టీల ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. చర్చ నడిపిన స్పీకర్ మీరాకుమార్..బీజేపీ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేయడంతో మూజువాణిఓటుతో బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో సీమాంధ్ర ఎంపీలు మినహా దాదాపు యూపీఏ సభ్యులంతా, ఒకటి రెండు పక్షాలు మినహాయించి ఎన్డీయే కూటమి మొత్తం మద్దతుగా నిలువడంతో బిల్లుకు మూడింట రెండు వంతులకుపైగా మెజార్టీ లభ్యమైంది. 2009, డిసెంబర్ 9న నాటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుకు చేసిన ప్రకటన పరిపుష్టమైంది. తదుపరి క్లాజులవారీగా షిండే ప్రతిపాదించిన 39 అధికారిక సవరణలు ఓటింగ్‌లో ఆమోదం పొందాయి.

ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, తృణమూల్ సభ్యుడు సౌగత్‌రాయ్ సహా పలువురు ప్రవేశపెట్టిన దాదాపు 67 ప్రైవేట్ సవరణలు వీగిపోయాయి. దీనికి ముందు 3గంటలకు సమావేశం తిరిగి ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికే ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. పెప్పర్‌స్ప్రే ఘటన.. దానిని మీడియా పదేపదే ప్రసారం చేసిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం మేరకే ప్రసారాలు నిలిపివేసినట్లు చానళ్లు ప్రచారం చేసినా.. సాంకేతిక ఇబ్బందులతోనే ప్రసారాలు ఆగిపోయాయని లోక్‌సభ టీవీ సీఈవో స్పష్టం చేశారు. ప్రత్యక్ష ప్రసారం లేకుండానే చర్చ, ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యాయి. చర్చను కొనసాగించిన షిండే.. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇస్తామని ప్రకటించారు.

మొన్నటి పెప్పర్ స్ప్రే ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు హరూన్ రషీద్, లాల్ సింగ్, భక్త చరణ్‌దాస్, హమ్‌దుల్లా సయీద్, మహాబల్ మిశ్రా, మరికొందరు షిండే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా అధికారపక్షం మొదటివరుస బెంచీలకు రక్షణగా నిలిచారు. అయితే.. రషీద్, సింగ్, మరో వామపక్ష సభ్యుడు తమ గొంతులను సవరించుకునేందుకు పిప్పర్‌మెంట్ బిళ్లను ఇచ్చిపుచ్చుకోవడం కనిపించింది. మొత్తంగా బిల్లు ఆమోదం పొందే సమయంలో స్పీకర్ వెల్ నినాదాలు, ప్రతినినాదాలతో రణరంగాన్ని తలపించింది. బెంగాల్‌లో బద్ధ విరోధులైన సీపీఎం, తణమూల్ సభ్యులు ఏకమై బిల్లును వ్యతిరేకించారు. చర్చలో పాల్గొన్న సుష్మాస్వరాజ్.. తెలంగాణ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నేను, మా పార్టీ బిల్లుకు మద్దతు పలుకుతున్నాం. తెలంగాణ ఏర్పాటు జరిగి తీరాల్సిందే.

మా విశ్వసనీయతను రుజువు చేసుకునేందుకు, తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరేందుకే మేం నిలబడ్డాం అని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్రకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బిల్లు ఆమోదం పొందాక మీరు సోనియా ఇచ్చారని, కాంగ్రెస్ ఇచ్చిందని పాటలుపాడుతారు. కానీ.. ఈ చిన్నమ్మను (తనను ఉద్దేశించి) మర్చిపోవద్దు అని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చర్చలో పాల్గొంటూ.. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అరవై ఏళ్లనాటిదని చెప్పారు. ఇన్నేళ్లూ ఆంధ్రా నాయకులు కుంభకర్ణుడిలా నిద్రపోయారా? అని ప్రశ్నించారు.

ఈ సమయంలో సోనియా జోక్యం చేసుకుంటూ.. పరుష పదజాలం వాడవద్దని వారించారు. టీ బిల్లు ఆమోదం నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురైన కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్.. తమ పార్టీ అధినేత్రి సోనియాకు పాదాభివందనం చేశారు. ఆమోదం ప్రక్రియ ముగిసి సభ వాయిదాపడిన తర్వాత సోనియా చిత్ర పటాన్ని పొన్నం ప్రదర్శించగా.. ఆమె వద్దంటూ వారించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక భూమిక వహించిన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విపక్షనేత సుష్మతో కలిసి బయటకు వస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. బిల్లు ఆమోదం సమయంలో పలువురు టీఎంసీ సభ్యులు ఆజ్‌కా దిన్ కాలా హై.. కాంగ్రెస్ బీజేపీ జోడా హై.. (ఈరోజు చీకటి రోజు.. కాంగ్రెస్ బీజేపీ జోడీ).. రాహుల్ మోడీ భాయి భాయి.. అంటూ నినాదాలు చేశారు.

లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిందన్న వార్తతో తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోని పది జిల్లాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. పటాకులు పేల్చి.. గులాల్ చల్లుకుని.. నృత్యాలు చేస్తూ తెలంగాణవాదులు పండుగ చేసుకున్నారు. అటు సీమాంధ్రలో నిరసనలు వ్యక్తమయ్యాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాజీనామా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బిల్లు ప్రవేశాన్ని అప్రజాస్వామికంగా అడ్డుకునేందుకు ప్రయత్నించి.. సభ నుంచి బహిష్కారానికి గురైన ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు.

కేంద్ర మంత్రి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మరో కేంద్ర మంత్రి పళ్లం రాజు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంకా సినిమా అయిపోలేదన్న మాజీ సినీ హీరో, కేంద్ర సహాయ మంత్రి చిరంజీవి.. రాజ్యసభలో బిల్లును అడ్డుకుంటానని ప్రతిన చేశారు.

This entry was posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.