తెలంగాణకు రానున్న వర్సిటీలు

-రాష్ట్ర విభజనతో కొత్తగా వెటర్నరీ, హార్టీకల్చర్ యూనివర్సిటీల ఏర్పాటు
-రైతులకు మరింత మెరుగ్గా సేవలు

రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణలో వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలుగా ఉన్న వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో ఉండగా, హార్టికల్చర్ యూనివర్సిటీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉంది. కొత్త రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఈ రెండు కొత్త యూనివర్సిటీలు తెలంగాణకు దక్కనున్నాయి. దీంతో ప్రభుత్వ ఫలాలు ప్రతి రైతుకు అందేందుకు వీలుంటుంది. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు మరింత మెరుగ్గా అమలయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. చిన్న రాష్ట్రం కావడంతో పథకాల పర్యవేక్షణ కూడా మెరుగయ్యే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల్లో విత్తన కంపెనీలుండటంతో విత్తన కొరత తగ్గుతుంది. వ్యవసాయ శాఖ ద్వారా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీ, పంట రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణలో ఇచ్చే సబ్సిడీలు, కౌలు రైతులకు రుణాలు, వంటి పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండగా, అది హైదరాబాద్‌లోని రాజేంవూదనగర్‌లో ఉన్నది.

దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలైన వెటర్నరీ వర్సిటీ, ఉద్యాన విశ్వవిద్యాలయం రానున్నాయి. ఇక ఉద్యోగుల విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడున్న జనాభా లెక్కల అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు అందుతాయి. అటెండర్ స్థాయి నుంచి గెజిటెడ్ అధికారుల వరకు తెలంగాణలోనే కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేసేకోవడానికి వీలుంటుంది. ప్రస్తుతమున్న రాష్ట్రస్థాయి అధికారులను కూడా సొంత ప్రాంతాలకు పంపించడంతోపాటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఉదాహరణకు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్‌తోపాటు ఏడు విభాగాలు పనిచేస్తున్నాయి. ఇందులో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పరిపాలన, విస్తరణ, ఆత్మ, సమేతిలకు గాను ఏడు మంది అదనపు సంచాలకులున్నారు. విభజన జరిగినట్లయితే ఈ ఏడుగురు అధికారుల్లో సీమాంధ్ర రాష్ట్రానికి నలుగురు, తెలంగాణ రాష్ట్రానికి ముగ్గురు అధికారులుగా విడిపోవాల్సి ఉంటుందని అంచనా. జిల్లా కేడర్‌లోని జేడీఏ పోస్టుల్లో తెలంగాణ వారినే నియమించుకునేందుకు వీలుంటుంది. పదోన్నతుల్లో అవకాశాలు అధికంగా ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక వ్యవసాయ విధానం
తెలంగాణ రాష్ట్రం కోసం వ్యవసాయ ముసాయిదా విధానాన్ని ప్రకటించాల్సి ఉన్నది. తెలంగాణలో మెట్టవూపాంతాలే అధికంగా ఉన్నాయి. వర్షాధారిత పంటలపైనే ఎక్కువ శాతం మంది రైతులు ఆధారపడి ఉన్నారు. బోర్ల కింద సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. తెలంగాణలో ఉన్న చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న వివిధ రకాల నేలలు, వాటిలో పండే పంటలకు అనుగుణంగా, రైతు అనుకూల వ్యవసాయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.