తెలంగాణకు తెడ్డు చూపారు

Chackoతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ 2009, డిసెంబర్ 9న ప్రకటించిన కేంద్రం.. తదనంతరం సీమాంధ్ర నేతల రాజీనామా డ్రామాల నేపథ్యంలో నాలుక మడతేయడమే కాకుండా.. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని మొత్తంగా అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ 2014 ఎన్నికల్లో పార్టీ గెలుపు ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మూడోసారి అధికారం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ పెద్దలు.. తెలంగాణ అంశాన్ని పూర్తిగా పక్కనపడేసినట్లు కనిపిస్తున్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంపై వెల్లు అవినీతి ఆరోపణల నుంచి దృష్టిమళ్లించేలా కళంకిత మంత్రులతో రాజీనామాలు చేయిస్తూనే.. మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుని ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు దృష్టి సారిస్తున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ అంశంతో ఢిల్లీ నేతలు, రాష్ట్ర నేతలు బంతాట ఆడుతున్నారు. తెలంగాణను కేంద్రమే తేల్చాలని, తాము చర్చించేది ఏమీలేదని రాష్ట్ర నాయకత్వం చెబుతుండగా.. తెలంగాణ ఏర్పాటు కేంద్రం అజెండాలో లేనేలేదని, అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమేనని జాతీయ నాయకత్వం కొత్త పల్లవి ఎత్తుతోంది.

విలేకరులతో అన్నారు. దీర్ఘకాలంగా నాన్చుతూ వస్తున్న తెలంగాణ అంశంపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించినప్పుడు చాకో ఈ విధంగా స్పందించారు. తాము తెలంగాణ వాగ్దానాన్ని నెరవేర్చడం లేదనడం సరికాదన్నారు. దేశంలో పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయని చెప్పారు. అయితే ఇదే చాకో ఈ ఏడాది జనవరిలో తెలంగాణపై అత్యంత సానుకూలంగా మాట్లాడటం గమనార్హం. ‘తెలంగాణకు కాంగ్రెస్ అనుకూలం. తగిన సమయం కోసమే చూస్తున్నాం. ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి రాజ్యాంగ ప్రాతిపదిక ఉండేలా చూస్తున్నాం. ఆ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది’ అని అన్నారు.

అంతేకాకుండా ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి తీసుకున్నదని, దానిని ప్రకటించడమే మిగిలి ఉందని కూడా చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం, యూపీఏ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటాయని రాష్ట్ర నాయకత్వం చెబుతుండగా.. ఇప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా తేల్చిపారేయడం తెలంగాణ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని నడివీధిలో నగ్నంగా నిలబెట్టిందని పలువురు తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇది లా ఉండగా.. రాష్ట్రంలో కళంకిత మంత్రులు స్వచ్ఛందం గా రాజీనామా చేస్తే మంచిదని చాకో సూచించారు. దేశం లో అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించివేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నూ అవినీతిని సహించదని చెప్పారు. కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొన్న అశ్విన్ కుమార్, పీకే బన్సల్‌లు తమ కేంద్ర మంత్రి పదవులకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసినట్లే ఆంధ్రవూపదేశ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తప్పుకోవాలని అన్నారు. లేని పక్షంలో ఆరోపణలున్న వారిపై పార్టీ కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.

దేశానికి పట్టిన చీడ.. కాంగ్రెస్ : ఈటెల
కాంగ్రెస్ పార్టీ మన దేశానికి పట్టిన చీడపురుగని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు. యూపీఏ అజెండాలో తెలంగాణ లేనేలేదని కుండబద్దలు కొట్టిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో వాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పద్ధతి లేని పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ మతిలేని వాదన చేస్తోందని, కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఈటెల విమర్శించారు. కేంద్ర మంత్రి చిదంబరం 2009డిసెంబర్ 9న పార్లమెంట్‌లో తెలంగాణను ప్రకటించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 120కోట్ల మంది భారత ప్రజల సాక్షిగా తెలంగాణను ప్రకటించి మళ్లీ యూటర్న్ తీసుకున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే తెలంగాణ ప్రజల చేతిలో పరాభావం తప్పదని ఈటెల హెచ్చరించారు.

2004లో ఎక్కడున్నావు చాకో : కర్నె
తెలంగాణ తమ ఎజెండాలో లేదని చెబుతున్న చాకో 2004లో ఎక్కడున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేవలం రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం కాంగ్రెస్‌కు ఆనాటి నుండి అలవాటైందని, ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోలేని కాంగ్రెస్‌ను తెలంగాణ సమాజం పాతరేస్తుందని అన్నారు. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్షికమంలో తెలంగాణ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని ఆయన మరిచిపోయినట్లున్నారని మండిపడ్డారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు తరువాయిగానే కాంగ్రెస్ అడుగులు ఉండాలని చెప్పారు. పనికిమాలిన మాటలు మానుకోవాలని హితవు పలికారు.

చాకోవి పిచ్చి వ్యాఖ్యలు : కేశవరావు
తెలంగాణ అంశంపై చాకో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు తీవ్రంగా మండిపడ్డారు. రెండు మాసాల క్రితం తెలంగాణపై అనుకూలంగా మాట్లాడిన చాకో మళ్లీ మాట మార్చి తన అవివేకాన్ని ప్రదర్శించుకున్నారని అన్నారు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలను, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేయవద్దని హితవు పలికారు. కనీస ఉమ్మడి కార్యక్షికమంలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను అగౌరపర్చేలా వ్యాఖ్యలు చేసిన ఆయన..వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని కేకే డిమాండ్ చేశారు. రానున్న 12 రోజుల్లోనే తెలంగాణ అంశాన్ని తేల్చుతారనే నమ్మకం లేదని కేకే చెప్పారు.

ఆ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం: యాదవడ్డి
చాకో వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవిగా ఉన్నాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయన ఇలా మాట్లాడం తగదని ఎమ్మెల్సీ యాదవడ్డి అన్నారు. తెలంగాణ అంశాన్ని అధిష్ఠానం త్వరగా తేల్చాలని కోరారు. కళంకిత మంత్రులపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చాకో వ్యాఖ్యానించడం సరికాదన్న యాదవడ్డి అధిష్ఠానమే నిర్ణయాన్ని ప్రకటించవచ్చు కదా అన్నారు.

చాకో రాజకీయ అజ్ఞాని
తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ మండిపాటు
తెలంగాణ అంశంపై ఏమీ తెలియకుండా మాట్లాడిన పీసీ చాకో ఒక రాజకీయ అజ్ఞాని అని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ విమర్శించింది. గత ఎన్నికల్లో తెలంగాణపై సోనియాగాంధీ ప్రచారం చేశారని, పార్లమెంట్‌లో తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నా మని రాష్ట్రపతి చెప్పిన విషయాలు ఆయనకు తెలియవా? జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా, ప్రజలను అగౌరపరిచిన చాకో వెంటనే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.