తెలంగాణకు తిరుగులేదు

నిర్ణయం మారదు కాలపరిమితి చెప్పలేం
జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు రెండేళ్లు పట్టింది.. తెలంగాణకు అంత కూడా పట్టదు
టీడీపీ నిర్ణయం ప్రజాస్వామికం.. మా నిర్ణయం నియంతృత్వమా?
నాటి హోం మంత్రి అద్వానీయే తెలంగాణ ఇవ్వలేమన్నారు
విపక్షాల విమర్శలపై చిదంబరం ఎదురుదాడి
మాది హడావిడి కాదు.. విస్తృత చర్చ తర్వాతనే నిర్ణయం
ఈ దశలో చర్చ అపరిపక్వమైనది.. కేబినెట్ నోట్ వచ్చాక మళ్లీ చర్చిద్దాం
రాజ్యసభలో షిండే తరఫున చిదంబరం జవాబు
chidambaram
న్యూఢిల్లీ, ఆగస్టు 12 :తెలంగాణ ఏర్పాటుపై ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు జరిగినా.. తమ నిర్ణయంలో మార్పు ఉండబోదని, తెలంగాణ ఏర్పాటు తథ్యమని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది. రాష్ట్ర ఏర్పాటుకు కాలపరిమితిని మాత్రం చెప్పలేమని తెలిపింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని, కానీ.. తెలంగాణ ఏర్పాటుకు అంత సమయం పట్టకపోవచ్చని పేర్కొంది. హైదరాబాద్, నదీజలాల పంపకం, భద్రత సహా అన్ని అంశాలపైనా పరిశీలన జరుపుతామని హామీ ఇచ్చింది. రాజ్యసభలో సోమవారం తెలంగాణపై మూడుగంటలపాటు చర్చ జరిగింది. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే స్వల్ప అస్వస్థతతో ఉన్న కారణంగా ఆయన తరఫున ఆర్థిక మంత్రి చిదంబరం ఈ చర్చకు సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తాము హడావిడిగా నిర్ణయం తీసుకున్నట్లు విపక్షాలు చేస్తున్న విమర్శలను, నిర్ణయం తీసుకునే ముందు తగినన్ని సంప్రదింపులు జరపలేదన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తన అనుభవంలో తెలంగాణ ఏర్పాటు విషయంలోనే సుదీర్ఘంగా, విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయని చెప్పారు. గతంలో తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు రెండు సార్లు రాష్ట్రంలోని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నానని చెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు సమయంలో అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడే దీనిపై పూర్తి స్థాయి చర్చ అపరిపక్వమైనదే అవుతుందని అన్నారు. కేబినెట్ నోట్ తర్వాత పార్లమెంటులో చర్చకు పెడతామని తెలిపారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని స్పష్టం చేశారు. సొంత పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి వ్యతిరేకతలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రభుత్వం కట్టుబడి ఉందా? అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ (బీజేపీ) ప్రశ్నించగా.. ‘తేదీ చెప్పలేను. కానీ.. పద్ధతికి అనుగుణంగా ప్రక్రియను ముందుకు తీసుకుపోతాం’ అని చిదంబరం బదులిచ్చారు. ఈ విషయంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చిదంబరం చెప్పారు.

ఈ అంశాన్ని దాదాపు నాలుగేళ్లు నాన్చిన కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుందని, తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదని చర్చ సందర్భంగా విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వం ప్రమాదకరమైన ఆట ఆడుతున్నదని ఆరోపించాయి. అయితే.. ఈ విమర్శలన్నింటినీ తోసిపుచ్చిన చిదంబరం.. అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని, కానీ.. తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు విమర్శస్తున్నాయని ఆయన ఎదురుదాడి చేశారు. మీరు ఎన్ని నిందలు వేస్తే కాంగ్రెస్ అంత బలపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై పార్టీలన్నీ తమ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయని ఆయన అన్నారు. తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని, కొన్ని తీసుకోలేదని, కొన్ని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటున్నాయని అన్నారు. చివరిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. దానికి అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా కేంద్రాన్ని కోరిందని చెప్పారు. ‘తెలంగాణ విషయంలో ఇప్పుడు ఏం అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. వీటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్‌పై నిందలు వేయాల్సిన అవసరమేంటి? మీరు ఎన్ని నిందలు వేస్తే కాంగ్రెస్ పార్టీ అంత బలపడుతుంది’ అన్నారు. టీడీపీని ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ఆర్థిక మంత్రి.. ‘తెలంగాణపై టీడీపీ నిర్ణయం తీసుకుంటే అది ప్రజాస్వామ్యమవుతుంది. అదే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే నియంతృత్వ నిర్ణయం అవుతుందా?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు చిదంబరాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.
digiraja
రాజకీయ పార్టీల అంతర్గత ప్రక్రియ గురించి మాట్లాడుకునే సమయం ఇది కాదని చిదంబరం అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ తగిన కసరత్తు చేయలేదన్న విమర్శను తిప్పికొట్టిన చిదంబరం.. ఈ బాధ్యతను ఒక బాధ్యతాయుత కమిటీకి అప్పగించామని చెప్పారు. సమగ్ర నిర్ణయానికి వచ్చేందుకు వీలుగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తమకు అవసరమైన సమాచారాన్ని అందించిందని తెలిపారు. ఆ సమాచారాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. కమిటీ సభ్యులు మూడు ప్రాంతాల ఆరోగ్యం, నదీ జలాలు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టారని పేర్కొన్నారు. హైదరాబాద్‌పై ప్రత్యేకంగా అధ్యాయం ఉందని అన్నారు. తెలంగాణపై బీజేపీ ఎప్పటికప్పుడు వైఖరి మార్చుకుంటూ పోయిందని చిదంబరం ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ సుముఖంగా లేదని 2002 ఏప్రిల్ 1న అప్పటి హోం మంత్రి అద్వానీ ఇచ్చిన లేఖను ఆయన ఉదహరించారు. విభజనపై ప్రజలు వ్యక్తం చేస్తున్న అన్ని ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలనే ప్రభుత్వం నిర్ణయించిందని చిదంబరం తెలిపారు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ప్రతిపాదించామని, దీనిపై సూచనలు సలహాలు వస్తే వాటినీ పరిశీలిస్తామని చెప్పారు.

సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే
హోంశాఖలో విభజన ప్రక్రియ
లగడపాటి సీడబ్ల్యూసీకంటే గొప్పోడా?
ఆయన ఒక ఎంపీ మాత్రమే
చెప్పాల్సింది ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పండి
రెచ్చగొట్టుడు మాటలొద్దు
సీమాంధ్ర నేతలకు దిగ్విజయ్ హెచ్చరిక
ఎవరేమన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కు తగ్గేది లేదని, ప్రక్రియ ఆగబోదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తేల్చిచెప్పారు. ‘సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. హోం మంత్రిత్వశాఖ చేపట్టే విభజన ప్రక్రియ దాని ప్రకారమే జరుగుతుంది’ అన్నారు. దీనిపై ఏమైనా ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలని, అంతేకానీ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సీమాంధ్ర నాయకులను ఆయన హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఆయన తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్‌సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లగడపాటి ఒక ఎంపీ మాత్రమేనని, సీడబ్ల్యూసీ సభ్యుడు కాదని అన్నారు. ఆయన సీడబ్ల్యూసీకంటే గొప్పవాడేమీ కాదని చెప్పారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర విభజన నిర్ణయం శిలాశాసనం కాదని, దాన్ని మార్చుకోవాల్సిందేనని లగడపాటి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సోమవారం ఉదయం డిమాండ్ చేశారు. నిర్ణయం మార్చుకోకపోతే అది నియంతృత్వపోకడ అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ దృష్టికి తీసుకువస్తూ.. లగడపాటి పేర్కొన్న విధంగా తెలంగాణ నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంటారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అలాంటిదేమీ లేదు. ఆయన ఎంపీ మాత్రమే. ఆయన సీడబ్ల్యూసీ కన్నా గొప్పవాడేమీ కాదు. ఆయన వ్యాఖ్యల ప్రభావం సీడబ్ల్యూసీపై ఉండబోదు. సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్. అన్ని పార్టీలతో కూలంకషంగా సంప్రదింపులు, కసరత్తు జరిపిన అనంతరమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకున్నది. సీడబ్ల్యూసీ నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం. సీమాంధ్ర ప్రాంత ప్రజల డిమాండ్లను సాధ్యమయినంతవరకు పరిశీలించి పరిష్కారాలు వెతుకుతాం. ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేశారు. సీమాంధ్ర మంత్రులు, సీనియర్ నేతలు బహిరంగ విమర్శలు మాని ఆంటోనీ కమిటీకి వారి డిమాండ్లను తెలియజేయాలని కోరుతున్నాను. హోం శాఖ విభజన ప్రక్రియ చేపట్టినా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. దాని ప్రకారమే ప్రక్రియ జరుగుతుంది’ అని స్పష్టం చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.