తెచ్చేది టీఆర్‌ఎస్సే


KCR-pepple

KCR-stnganpoor -ఉపప్రాంతీయ పార్టీతోనే తెలంగాణ సాధ్యం
-జార్ఖండ్‌ను తెచ్చింది ఎవరు?
-గులాబీ జెండా మొలవకపోతే నాగం జై తెలంగాణ అనేవారా?
-మాయల ఫకీర్లు కాంగ్రెస్‌గాళ్లు
-మాయల మరాఠీ చంద్రబాబు
-ధనవంతమైన రాష్ట్రంగా ఆవిర్భవించనున్న తెలంగాణ
-కడియంను వరంగల్ ఎంపీగా గెలిపిద్దాం
-స్టేషన్‌ఘన్‌పూర్ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
‘జాతీయ పార్టీ మంట్లె పార్టీ. ప్రాంతీయ, ఉపవూపాంతీయ పార్టీల మద్దతు లేకుండా కేంద్రంలో అధికారంలోకి వస్తరా? జాతీయ పార్టీలతోని తెలంగాణ వస్తదని చెప్పుతున్న నాగం జనార్దన్‌డ్డీ.. గులాబీ జెండా మొలవకపోతే నువు తెలంగాణ అనేటోడివా? మాయల మరాఠీ చంద్రబాబు, మాయలఫకీరు కాంగ్రెస్‌గాళ్లు తెలంగాణ ఇస్తరా? తెలంగాణ తెచ్చే సత్తా ఉప ప్రాంతీయ పార్టీకే ఉంది. జార్ఖండ్‌ను ఎవరు తెచ్చిండ్రు? జేఎంఎం కాదా? నీ బీజేపీ తెలంగాణ తెస్తుందా?’ అంటూ టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. జాతీయ పార్టీలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న వాదనలు తప్పని, ఉప ప్రాంతీయ పార్టీల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు. జార్ఖండ్ ఏర్పాటే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.

ఉప ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా సాగించిన ఉద్యమం ఫలితంగానే జార్ఖండ్ ఏర్పాటైందన్న విషయాన్ని జాతీయ పార్టీల నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీఆర్.. తాను ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేయడం వల్లే ఆనాడు కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని చెప్పారు.

ఇది మింగుడుపడని సీమాంధ్ర పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ.. వచ్చిన తెలంగాణను 24 గంటల్లోనే అడ్డుకున్నాయని మండిపడ్డారు. ఉద్యమం గడప గడపకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఎవరితరం కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయంలో మూడో వంతు తెలంగాణలోని 10 జిల్లాల నుంచే వస్తుందని అన్నారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో సమర్పించిన బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ఆదాయం రూ.62వేల కోట్లు కాగా అందులో తెలంగాణ 10 జిల్లాల నుంచి రూ.47వేల కోట్లు వస్తున్నదని, 13 సీమాంధ్ర జిల్లాల నుంచి రూ.15వేల కోట్లు మాత్రమే వస్తున్నదని వివరించారు. రాష్ట్ర ఆదాయంలో సీమాంధ్ర ప్రాంత ఆదాయం మూడో వంతు కూడా ఉండదని, మరి ఆ ప్రాంతానికి చెందిన నేతలు రాష్ట్రంపై పెత్తనం చెలాయించడం ఏంటని.. సొమ్ము తెలంగాణది… సోకు సీమాంవూధులదిగా మారిందని, దీనిని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆయన టీఆర్‌ఎస్ శ్రేణులకు ఉద్బోధించారు.

తెలంగాణ ఏర్పడితే దేశంలోనే ధనవంతమైన రాష్ట్రంగా వెలుగొందుతుందని అన్నారు. వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తామని, నిరుపేదలకు 121 గజాల స్థలంలో డబుల్ బెడ్‌రూం ప్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. సీమాంధ్ర సర్కార్ పక్కా ఇళ్ల పేరిట పందుల గుడిసెలు నిర్మించి ఇస్తున్నదని విమర్శించారు. తెలంగాణకు అడుగడుగున జరుగుతున్న అన్యాయాన్ని చూసే ఎదురుతిరిగామని అన్నారు.

రైతులకు లక్ష రూపాయల రుణం మాఫీ..
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో 21లక్షల రైతులు ఉన్నారని, వారందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల రూ.12వేల కోట్ల భారం పడుతుందని, అయినా రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ముందుకుపోతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాకో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక మూడేళ్లలోనే 5వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 8 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను చేస్తామని తెలిపారు. ఐదేళ్లు పూర్తయ్యేనాటికి 10వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. కొత్తగా బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా తెలంగాణలోని వేలమంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.

ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్య
తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధ విద్యను అమలు చేస్తామని కేసీఆర్ అన్నారు. మండలానికో రెసిడెన్షియల్ హాస్టల్‌ను ఏర్పాటు చేసి అందులో ఆధునిక వసతులు కల్పిస్తామని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్యాబోధన అందిస్తామన్నారు. కులాల పేరుతో హాస్టళ్లను ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్నారు. అందరికీ ఒకే విధంగా హాస్టల్ వసతి కల్పిస్తూ ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

కడియంకు వరంగల్ ఎంపీ…
తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై బలాన్ని ఇచ్చిన కడియం శ్రీహరిని వరంగల్ ఎంపీగా ఢిల్లీకి పంపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకోసం ఢిల్లీలో బలంగా కొట్లాడేందుకు వారిని పార్లమెంట్‌కు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు వద్దు ఉద్యమానికి అంకితమవుతామని చెపుతున్నప్పటికీ తెలంగాణ ప్రజలకు వారి సేవలు అవసరమున్నాయని కేసీఆర్ అన్నారు. వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరిని గెలిపించాలని పిలుపునిస్తూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

పాపపరిహారం కోసమే టీఆర్‌ఎస్‌లో చేరా: కడియం
‘సీమాంధ్ర పార్టీలో 30 ఏళ్లు పని చేశాను. 12 సంవత్సరాల నుంచి ప్రజలను తెలంగాణ విషయంలో మభ్యపెట్టాను. గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలతో తెలంగాణ ద్రోహిననిపించుకున్నాను. ఐదారేళ్ల నుంచి మధనపడుతున్నాను. పాపపరిహారం కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాను’ అని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్‌అని ప్రకటిస్తున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటుపై ఎందుకు డిక్లరేషన్ ఇవ్వరని చంద్రబాబును ప్రశ్నించారు. సోమవారం స్టేషన్‌ఘనపూర్‌లో కడియంకు సాదర స్వాగత సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణలో నాలుగు నెలలపాటు పాదయాత్ర చేశారు. వరంగల్ జిల్లాలో పది రోజులు నడిచారు. మాట్లాడిన ప్రతి చోట ‘నేను తెలంగాణకు వ్యతిరేకంకాదు, తెలంగాణను అడ్డుకోలేదు, భవిష్యత్‌లో అడ్డుకోను.. అన్నాడే తప్ప తెలంగాణకు అనుకూలమనే మాట మాట్లాడలేదన్నారు. మే27, 28 తేదీలలో జరిగిన మహానాడులో తెలంగాణపై స్పష్టమైన తీర్మానం చేయకుండా మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

ఉద్యమం బలంగా ముందుకు సాగుతున్నప్పుడల్లా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఓ మంద కృష్ణమాదిగ, ఓ గజ్జల కాంతం, ఓ చింతస్వామిని తెరపైకి తీసుకొస్తారని కడియం అన్నారు. ‘కొంతమంది నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. టీడీపీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో నాలుగు మంత్రిత్వ శాఖలను నిర్వహించాను. నాకు పదవులు కొత్తకాదు. తెలంగాణ కోసం ఐదారు సంవత్సరాలుగా తీవ్రంగా మధనపడుతూ చివరకు ప్రజల ఆకాంక్ష మేరకే టీఆర్‌ఎస్ పార్టీలో చేరా’ అని కడియం పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌తో కలిసి ఓ సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్ ఎన్నటికి తెలంగాణ ఇవ్వదు: కేశవరావు
‘ఢిల్లీలోని రామలీలా మైదానంలో ఒక్కరు చనిపోతే పార్లమెంటును బంద్ చేశారు. తెలంగాణ కోసం వెయ్యిమందికిపైగా చనిపోతే కనీసం పార్లమెంటులోకాని, అసెంబ్లీలోకాని చర్చ కూడా చేయలేదని టీఆర్‌ఎస్ నేత కే కేశవరావు విమర్శించారు. ‘కాంక్షిగెస్ తెలంగాణ ఇస్తదని ఇన్ని రోజులు మభ్యపెడుతూ ధోకాచేశాను. కాని తెలంగాణను కాంగ్రెస్ ఎన్నటికీ ఇవ్వదు’ అని చెప్పారు. తెలంగాణపై సోనియాగాంధీతో అనేక సందర్భాల్లో చర్చించానని, తెలంగాణ ఇచ్చే ఆలోచన సోనియాకు లేదని కేకే తేల్చి చెప్పారు. ‘పదిహేను రోజుల కిందట సోనియాగాంధీ నాతో మాట్లాడుతూ ‘నీకు అన్ని ఇచ్చాం ఇంకా ఏం కావాలి’ అని అడిగితే తెలంగాణ కావాలని స్పష్టం చేశానన్నారు.

పార్లమెంటు ముందు తెలంగాణ కోసం తెలుగు బిడ్డ చెట్టుకు ఉరేసుకొని చనిపోతే ఒక అరగంటపాటు అమరుడి మృతదేహాన్ని పార్లమెంటు ముందు ఉంచండని ప్రాధేపడ్డా ఉంచకుండా పంపించి వేయడమే కాకుండా హరీశ్‌రావుపై కేసు పెట్టించామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణను ఆపేశక్తి ఎవరికీలేదన్నారు. దేవుడు కూడా ఆపలేడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది జాతీయ పార్టీలతోనే కాదు ప్రాంతీయ పార్టీలతో కూడా సాధ్యమవుతుందన్నారు. 17 ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తప్పక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందని కేశవరావు అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.