తుది అంకానికి సిద్దమౌతున్న జీవోఎం

ఢిల్లీ : రాష్ట్రవిభజన అంశం తుది అంకానికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో జీవోఎం భేటీ కానుంది. కేంద్రహోంమంత్రి షిండే కార్యాలయంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు పలు శాఖలు నుంచి వచ్చిన నివేదికలపై చర్చ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే జీవోఎం 9 ప్రధాన శాఖల నుంచి నివేదికలు కోరగా, అన్ని శాఖలు జీవోఎంకు నివేదికలు అందజేశాయి. ఈ నివేదికలపై జీవోఎం సభ్యులు చర్చ జరిపి, రాష్ట్ర విభజన బిల్లులో చేర్చాల్సిన అంశాలపై ఓ నిర్ణయానికి రానున్నారు.

వారి పరిశీలనలోని పలు అంశాలు..సీమాంధ్రకు ఇవ్వాల్సిన ప్యాకేజీలపై, హైదరాబాద్, ఆర్టికల్ 371(డి), నదీ జలాలు, విద్యుత్ అంశాలపై జీవోఎం చర్చించే అవకాశం ఉంది. ఆ తదుపరి జీవోఎం తెలంగాణ బిల్లు రూపకల్పనకు పూనుకోనుంది. ఈ నెల 14 లేదా, 21న జరిగే కేబినెట్ భేటీలో బిల్లు పెట్టేందుకు జీవోఎం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 12న జరిగే అఖిలపక్ష భేటీకి ఐదు పార్టీలకు మాత్రమే జీవోఎం ఆహ్వానం పంపింది.

అఖిలపక్షానికి రావడం లేదని ముందే చెప్పిన టీడీపీ, వైసీపీ, సీపీఎం పార్టీలకు ఆహ్వానం పంపడం లేదని కేంద్రహోంశాఖ పేర్కొంది. జీవోఎం సభ్యులతో ఒక్కోపార్టీకి అరగంట అవకాశం ఇవ్వనున్నారు. ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఈ పార్టీలతో జీవోఎం భేటీ ఒకే రోజుకు పరిమితం కానుంది. 12న ఉ. 11 గం.కు ఎంఐఎం, 11.30 గం.కు బీజేపీ, మ.12 గం.కు సీపీఐ, సా.5గం.కు కాంగ్రెస్, 5.30 గం.కు టీఆర్‌ఎస్‌తో జీవోఎం సభ్యులు భేటీ కానున్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.