తీర్మానం నుంచి ఆమోదం దాకా..ఓ యుద్ధ దశ్యం

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకఘట్టం సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం. 2013 జూలై 30న జరిగిన ఆ సమావేశం తీసుకున్న నిర్ణయంతోనే తెలంగాణ దాదాపు ఖాయమైపోయింది.అదే రోజు జరిగిన యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ఒకే చేయడంతో కేంద్రం ఆమోదించినట్టే అయ్యింది. తెలంగాణ ప్రజలు కోరుతున్న 10 జిల్లాల తెలంగాణకు సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ నిర్ణయాన్ని ముందే పసిగట్టిన సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు 2009నాటి పాత స్క్రిప్టు తీసి తీవ్రస్థాయి ఉద్యమం చేపట్టారు. గత అనుభవం దష్ట్యా ప్రజలను రోడ్లమీదికి తెస్తే మళ్లీ తెలంగాణ ఆపవచ్చనివారు ఎత్తుగడ వేశారు. ప్రజలకన్నా ఎక్కువగా సీమాంధ్ర మీడియా ఉద్యమాన్ని నడిపింది. దాదాపు 40 రోజులపాటు ఈ తతంగం కొనసాగింది. స్వయంగా ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో ఉద్యోగసంఘాలు సమ్మె చేపట్టాయి. దీనితో తెలంగాణ ప్రకటన ఆమోదించాల్సిన కేంద్ర కేబినెట్ భేటీ వాయిదా పడుతూ వచ్చింది.

ఇదే తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి కలకలం సష్టించారు. దీనితో ఏకపక్షమన్న అపప్రథ రాకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడింది. కేంద్రమంత్రి ఆంటోనీ నేతత్వంలో ఓ కమిటీ వేసి సీమాంధ్రప్రజల భయాలు సందేహాలు వెల్లడించుకునే అవకాశమిచ్చింది. జూలై ఆఖరున తీసుకున్న నిర్ణయం కేబినెట్ ముందుకు రావడానికి రెండు నెలలు పట్టింది. చివరికి అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసి వివిధవర్గాలతో సంప్రదింపులకు మంత్రివర్గ బందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ ముగింపుకు వచ్చే దశలో రెండు రాయలసీమ జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రతిపాదన రావడంతో తెలంగాణ ఆగ్రహంతో బంద్ జరిపి తన నిరసనను వ్యక్తం చేసింది. బీజేపీ కూడా వ్యతిరేకించడంతో 10 జిల్లాల తెలంగాణే చివరకు ఖాయమైంది.

ఎట్టకేలకు జీఎంవో రూపొందించిన తుది ప్రతిపాదనలను డిసెంబర్ 5న కేంద్రకేబినెట్ ఆమోదించింది. సీమాంధ్ర నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చినా కాంగ్రెస్ అధిష్టానం ససేమిరా అన్నది. సీమాంధ్ర రాజకీయగణాలు న్యాయస్థానాలకెక్కారు. రాష్ట్రపతిపై ఒత్తిడి చేశారు. రాజీనామాలు ప్రకటించారు. చివరికి సొంతప్రభుత్వం పైనే అవిశ్వాసం ప్రతిపాదించారు. కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా డ్రాప్టు బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి డిసెంబర్ 11న బిల్లు మీద ఆమోదముద్ర వేసి అభిప్రాయప్రకటనకు రాష్ట్ర అసెంబ్లీకి పంపిచారు. అసాధారణంగా 45 రోజుల గడువు ఇచ్చారు. ఏదో రకంగా బిల్లును జాప్యం చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన వచ్చేదాక నిరోధించగలిగితే తెలంగాణ ఆగుతుంది అనే వ్యూహ రచన చేశారు. బిల్లు వచ్చే నాటికే సభను వాయిదా వేయడం ద్వారా కాలహరణం చేయాలని చూశారు.

ఎట్టకేలకు సభకు చేరుకున్న బిల్లును అసెంబ్లీలో కాకుండా చేసే కుట్ర చేశారు. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క చాకచక్యంగా బిల్లును చర్చకు పెట్టడంతో ఆ ప్రయత్నం భగ్నమైంది. సభలో పెట్టిన బిల్లును చించి పోగులు పెట్టారు. కాల్చి కక్ష తీర్చుకున్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23 దగ్గరకు చేరుకున్నాక చర్చ ప్రారంభించారు. మరింత సమయం కావాలని రాష్ట్రపతిని కోరుతూ ముఖ్యమంత్రి లేఖలు రాశారు. రాష్ట్రపతి మరో వారం రోజులు ఆమోదించారు. ఆఖరుక్షణంలో జనవరి 30న కుట్రపూరితంగా బిల్లును తిరస్కరించేందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం చేపట్టి ఒక్క నిమిషంలో ప్రవేశం, ఓటింగ్ జరిపి మూజువాణి ఓటులో ఆమోదం జరిగిందని ప్రకటించుకున్నారు. దీని ఆధారంగా రాష్ట్రప్రక్రియ ఆపాలని సీమాంధ్రులు చేసిన కుట్రలపై న్యాయస్థానం నీళ్లు చల్లింది. విభజన వ్యతిరేక పిటిషన్లంటినీ కోర్టు తిరస్కరించింది.

ఎట్టకేలకు 9 వేల సవరణలు, 87 మంది సభ్యుల అభిప్రాయాలతో బిల్లు తిరిగి కేంద్రానికి చేరింది. విభజనను ఆపేందుకు ముఖ్యమంత్రే ఫిబ్రవరి 5న ఢిల్లీలో మౌనదీక్ష చేశారు. ఫిబ్రవరి 7న కేంద్ర కేబినెట్ బిల్లును క్లియర్ చేసింది. రాష్ట్రపతి అంగీకారంతో లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రవేశపెట్టారు. సీమాంధ్ర నాయకులు సభలో కనీవినీ ఎరుగని గందరగోళం సష్టించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ప్రయోగంతో భయోత్పాతం సష్టిస్తే , టీడీపీ ఎంపీ మోదుగుల కత్తి తీశాడని ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 18న లోక్‌సభ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. మరుసటి రోజు 19నాడే రాజ్యసభ బిల్లును ఆమోదిస్తుందని అంతా భావించారు. బీజేపీ మడతపేచీ పెట్టింది. ప్రధాని స్వయంగా బీజేపీ నేతలతో సమావేశాలు జరిపి హామీలు ఇవ్వడంతో పాటు రాజ్యసభకు స్వయంగా హాజరై ఆరుసూత్రాల ప్రకటన చేయడంతో ఎట్టకేలకు బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.రాష్ట్రపతి సంతకం మినహా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమై పోయింది.

This entry was posted in ARTICLES, TELANGANA NEWS.

Comments are closed.