ఢిల్లీ వెళుతున్నా..స్వరాష్ట్రంతోనే తిరిగొస్తా : కేసీఆర్

హైదరాబాద్ : ఇప్పుడే ఢిల్లీవాళ్లతో మాట్లాడా.. ఏం పర్వాలదేని భరోసా ఇచ్చారు. ఏపీ నుంచి ఢిల్లీ వెళ్తున్నా .. తెలంగాణ రాష్ర్టంతోనే తిరిగి వస్తా.. పిచ్చి ఛానళ్లలో తలతోక లేని వార్తలు చూసి గాబరా పడొద్దని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 15 లోపు పార్లమెంటులో బిల్లు పాసవుతుందని, ఎలక్షన్ నోటిఫికేషన్ లోపలే అపాయింటెడ్ డేట్స్ వస్తయని, తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ స్ఫష్టం చేశారు.

ఈ 14 ఏళ్లలో తానేం మాట్లాడానో అదే జరిగిందని, లంకలో పుట్టిన రాక్షసులంతా ఒక్కటే అన్నట్లు ఆంధ్రా నాయకులంతా ఒక్కటేనని, ఆంధ్రాలో ఇంత చిల్లర నాయకులున్నారా?, అసలు చంద్రబాబుకు తలకాయ ఉన్నదా?.. ఆయనేం మాట్లాడుతున్నడు… నాలుగు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నరు అని ఘాటుగా విమర్శించారు. వెయ్యి సంవత్సరాలు బతకడానికి ఎవ్వరూ పుట్టలేదని, ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విష బీజాలు నాటుతున్నారని, విడిపోయాక ఇరు రాష్ట్ర రాష్ర్టాల మధ్య సఖ్యత ఉండాలి తప్ప ఆంధ్రా ప్రజలపై తెలంగాణ ప్రజల్లో ఏహ్య భావం పెంచకూడదని హితవు పలికారు. కిరణ్ కుమార్‌రెడ్డికి స్క్రూ లూజుంటే ఏవరేం చేస్తరు, ఆయన సీఎం స్థాయికి తగ్గట్లు మాట్లాడటం లేదు, కిరణ్ కిరికిరి ఇంతటితో లాస్ట్ అన్నారు.

బిల్లును తిరస్కరించినట్లు స్పీకర్ ప్రకటన చేయలేదని, బిల్లుపై చర్చ ప్రక్రియ ముగిసిందని స్ఫష్టంగా చెప్పిన తర్వాతనే సీఎం తీర్మానం గురించి మాట్లాడారని కేసీఆర్ వివరించారు. అసెంబ్లీ అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రం పక్కాగా జరుగుతుందని చెప్పారు. బిల్లును తిరస్కరించడానికి ఏపీ అసెంబ్లీకి ఎలాంటి హక్కులేదని, అవసరమైతే అసెంబ్లీని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని, శాసించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఎన్నో సార్లు ఆర్టికల్ 3 మీద సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఆంధ్ర ప్రదేశ్ ఎప్పడు విభజించాలన్నా ఇదే పద్దలో జరుగుతుంది కానీ కొత్త పద్దతంటూ ఉండదని, ఉత్తరాఖండ్ విభజన కూడా ఇలాగే జరిగిందని కేసీఆర్ తెలిపారు.

బిల్లులు రెండుమూడు ఉండవని, అసెంబ్లీకి ఎప్పుడైనా డ్రాఫ్ట్ బిల్లే వస్తుందని, అసెంబ్లీ అభిప్రాయంపై కేంద్ర కేబినెట్ రివ్యూ చేస్తుందని, ఏమైనా మార్పులు చేర్పులుంటే చేస్తుందని, బిల్లు పార్లమెంటులోకి పోయిన తర్వాత కూడా మార్పులుండవచ్చని కేసీఆర్ తెలిపారు.

తన జీవితంలో తాను ఎన్నడూ ఓడిపోలేదని, రాష్ట్ర ఏర్పాటు గొప్ప సాఫల్యమని, రేపటి బంగారు తెలంగాణగా పునర్నిర్మించుకోవడానికి పోరాడతానని కేసీఆర్ అన్నారు. అమర వీరుల త్యాగఫలమే తెలంగాణ అని ఈ తెలంగాణ అమర వీరులకు అంకితమన్నారు.

ఆంధ్రా మీడియా చిల్లర ప్రచారాలు మానుకోవాలి
మీడియా రాతలతోనో కూతలతోనో తెలంగాణ రాష్ట్రం ఆగదని, ఆంధ్రా మీడియా పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని కేసీఆర్ సూచించారు. ఏదో జరిగి పోయిందని సీమాంధ్ర మీడియా పైశాచిక సునకానందం పొందుతున్నాయని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మానుకుని రెండు ప్రాంతాల ప్రాంతాలు కలిసిమెలిసి జీవించేలా వ్యవహరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ ముఖం పెట్టుకుని ఉంటరు?.. ఏం సంజాయిషీ ఇచ్చుకుంటరు?.. పిచ్చి బొమ్మలు, పిచ్చిరాతలు రాస్తే విభజన ఆగిపోతుందా?.. ఒకడు సమైక్య సింహం అంటడు.. ఇంకోడు సమైక్య కిరణం అంటడు.. ఏం సీంహం.. ఏం కథ.. అని ఘాటుగా స్పందించారు. విడిపోతే ఏకాభిప్రాయం కావాలంటారు… మరి కలిసుండటానికి వద్దా?.. న్యూస్ ఛానళ్లా..? లేక వ్యూస్ ఛానళ్లా? అని మీడియాను ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.