ఢిల్లీ..జరభద్రం!

ఫిబ్రవరి 15 :చట్టసభలపై నమ్మకంలేని శక్తులు.. ఇప్పుడు పార్లమెంటును అడ్డుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కల సాకారమయ్యే క్షణాలను నిరోధించేందుకు బైలెల్లాయి! నిన్నటికి నిన్న ప్రజాస్వామ్య అత్యున్నత సౌధం కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి.. దేశ రాజధాని సాక్షిగా తెలుగుజాతి పరువు తీసిన నేతల కనుసన్నల్లో.. సకల ఏర్పాట్లతో బయల్దేరాయి! రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న పెట్టబడిదారీ రాజకీయ నాయకుల ఆర్థిక సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన రైళ్లు.. వేల సంఖ్యలో జనాన్ని మోసుకుంటూ హస్తినబాట పట్టాయి! వారి లక్ష్యం ఒక్కటే! ఏది చేసైనా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం! ఇప్పటికే వారి నేతలు పార్లమెంటులోనే దాడులకు దిగి.. పెప్పర్ స్ప్రేలు చల్లి దిశానిర్దేశం చేయగా.. అంతకు మించిన అల్లకల్లోలాన్ని పార్లమెంటు వెలుపల సృష్టించడమే వీరి ఆఖరి పన్నాగం! ఈ ఉపద్రవాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని, హస్తినను అల్లోకల్లోలం చేసేందుకు వస్తున్న సీమాంధ్రులు ప్రయాణిస్తున్న రైళ్లు ఢిల్లీకి చేరకుండా నిలిపివేయాలని టీ జేఏసీ, టీ అడ్వకేట్స్ జేఏసీ నేతలు ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదులు అందజేశారు.

parlameతెలంగాణ వ్యతిరేకుల ప్రయత్నాలు ఎలా ఉన్నా.. 17తేదీన టీ బిల్లుపై చర్చ చేపట్టి.. ఆమోదించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ సహా పలువురు జాతీయ పార్టీల నాయకులను టీ జేఏసీ నాయకులు కలుస్తున్నారు. మొత్తంగా ఏపీఎన్జీవోలు చేపట్టిన ఆందోళనల్లో జొరబడి.. భయానకవాతావరణం సృష్టించడమే సీమాంధ్రనేతలు తీసుకువస్తున్నవారి లక్ష్యంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన బిల్లును ఇప్పటికే లోక్‌సభలో హోం మంత్రి షిండే ప్రవేశపెట్టారు. దీనిపై సోమవారం చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో దీనిని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఢిల్లీ ఎపిసోడ్‌కు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఒకవైపు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు మరోవైపు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తున్నది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పేరిట ఏపీఎన్జీవోలు ఈ నెల 17, 18 తేదీల్లో ఇక్కడి రాంలీలా మైదానంలో నిరసన సభకు ఉపక్రమిస్తుండగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ జంతర్‌మంతర్ వద్ద 17న ఒక రోజు దీక్షకు దిగుతున్నారు.

ఈ రెండు కార్యక్రమాలకు సీమాంధ్ర ప్రాంతం నుంచి జనాన్ని రైళ్లలో తరలిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఆరుగురు ఎంపీలతో పాటు, పార్లమెంటులో సభ నుంచి సస్పెండ్ అయిన సీమాంధ్ర ఎంపీలు కూడా అశోక్‌బాబు కార్యక్రమానికి పూర్తి అండదండలు ఇస్తున్నారని సమాచారం. సమైక్యవాదాన్ని ఢిల్లీకి చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సదరు నాయకులు పేర్కొంటున్నా.. పార్లమెంట్‌లో టీ బిల్లు ప్రక్రియను అడ్డుకోవడమే వీరి వ్యూహంగా తెలుస్తున్నది. సస్పెన్షన్ కారణంగా సభలోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయిన ఎంపీలు.. పార్లమెంటు బయట అవసరమైతే హింసను ప్రేరేపించి, ఆ సాకుతో బిల్లును అడ్డుకునేందుకు తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేస్తున్నట్లు వినిపిస్తున్నది. పార్లమెంట్‌లో సస్పెన్షన్ వేటు పడిన మోదుగల వేణుగోపాల్‌రెడ్డిని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు శనివారం కలువడం ఇందులో భాగమేనని తెలంగాణవాదులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు.

మరికొందరు సీమాంధ్ర నేతలను అశోక్ బాబు కలిసి ఈ మేరకు వ్యూహరచనలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 16 ప్రత్యేక రైళ్ల కోసం అనుమతి కోరగా, కేవలం 6 రైళ్ళకు మాత్రమే రైల్వేశాఖ అనుమతిచ్చినట్లు చెబుతున్నారు. అయితే.. 8 రైళ్లు బయల్దేరుతున్నట్లు కూడా సమాచారం ఉంది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆరు రైళ్లు, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరో రెండు రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. సీమాంధ్రలోని ప్రధాన నగరాలైన విజయవాడ, కాకినాడ, నెల్లూరు, అనంతపురం, రేణిగుంట, రాజమండ్రి ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్ళు శనివారం బయలుదేరాయి. వీటిలో సుమారు 15 వేల మంది సీమాంధ్రలు ప్రయాణిస్తున్నట్లు అంచనా. లగడపాటి, అశోక్‌బాబు, జగన్, చంద్రబాబు వంటి నేతల ఫోటోలను ప్రదర్శిస్తూ జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వీరు రైళ్లలో ప్రయాణిస్తున్నారు.

తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు పెప్పర్‌స్ప్రే చిమ్మిన లగడపాటిని, విధ్వంసానికి పాల్పడిన మోదుగులను జాతీయ మీడియా దనుమాడినా.. ఛీత్కరించినా.. సీమాంధ్రలో మాత్రం వారు హీరోలయ్యారు. దీన్ని మరింత క్యాష్ చేసుకునే దిశగా పార్లమెంటు వెలుపల కూడా హింసను ప్రేరేపించి తమ బలం చాటుకునే ఉద్దేశంతో ఈ నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఎన్నికలకు తమ ఢిల్లీ కేంద్రంగా తమ ప్రచారాన్ని ప్రారంభించే ప్రయత్నమే కనిపిస్తున్నది అంటున్నారు. అందుకే జగన్, చంద్రబాబు సహా పలువురు తెలంగాణ వ్యతిరేకులంతా ఢిల్లీ చేరి.. తమ బలం చాటే ప్రయత్నం చేస్తున్నారని టీవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక ఉద్యమంలో తమ వంతు భాగాన్ని సుస్థిరం చేసుకోవడానికే ఏపీఎన్జీవో సభకు చంద్రబాబు పోటీలుపడి జనాన్ని తరలిస్తున్నారని, జగన్ కూడా విడిగా తన ఒక్క రోజు దీక్షా స్పెషల్‌ను హస్తినకు పరిచయం చేస్తున్నారని అంటున్నారు. ఇదే సందర్భాన్ని తమకు అనుకూలంగా వాడుకునేందుకు సీఎం వర్గం, బహిష్కత ఎంపీలవర్గం కూడా ప్రయత్నిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన సభకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే ఉద్దేశంతో హాజరవుతున్నారని అంటున్నారు. సీఎం కిరణ్ కూడా ఈ సభలో పాల్గొనే అవకాశాలున్నట్లు వినిపిస్తున్నది.

ఢిల్లీలో సీమాంధ్ర నేతల మకాం: ఇప్పటికే రాజధాని నగరంలో సీమాంధ్ర నేతలు, అక్కడి సంఘాల నాయకులతో నిండిపోయింది. ఏపీభవన్‌తోపాటు.. చాలా వరకూ హోటళ్లలో సీమాంధ్ర నాయకులు బస చేశారని సమాచారం. ఒకవేళ ఢిల్లీ పోలీసుల నుంచి ఆటంకాలు ఎదురైనా, 17వ తేదీన రాంలీలామైదానంలో జరిగే సభకు చేరుకునే విధంగా, అవసరమైతే పార్లమెంట్ వద్ద హింసాత్మక ఘటనలకు పాల్పడే విధంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాంలీలా మైదానంలో సభకు వస్తున్న వారికి అక్కడే హీటర్లు ఏర్పాటు చేసిన వసతి కల్పిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణవాదులు కూడా పెద్ద సంఖ్యలోనే ఢిల్లీలో మకాం వేసి ఉండటం, సీమాంధ్ర నుంచి కూడా భారీ సంఖ్యలో కదిలి వస్తుండటంతో ఢిల్లీలో రానున్న రెండు రోజులు యుద్ధవాతావరణాన్ని కల్పించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

ఇదే అంశాన్ని టీజేఏసీ నాయకులతోపాటు.. అడ్వకేట్ జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకత్వం ఢిల్లీ పోలీసులను కలిశారు. హింసాత్మక ఘటనలకు జరిగే ఆస్కారం ఉందని, కనుక వారి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రత్యేకించి ఏపీ భవన్, పార్లమెంట్ పరిసరాల్లో ప్రత్యేక నిఘా వేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తెలంగాణ బిల్లును తిప్పి కొట్టాలి : అశోక్‌బాబు
టీ బిల్లును తిప్పి కొట్టి దేశంలో ప్రజాస్వామ్యం ఉందని నిరూపించాలని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు జాతీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే ధర్నాకు జాతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు శనివారం మీడియాకు తెలిపారు. గురువారం లోక్‌సభలో జరిగిన ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజ్‌లను బయటపెట్టాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. జాతీయ మీడియాలో సీమాంధ్ర ఎంపీలకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలను ఖండించారు. జాతీయ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడుబోయిందని ఆరోపించారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.