ఢిల్లీ కప్పులో రాయల టీ కషాయం!

ఒప్పుకుంటే ఆంక్షల్లేని హైదరాబాద్.. ఉమ్మడి రాజధానిగా ‘రెవెన్యూ డివిజన్’.. భద్రాచలం మొత్తం తెలంగాణకే వెనుకబాటు ప్రాంతాలకు ప్యాకేజీలు.. దామోదరకు అధిష్ఠానం ప్రతిపాదన?
సమస్యే లేదన్న డిప్యూటీ సీఎం.. పది జిల్లాల తెలంగాణే కావాలి.. ఆంక్షల్లేని హైదరాబాదే ఉండాలని స్పష్టీకరణ సోనియాను కలిసిన చిరంజీవి.. రాయల తెలంగాణకు అభ్యంతరం లేదని వ్యాఖ్య

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడంతోపాటు.. రాజకీయ ప్రయోజనాలను కూడా ఆశిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనతో హైదరాబాద్‌పై ఆంక్షల అంశాన్ని ముడిపెట్టినట్లు తెలుస్తున్నది. తాము సూచిస్తున్న విధంగా రాయల తెలంగాణకు అంగీకరిస్తే హైదరాబాద్‌పై ఆంక్షలు లేకుండా చూస్తామని తెలంగాణ ప్రాంత కీలక నేత, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు ప్రతిపాదన చేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి. జీవోఎం సభ్యులైన జైరాంరమేశ్, ఏకే ఆంటోనీలతో డిప్యూటీ సీఎం శనివారం సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఇదే అంశంపై దామోదరతో దిగ్విజయ్ మంతనాలు సాగించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనను డిప్యూటీ తిరస్కరించిన నేపథ్యంలో హైదరాబాద్‌పై ఆంక్షలు ఉపసంహరించడంతోపాటు.. ఇతర ప్రయోజనాలను తెలంగాణకు కల్పిస్తామని జైరాం చెప్పారని సమాచారం. భద్రాచలం డివిజన్‌ను పూర్తిగా తెలంగాణలోనే ఉంచుతామని, ఉమ్మడి రాజధాని పరిధిని కేవలం హైదరాబాద్ రెవెన్యూ డివిజన్‌కు మాత్రమే పరిమితం చేస్తామని, తెలంగాణపై ఇతర ఆంక్షలు విధించకుండా చూడటంతోపాటు.. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలు కూడా ఇస్తామని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తున్నది.

damochiru అయితే ఈ తాయిలాలకు లొంగేది లేదన్న రాజనర్సింహ.. తెలంగాణ ఉద్యమం ఏ ప్రాంతానికి స్వేచ్ఛ కోరుకున్నదో అదే ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారని సమాచారం. రాయల తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం లేదని నచ్చజెప్పబోయిన జైరాం.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణకే దక్కుతుందని, అపార ఖనిజ సంపదతో కూడిన నల్లమల అడవులు తెలంగాణ పరిధిలోనే ఉంటాయని అన్నట్లు తెలిసింది. కృష్ణా జలాల వాడకంలో పూర్తి హక్కు తెలంగాణకే దక్కుతుందని, అటు 147 అసెంబ్లీ స్థానాలతో, 21 ఎంపీ సీట్లతో సీమాంధ్రకు దీటుగా తెలంగాణ నిలుస్తుందని వివరించారని తెలిసింది. ఈ ప్రతిపాదనలను దామోదర నిర్దంద్వంగా తిరస్కరించడంతో ఆయనను అనునయించేందుకు ప్రయత్నించిన జైరాం ‘మీరు రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి, అక్కడి సామాజికవర్గాల ఆధిపత్యం గురించి బెదిరిపోవడం సరికాదు’ అన్నట్లు సమాచారం.

జైరాంతో భేటీ అనంతరం ఆంటోనీని దామోదర కలిశారు. ఆయన కూడా ఈ ప్రతిపాదన వల్ల ప్రక్రియ సాఫీగా ముగుస్తుందని చెప్పారని తెలిసింది. అయితే తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, పది జిల్లాల తెలంగాణనే ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని మరోసారి ఆంటోనీకి ఆయన వివరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పార్టీ అధినేత్రి సోనియాతో జీవోఎం సభ్యుడు గులాం నబీ ఆజాద్ శనివారం సమావేశమయ్యారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. మరోవైపు సోనియాను కలిసి, హైదరాబాద్‌ను యూటీని చేయాలని కోరిన చిరంజీవి.. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాయల తెలంగాణ ఏర్పాటు రాయల సీమ ప్రజల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

మేం కోరుకున్న తెలంగాణ అది కాదు
రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తేవడంపై తెలంగాణవాదుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ బిడ్డలు చేసిన ఆత్మత్యాగాలు మరో రెండు జిల్లాలను కలుపుకునేందుకు కాదని.. పది జిల్లాల ప్రత్యేక రాష్ట్రం కోసమేనని తెలంగాణవాదులు స్పష్టం చేస్తున్నారు.ఇప్పటికే సీమాంధ్రతో ఐదు దశాబ్దాలపాటు గోసపడ్డామని.. ఇక రాయలసీమ జిల్లాలను కలుపుకొని మళ్లీ ఇబ్బందులు పడాలా? అని ప్రశ్నిస్తున్నారు. సీమ ప్రజలు కూడా రాయలతెలంగాణ కోరుకోవడం లేదనటానికి ఇటీవలి సీమాంధ్ర ఉద్యమాల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడమే సాక్ష్యమని అంటున్నారు. హైదరాబాద్‌పై కన్నేసిన అక్కడి కొందరు నాయకులు మాత్రమే రాయలతెలంగాణ డిమాండ్‌ను ముందుకు తెస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. 12వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలను గుర్తించేందుకు కూడానిరాకరించిన వారితో కలిసి ఉండటం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు.

tgcupcopy వారు తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలను ఎన్నడూ గౌరవించింది లేదని, పైగా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రెండు జిల్లాల నాయకులు అర్థంలేని ఈ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు జిల్లాలను తెలంగాణ ప్రాంతంతో కలిపితే లాభం లేకపోగా.. మరిన్ని నష్టాలు భవిష్యత్తులో ఎదురవుతాయని చెబుతున్నారు. కృష్ణా జలాల పంపకం సులభమవుతుందని చేస్తున్న వాదనలు సత్యదూరమని తెలంగాణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైగా ఈ రెండు జిల్లాల్లో కృష్ణానదిపై కట్టిన అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలు అంగీకరించాల్సి వస్తుందని అంటున్నారు. అదే జరిగితే ఈ రెండు జిల్లాల్లో కృష్ణాబేసిన్‌లో కట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోయినా నీళ్లు ఇవ్వాల్సి వస్తుందని, దాని వల్ల నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు నీటి విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటాయని అంటున్నారు.

ఈ రెండు జిల్లాలతో సఖ్యత కూడా గతంలో లేదని, అందుకు ఆర్డీఎస్ తూములను బాంబులు పెట్టి పేల్చి.. నీటిని తరలించుకుపోయిన ఉదంతాలే సాక్ష్యమని గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా కూడా తెలంగాణలోని పార్టీలు రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ అంటే పది జిల్లాలతోకూడిన ప్రాంతమేనని, అందులో రాయలసీమ జిల్లాలను చొప్పించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని టీఆర్‌ఎస్ తేల్చి చెబుతున్నది. త్యాగాల పునాదులపై ఏర్పాటు కానున్న తెలంగాణ రాష్ట్రం పదిజిల్లాలతో సంపూర్ణంగా దక్కాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. టీ కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే వైఖరితో ఉన్నారు. మంత్రులు జానారెడ్డి, పొన్నాల, దుద్దిళ్ల తదితరులతోపాటు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం రాయల తెలంగాణ ఏర్పాటును ముమ్మాటికీ వ్యతిరేకిస్తామని చెబుతున్నారు.

రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా భిన్నమైనవని, అటువంటప్పుడు తెలంగాణ ప్రాంతంతో వారు ఎలా కలుస్తారని అంటున్నారు. రాయలసీమ వాసులు కూడా తమది ప్రత్యేక సంస్కృతని, నాలుగు జిల్లాలతో కూడిన తమ ప్రాంతాన్ని చీల్చుతామంటే ఒప్పుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. రాష్ట్రం విడిపోతే తాము కోస్తాతో కలిసి ఉండలేమని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. కోస్తా నాయకత్వం తమను అణచివేస్తుందన్న భయం వారిని వెంటాడుతున్నది.ఈ క్రమంలోనే తాము సమైక్య రాష్ట్రాన్ని కోరుకున్నాం తప్పించి.. తెలుగుజాతి ఐక్యత కోసం కాదని కొందరు నేతలు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలుతో కాంగ్రెస్ రాజకీయ లక్ష్యాలు నెరవేరినా.. ప్రజల అభీష్టాలు మాత్రం దెబ్బతింటాయని ఉభయ ప్రాంతాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1700 గ్రామాలు రాయల తెలంగాణ కోరుతున్నట్లు తీర్మానాలు చేశాయని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు చెబుతున్నా.. వాటిపై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. వీటిని బయటపెట్టాలని విశాలాంధ్ర మహాసభ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు నాయకత్వం వహిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి,చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ నాయకులే. అసలే విభజనను వ్యతిరేకిస్తున్న వీరు.. రాయలసీమను విభజిస్తామంటే అసలే ఒప్పుకోరని విశ్లేషకులు అంటున్నారు. ఇది శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తుందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రాయల తెలంగాణను తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు.
ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ప్రసక్తే లేదు. ఇదే విషయాన్ని ఇప్పటికే హై కమాండ్‌కు చెప్పాం.
శ్రీధర్ బాబు, మంత్రి

రాయల తెలంగాణ ఇచ్చినా, హైదరాబాద్‌ను యూటీ చేసినా అంగీకరించే ప్రసక్తే లేదు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే తెలంగాణ ఏర్పాటు కావాలి. రాయల తెలంగాణ అంటే ప్రజలు నిస్పృహకు గురయ్యే ప్రమాదముంది.
పొన్నాల లక్ష్మయ్య, మంత్రి

తెలంగాణపై సీమ ఆధిపత్యాన్ని రుద్దితే మరోసారి
సకలజనుల సమ్మెకు సిద్ధం. రాయల తెలంగాణ అనడం రాజకీయ కుట్రే. తెలంగాణ ప్రజలు ఇతర ప్రతిపాదనలను అంగీకరించే ప్రసక్తి లేదు.
శ్రీనివాస్ గౌడ్, టీ జేఏసీ నేత

తెలంగాణ రైతులను అన్యాయం చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్డీఎస్ తూములు పగులగొట్టిన వారితో తెలంగాణ ప్రజలు కలిసి ఉండలేరు. రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు.
హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ ఎమ్

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.