డ్రాఫ్ట్ బిల్లులో సవరణల కోసం ప్రధానికి కేసీఆర్ లేఖ

తెలంగాణ ముసాయిదా బిల్లులో అభ్యంతరాలపై ప్రధానమంత్రి మన్మొహన్‌సింగ్‌కు టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ 14 పేజీల లేఖ రాశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ డ్రాప్ట్ బిల్లులో కొన్న అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సవరణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాసినమని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అంగీకారం కాని అంశాలను లేఖలో ప్రస్తావించామన్నారు. నీటి పంపకాలు, ఉద్యోగుల పెన్షన్‌లపై న్యాయం జరగలేదన్నారు. గవర్నర్ చేతిలో శాంతి భద్రతలు పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు. నేటివిటీ ఆధారంగానే ఉద్యోగులను, పెన్షనర్లను విభజించాలని పేర్కొన్నారు. ఎక్కడ డబ్బు ఖర్చయితే ఆ రాష్ట్రమే అప్పు భరించాలని తేల్చి చెప్పారు. ఆంధ్రా ప్రజలను వంచిస్తూ అక్కడి ప్రజలకు ఏం కావాలో కోరకుండా సీమాంధ్ర నేతలు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

సీమాంధ్ర నేతలు డ్రామాలాడుతున్నారు:
సీమాంధ్ర నేతలు డ్రామాలు ఆడుతున్నరని తెలిపారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలు ఇప్పటికైకా కళ్లు తెరిచి ఆ పార్టీ నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. విభజనపై చంద్రబాబు ఇంకా విషం కక్కుతూనే ఉన్నారని విమర్శించారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు పార్టీలో కొనసాగడం అనైతికమన్నారు. టీడీపీ నేతలకు రోషముంటే పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో వైసీపీ శకం ముగిసింది:
తెలంగాణలో వైఎస్‌ఆర్‌సీ పార్టీ, శకం ముగిసిందని, ఆ పార్టీ ఇక్కడ అంతరించిపోయిందని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డలు వైఎస్‌ఆర్‌సీ పార్టీలో కొనసాగడం కన్నతల్లికి కొరివిపెట్టడమేనన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, ఇలాంటి పిచ్చిపనుల వల్లే ఆనాడు రాజాజీ ఆంధ్రాప్రజలను వెళ్లగొట్టాడని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సహృదయత గుర్తించి మెలగాలని తెలిపారు. తెలంగాణ ప్రజలు విడిపోవాలంటే కలిసుండాలని కోరడం అవివేకమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి మూర్ఖుడు:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకంటానంటూ బీరాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూర్ఖుడని కేసీఆర్ విమర్శించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం ఒకసారి రాజ్యాంగంను చదువుకొని మాట్లాడాలని ధ్వజమెత్తారు. లోక్‌సభలో 50 మంది సభ్యులు హాజరైతే దానిలో 26 మంది సభ్యులు మద్దతు తెలిపితే తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.