డ్యాంలో నీళ్లు లేవు.. మూత్రం పోసి నింపమంటారా?

నీటి విడుదలకు 55రోజులుగా ఓ రైతు చేస్తున్న నిరశన దీక్షపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హేళన
– జనాభా పెరగడానికి విద్యుత్ కోతలే కారణమంటూ వ్యాఖ్యలు
– కస్సుమన్న బీజేపీ.. రాష్ట్ర రాజకీయ చరివూతలో అట్టడుగు స్థాయి వ్యాఖ్యలని విమర్శ
పంటలు ఎండిపోతున్నాయి.. డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయండని ఓ రైతు నిరశన దీక్ష చేస్తుంటే.. ‘‘డ్యాంలో నీళ్లు లేవు, మూత్రం పోసి నింపాలా?’’ అంటూ ఓ బాధ్యతగల మంత్రి వ్యాఖ్యానించిన అనాగరిక సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ దారుణ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. సాక్షాత్తు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్. ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవార్‌కు స్వయానా మేనల్లుడు కూడా. పంట ఎండిపోతున్నది.. డ్యాం నుంచి నీళ్లు వదలాలని షోలాపూర్‌కు చెందిన రైతు భయ్యా దేశ్‌ముఖ్ 55 రోజులుగా నిరశన దీక్ష చేస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించాల్సిన డిప్యూటీ సీఎం.. అతి దారుణమైన వ్యాఖ్యలతో మొత్తం రైతాంగాన్ని అవమానించారు. ‘‘డ్యాంలో నీళ్లు లేవు.. ఎక్కడి తెచ్చి ఇవ్వమంటారు?. మేం మూత్రం పోసి నింపమంటారా?. అయినా తాగడానికే నీళ్లు దొరకడం లేదు. ఇక మూత్రం అంత తేలిగ్గా వస్తుందా?’’ అంటూ దుర్మార్గ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. రాష్ట్రంలో జనాలు ఎక్కువకావడంతోనే కరెంటు సమస్య వచ్చిందంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ‘‘నాకు తెలిసినంతవరకూ.. మహారాష్ట్రలో కరెంటు కోతలు పెరిగినప్పటినుంచి జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిం ది. రాత్రిళ్లు కరెంటు పోయాక.. ఇంకే పని ఉంటుంది’’ అని అజిత్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాగా, సదరు మంత్రి శనివారం పుణెలోని ఇందాపూర్‌లో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తన వ్యా ఖ్యలకు ప్రజలు నవ్వుతుండడంతో.. ఆయన మరో అడుగు ముందుకేసి ‘‘నేను మందుకొట్టి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు కదూ. అదేం లేదు’’ అని అంటూ తన వెకిలిని ప్రదర్శించారు. అజిత్ వ్యాఖ్యలతో బెంబేపూత్తిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. పుణెలో అజిత్‌పవార్ పాల్గొనాల్సిన ఓ ర్యాలీని కారణాలు చెప్పకుండానే రద్దు చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై పార్టీ నాయకులు వివరణ ఇస్తూ.. ‘‘ఆయన హాస్యం చేశారని.. అదీ అనుకోకుండా జరిగింది’’ అంటూ అజిత్‌ను వెనకేసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమైంది. ‘‘అజిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించడానికే నోరు రావడం లేదు. అలాంటిది ఆయన ప్రజల సమక్షంలో నిస్సిగ్గుగా ప్రేలాపన చేశారు. మహారాష్ట్ర రాజకీయ చరివూతలో ఇవి అట్టడుగుస్థాయి వ్యాఖ్య లు’’ అని బీజేపీ నాయకురాలు శైనా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. తన వ్యాఖ్యలపై అజిత్ క్షమాపణలు చెప్పారు. ‘‘ఇందాపూర్‌లో చేసిన వ్యాఖ్యలు నీటి ఎద్దడి ప్రాంతవాసుల్ని ఉద్దేశించినవి కావు. ఎవరినైనా బాధకలిగితే క్షమించండి’’ అని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.