డిసెంబర్ 15లోపు తెలంగాణ స్వయంపాలన

సరిగ్గా 45 రోజులు! ఆరు దశాబ్దాల ఆకాంక్షలు ఫలించటానికి.. సుదీర్ఘ నిరీక్షణకు తెర దిగటానికి ఇంకా నెలన్నర! ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నా.. తన పని తాను వేగంగా చేసుకుపోతున్న కేంద్ర ప్రభుత్వం.. డిసెంబర్ 15 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన మొదలయ్యేందుకు ముమ్మర కసరత్తు జరుపుతున్నదని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

నవంబర్ ఏడున జరిగే మంత్రుల బృందం సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ సమావేశానికి ముందే రాష్ట్రానికి సంబంధించి గుర్తింపు పొందిన పార్టీల అభిప్రాయాలు సేకరించి, అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. తెలంగాణ బిల్లుకు రూపకల్పన చేయాలన్న ఆలోచనల్లో కేంద్రం ఉందని సమాచారం.

బిల్లు తయారైన తర్వాత కేబినెట్ ఆమోదించటం, రాష్ట్రపతికి నివేదించటం, అటు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రావటం.. చివరికి పార్లమెంటుకు చేరి.. చట్టంగా మారి.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించటం ఈ నలభై ఐదు రోజుల్లో చక చకా జరిగిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం కోరుతూ బిల్లు వచ్చిన సమయంలో నిర్దిష్ట కాలపరిమితి సూచించి, ఆలోపు అభిప్రాయం చెప్పాలని కోరుతారు. ఈ వ్యవధి చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అసెంబ్లీ అభిప్రాయం తీసుకున్నాక వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి నోటిఫికేషన్‌తో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది. దీన్ని కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేయాలన్న కృతనిశ్చయంతో కేంద్రం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకునే సమయం తక్కువ ఉందని షిండే వ్యాఖ్యానించారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కీలక భేటీలు జరిపిన సీఎస్
విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు సంబంధించిన సచివాలయం, శాఖాపరమైన ప్రధాన కార్యాలయాల(హెచ్‌వోడీ) పనితీరు కుంటుపడకుండా, అధికార యంత్రాంగం రోజువారీ కార్యక్రమాలను యథాతథంగా కొనసాగించేలా అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మహంతి స్పష్టత ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 2013-14 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ నవంబర్ నుంచి ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో త్వరలో ఏర్పాటు కానున్న రెండు రాష్ట్రాల ఆదాయ, వ్యయాల అంశం కూడా చర్చకు వచ్చిందని తెలిసింది.

న్యూఢిల్లీలోని యోజన భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌బడ్జెట్ వ్యవహారాలకు కీలకమైన ప్రణాళికచర్చలు జరిపేందుకు ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ఎదురయ్యే ప్రతిబంధకాలపై కేంద్ర అధికారులతో మహంతి సవివరంగా చర్చించినట్లు తెలిసింది. విభజన తర్వాత వెంటనే అన్ని శాఖలకు కొత్తగా సచివాల య కార్యదర్శుల నియామకాలు జరగకుండా ఒకే శాఖ కార్యదర్శి ఇరు రాష్ట్రాల మంత్రులకు బాధ్యత వహిస్తారని తెలుస్తున్నది. ఉదాహరణకు సాంఘికసంక్షేమ శాఖకు తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా మంత్రులున్నా కార్యదర్శి మాత్రం ఒక్కరే ఐదారు నెలల పాటు పనిచేస్తారు. ఇదే విధానం ఇతర శాఖలకు కూడా వర్తిస్తుంది.

విభజన అనంతరం రెండు ప్రభుత్వాలు
రాష్ట్ర విభజన నిర్ణయం జరగగానే రెండు రాష్ట్రాలకు వేర్వేరు మంత్రివర్గాల ఏర్పాటు జరుగుతుంది. ఈ మేరకు సచివాలయంలో బ్లాక్‌ల విభజన జరిపి వేర్వేరు బ్లాకుల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి,మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తారా? లేదా సచివాలయం వెలుపల ఏదేని ప్రాంతంలో ఏర్పాటు చేస్తారా?అనేది ఇంకా ఖరారు చేయలేదని తెలిసింది.

ఒకే ప్రాంగణంలో ఇరుప్రాంతాల ముఖ్యమంత్రులు ఉండడం సమంజసం కాదనే చర్చ కూడా జరుగుతున్నది. వేర్వేరు చోట్ల ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పాలనా వ్యవహారాలన్నీ ప్రస్తుత సచివాలయం నుంచే జరుగుతాయని భావిస్తున్నారు. సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల విభజన విషయంలో దామాషా పద్ధతిని అనుసరిస్తారని సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్ వంటి కేంద్ర సర్వీసు ఉద్యోగుల కేటాయింపుల విషయంలో తాను రూపొందించిన నివేదికను సీఎస్ మహంతి కేంద్రానికి అందించారు. ఇన్‌సైడర్స్, అవుట్‌సైడర్స్‌గా ఐఏఎస్, ఐపీఎస్‌ల ప్రాతిపదిక ఉన్నందున ఇదే విధానాన్ని ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన మూడు రాష్ట్రాల్లో అవలంబించినట్లుగానే ఇక్కడి రాష్ట్ర విభజన సమయంలోనూ పాటించనున్నారు. పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నవారు ప్రత్యేక మినహాయింపులు(ఆప్షన్స్) ఇవ్వాలని కోరుతున్న విషయాన్ని సీఎస్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్
ఎన్నికల ఏడాది, రాష్ట్ర విభజన సంవత్సరం కావడంతో 2013-14ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందించే అవకాశాలులేవు. మూడు నెలల కాలానికి ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రతిపాదిస్తారు. మరో 45 రోజుల్లోనే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో బడ్జెట్‌పై ప్రాథమిక చర్చలు జరిగినప్పటికీ 2014 మార్చిలోనే రెండు రాష్ట్రాల అసెంబ్లీలోనే బడ్జెట్ ప్రతిపాదనలు రానున్నాయి. ఏకకాలంలో కాకుండా ముందుగా ఒక రాష్ట్ర బడ్జెట్ ఆమో దం తర్వాత, మరొక రాష్ట్ర బడ్జెట్ ఆమోదం జరుగుతుందని భావిస్తున్నారు. విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్ల నియామకాలు జరగకపోవచ్చంటున్నారు.

బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో సభ నుద్దేశించి ప్రస్తుత గవర్నర్ నరసింహనే ప్రసంగిస్తారు. ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రతిపాదనలు, రుణాల విషయంలో ఇరురాష్ట్రాల మధ్య పంపకం మొత్తం కూడా జనాభా ప్రాతిపదికనే సాగుతుందని అధికారవర్గాలు చెప్పా యి. నీటిప్రాజెక్టుల విషయంలో నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తున్నారు. ఉదాహరణకు ఒక ప్రాజెక్టు తెలంగాణలో నిర్మించి అదే ప్రాంతంలో మాత్రమే పూర్తి అయకట్టు ఉంటే ఆప్రాజెక్టును పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తారు. ఇదే విధం గా ఆంధవూపదేశ్‌కూ ఉంటుంది. ప్రాజెక్టు ఉన్న భూభాగం ఏ రాష్ట్రంలో ఉన్నా ఆయకట్టు ఇరు రాష్ట్రాల మధ్య ఉంటే దాని ని ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్ధారించి, నిర్వహణ బాధ్యత
కేంద్రం ఏర్పాటుచేసే ట్రిబ్యునల్‌కు అప్పగిస్తారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.