డిగ్రీ లెక్చరర్స్ నియామకాలను జోనల్ విధానంలో చేపట్టాలి

 

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల నియామకాలను జోనల్ విధానంలోనే చేపట్టాలని, రాష్ట్రస్థాయిలో నియామకాలు జరపడంవల్ల తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని కలిసి ఈ విషయమై ఒక మెమోరాండం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 610 జీవోను అన్ని రకాల నియామకాల్లో అమలు చేయాల్సి ఉన్నప్పటికీ గతంలో చేసిన నియామకాల్లోనూ వర్తింపజేయలేదని, ఇప్పుడు కూడా 610 జీవోని వర్తింపజేయకపోవడం దారుణమని అన్నారు. 2010లో చేపట్టిన డిగ్రీ కాలేజీ లెక్చరర్ల నియామకాలను రాష్ట్రస్థాయిలో చేపట్టడంవల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన 68 మంది నష్టపోయారన్నారు.

ఇప్పుడు కూడా రాష్ట్రస్థాయిలో నియామకాలు చేపడితే తెలంగాణకు మరోసారి అన్యాయం జరుగుతుందని, అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్వ్యూలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు, సీనియారిటీ విషయానికి సంబంధించి జోనల్ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ, నియమకాలను మాత్రం రాష్ట్రస్థాయిలో ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. అధ్యాపకుల ఇంటర్వ్యూలను నిలిపివేసేలా ఏపీపీఎస్సీని ఆదేశించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. సీఎం కిరణ్, వైద్య శాఖ మంత్రి డీఎల్ మధ్య విభేధాలవల్ల మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు రోడ్డున పడ్డారని, ఎన్నో రోజులుగా వారు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హెల్త్ అసిస్టెంట్లు నెలల తరబడి వేతనాలు లేక రోడ్లమీద ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం చర్చలు కూడా జరపడం లేదని మండిపడ్డారు. వేతనాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తాము కూడా ఆందోళనలో పాలపంచుకుంటామని హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.