ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లుగా తెలంగాణవారు పనికిరారా?

తెలంగాణ ప్రాంతంలో విద్యావంతులు లేరా? తెలంగాణ ప్రాంతంలోని ప్రొఫెసర్లు రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌లకు డైరెక్టర్లుగా పనికిరారా..? ఆర్జీయూకేటీ ప్రారంభంనుంచి సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలు, సీమాంధ్ర వైస్‌చాన్స్‌లర్స్ తెర కుట్రలు చేస్తూ.. తెలంగాణవారికి అవకాశం దక్కకుండా చూస్తున్నారు. ఆర్జీయూకేటీ పరిధిలో మూడు క్యాంపస్‌లకు డైరెక్టర్ల ఎంపికకు గతంలో రెండుసార్లు నోటిఫికేషన్ వేశారు. కానీ సమర్థులు దొరకటం లేదని నియామకం వాయిదా వేశారు. కానీ రాష్ట్ర విభజన చేస్తున్నట్లు సీడబ్ల్యూసీ నిర్ణయం రాగానే సీమాంవూధులు ఆగమేఘాల మీద కుట్రలకు తెరలేపారు. బాసర ట్రిపుల్‌ఐటీలో మళ్లీ నార్త్ ఇండియన్‌ను నియమించేందుకు పావులు కదుపుతున్నారు. 2008లో ఆర్జీయూకేటీ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఒడిశాకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రాజేందర్ సాహు (నార్త్ ఇండియన్)ను కొనసాగిస్తున్నారు. సాహు డిప్యూ సమయం పూర్తి కావటంతో ఆయన తన సొంత సంస్థకు వెళ్లనున్నారు. దీంతో సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు తమ కనుసన్నల్లో మెదిలే ఇతర రాష్ట్రాల వారితో భర్తీ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

ఫలితంగా బాసర ట్రిపుల్ ఐటీని సీమాంవూధుల గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు బాంబే ట్రిపుల్ ఐటీలో కెమిస్ట్రీ విభాగంలో పనిచేస్తున్న నందకిషోర్‌ను నియమించేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ రాజ్‌కుమార్ పావులు కదుపుతున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌ల్లో ఆ ప్రాంతానికే చెందిన ప్రొఫెసర్లను డైరెక్టర్లుగా నియమించారు. నూజివీడు క్యాంపస్ ప్రస్తుత డైరెక్టర్ పాండురంగారావు అనంతపూర్ జేఎన్‌టీయూ ప్రొఫెసర్ కాగా మాజీ డైరెక్టర్ ఖాన్ ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడం గమనార్హం. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రస్తుత డైరెక్టర్ ఆచార్య ముక్కంటి కాగా, మాజీ డైరెక్టర్ సైతం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొఫెసరే. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో బోధనా సిబ్బంది నియామాల్లో జరిగిన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకే వైస్ చాన్స్‌లర్ తన కన్నుసన్నల్లో ఉండేవారినే డైరెక్టర్‌గా నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారని తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్లు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోని సిబ్బంది నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ఉన్నత విద్యా మండలి కమిటీ వేసి విచారణ జరుపుతున్నది.

This entry was posted in ARTICLES.

Comments are closed.