టీ బిల్లుపై చర్చించకుంటే వాపస్ పంపండి: కోదండరాం

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుంటే వెంటనే బిల్లును కేంద్రానికి వాపస్ పంపాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఇవాళ ఇందిరాపార్కు వద్ద జరిగిన ‘తెలంగాణ సంపూర్ణ సాధన దీక్ష’ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లులోని 13 అంశాలపై తాము సవరణలు కోరుతున్నామని వెల్లడించారు. ఈమేరకు ఢిల్లీ వెళ్లి అందరు రాజకీయ నేతలను కలిసి మద్ధతు కూడగడతామన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీకి కేవలం అభిప్రాయం చెప్పే అవకాశమే ఇచ్చారని, నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ బిల్లును ఆపేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలు ఫలించవని పేర్కొన్నారు. బిల్లుపై చర్చ జరిగినా జరుగకున్నా తెలంగాణ బిల్లు జనవరి 23 తర్వాత కేంద్రానికి చేరుతుందని స్పష్టం చేశారు.

‘తెలంగాణకు ప్రత్యేక పీఎస్సీని వెంటనే ఏర్పాటు చేయాలి’
తెలంగాణకు ప్రత్యేక పీఎస్సీని నియమించాలని అన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని సహించబోమని పేర్కొన్నారు. హైకోర్టును ఉమ్మడిగా ఒప్పుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. స్థానికత ఆధారంగానే పెన్షనర్లను గుర్తించాలని డిమాండ్ చేశారు. గోదావరిపై వాటర్‌బోర్డు అవసరంలేదని, కృష్ణా వాటర్ బోర్డును హైదరాబాద్‌లోనే ఉంచాలని కోరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.