టీవీ9పై తెలంగాణవాదుల ఆగ్రహం

తెలంగాణ శాసనసభతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ 9 చానల్ వైఖరిపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులన్న గౌరవం కూడా లేకుండా సీమాంధ్ర అహంకారాన్ని ప్రదర్శించిన చానల్‌కు వ్యతిరేకంగా తెలంగాణవాదులు ఆందోళనలు నిర్వహించారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

tv-9_MSOబంజారాహిల్స్‌లోని టీవీ9 ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ, నవతెలంగాణ బ్రాహ్మణ, అర్చక సేవా సంఘం సభ్యులు శనివారం ఆందోళన నిర్వహించారు. టీవీ9 సీఈవో రవిప్రకాష్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని అడ్వొకేట్ జేఏసీ కో-కన్వీనర్లు కే గోవర్ధన్‌రెడ్డి, పీ గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జేఏసీ నేతలు అనిల్‌కుమార్, భిక్షమయ్య, ఇంద్రకుమార్, బ్రహ్మానందరెడ్డి, అర్చక సంఘం అధ్యక్షుడు రాహుల్ దేశ్‌పాండే, పప్పు సీతారామశర్మ, శ్రీకాంత్, శర్మ, సాయికుమార్‌శర్మ, వెంకన్న పంతులు, సంజీవరావు, శరత్‌శర్మ, గణేష్‌శర్మ తదితరులను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సీమాంధ్ర మీడియా వైఖరి మార్చుకోవాలి: టీఎస్‌జేఏసీ

ఉస్మానియా యూనివర్సిటీ: సీమాంధ్ర మీడియా తీరు మారకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని టీఎస్‌జేఏసీ హెచ్చరించింది. సీమాంధ్ర రాజధాని కోసం విరాళాలు సేకరిస్తున్న చానళ్లకు తెలంగాణ అభివద్ధి, అమరవీరులు, ముఖ్యమంత్రి సహాయనిధికి ఎందుకు విరాళాలు సేకరించటంలేదని టీఎస్‌జేఏసీ నేతలు పిడమర్తి రవి, బాలరాజుయాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆస్తులు, కార్యాలయాలు ఉంచుకొని చానళ్లు, వార్తా పత్రికలు సీమాంధ్ర పక్షపాతం చూపటం సమంజసం కాదని శనివారం ఒక ప్రకటనలో వారు హితవు పలికారు.

తెలంగాణపై విషంచిమ్మితే సహించేదిలేదు: కోటేశ్వర్‌రావు

హైదరాబాద్ సిటీబ్యూరో: టీవీ చానళ్లు తెలంగాణపై విషం చిమ్మేలా కార్యక్రమాలు ప్రసారం చేస్తే సహించేది లేదని రూరల్ మల్టీసిస్టమ్ ఆపరేటర్స్ (ఎంఎస్‌వో) మరియు కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఆసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ పాల్వంచ కోటేశ్వర్‌రావు హెచ్చరించారు. టీవీ-9 ప్రసారాలకు నిరసనగా బంజారాహిల్స్‌లోని చానల్ కార్యాలయం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన మీడియా, ప్రజాప్రతినిధులను కించపరిచేలా వ్యవహరించరాదని అన్నారు. ఇక ముందు కూడా ఇలాంటి పద్ధతే కొనసాగితే ఆంధ్రా చానళ్ల ప్రసారాలు నిలిపేసేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న అసోసియేషన్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం సొంత పూచి కత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లా అధ్యక్షులు, ఎంఎస్‌వో నాయకులు ఉమాశంకర్, రమేష్, ఇంద్రసేనారెడ్డి, మల్లేష్, రమేష్‌చందర్, భవానీశంకర్, నర్శిరెడ్డి, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

టీవీ9పై జిన్నారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

మెదక్: తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమాన పర్చిన టీవీ9 చానల్‌పై చర్య తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు జిన్నారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిన్నారం ఎస్‌ఐ పాలవెల్లికి శనివారం ఫిర్యాదు చేశారు. అనంతరం జిన్నారంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకటేశంగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీవీ9 తన తెలంగాణ వ్యతిరేక బుద్ధిని మార్చుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరప్ప, సీహెచ్ వెంకటేశం, వార్డు సభ్యులు సంజీవ, బ్రహ్మేందర్, నీలం మోహన్, నాగయ్య మాదిగ, మల్లేష్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.