టీపీఎస్సీ అప్పుడే తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం

 

ktranna
– గతంలో అన్యాయాలను ఇప్పటికీ సవరించలేదు
– గ్రూప్ 1 పోస్టులను జోనల్‌గా నింపాలి
– బీజేపీతో మిత్రవైరుధ్యమే.. సమాంతరంగా పనిచేద్దాం
– జాతీయ పార్టీలేవీ లేవు.. అన్నీ సాంకేతిక జాతీయ పార్టీలే
– సర్వేలన్నీ తెలంగాణకే అనుకూలంగా ఉన్నాయి
– టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు
‘శివలింగంగౌడ్ గ్రూప్ 1 రాత పరీక్షల్లో 687 మార్కులతో, చంద్రశేఖర్ 678 మార్కులతో స్టేట్ ఫస్టు, సెంకడ్ ర్యాంకుల్లో నిలిచారు. వీరిద్దరు తెలంగాణ వారు. సీమాంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూల్లో వారికి అన్యాయం జరిగింది. శివలింగంగౌడ్‌కు 90కి 33, చంద్రశేఖర్‌కు 90కి 23 మార్కులే వేశారు. దీంతో ఇద్దరూ కిందిస్థాయి పోస్టుల్లోకి వెళ్లారు. అదే సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారికి ఇంటర్వ్యూల్లో 90కి 88మార్కులు కూడా వేశారు. సీమాంధ్ర పక్షపాతానికి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి ఈ ఉదాహరణ చాలు. ఇలాంటివి కోకొల్లలు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీలో మళ్లీ అన్యాయాలు జరగకుండా ఉండాలంటే తెలంగాణలో నింపే ఉద్యోగాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటు చేయాలి’ అని టీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆలస్యంగానైనాసరే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే తెలంగాణ ప్రాంతంవారికి ఏపీపీఎస్సీలో అన్యాయం జరుగుతుంది కనుక తెలంగాణ అభ్యర్థులను టీపీఎస్సీ ద్వారా నింపాలని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. 45 స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీల్లో 613(డి) రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని, కానీ ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. అదే సమయంలో గ్రూప్ 1లో 20 కేటగిరీల్లో జోనల్ పోస్టులను స్టేట్‌వైడ్ పోస్టులుగా నింపుతున్నారని తెలిపారు. ‘గతంలో జరిగిన అన్యాయాలను ఎలాగూ సరిచేయలేకపోయారు. 610జీవో ఇప్పటికీ అమలు కాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా కనీసం స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలుచేయాలి. గ్రూప్ 1 పోస్టులను జోనల్ రిక్రూట్‌మెంట్‌గానే నింపాలి. లేకుంటే రాబందులు, గద్దల మాదిరిగా ఈ పోస్టులను తన్నుకుపోతారు. మళ్లీ గతానుభవాలే పునరావృతమవుతాయి’ అని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను నెలకొల్పి రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించాలని, ఈ విషయంలో మంత్రులు జానాడ్డి, శ్రీధర్‌బాబులాంటివారు సీఎంతో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

బీజేపీతో శత్రువైరుధ్యం లేదు
బీజేపీతో తమ పార్టీకి మిత్రవైరుధ్యమే ఉందికానీ శత్రువైరుధ్యం లేదని కేటీఆర్ తెలిపారు. బీజేపీలో నాగం జనార్దన్‌డ్డి చేరడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. అయితే కొత్తగా పార్టీలు మారినవారు తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఏదేదో మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు. సమాంతరంగా పనిచేద్దామని, ఇతరులకు ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని సూచించారు. పార్లమెంట్‌లో కేసీఆర్, విజయశాంతి పోడియం దగ్గరికెళ్లి కొట్లాడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు వివేక్, మందా వెళ్లి ఆందోళన చేశారుగానీ, సభలో ఉన్న బీజేపీకి చెందిన 112 మంది అందులో పాల్గొనలేదని గుర్తుచేశారు. పైగా ఆందోళన చేసిన ఎంపీలను సస్పెండ్ చేసే తీర్మానాన్ని బీజేపీ పార్లమెంటరీ పక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రవేశపెట్టారని అన్నారు. ఉప ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్ తెచ్చిన తెలంగాణను జాతీయ పార్టీలు కూడా కాపాడలేకపోయాయని వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న భిన్నాభివూపాయాలను పరిష్కరించుకుంటామని, ఇప్పుడు అసలైన బలమైన జాతీయ పార్టీలు లేవని, సాంకేతికంగానే జాతీయపార్టీలున్నాయని కేటీఆర్ అన్నారు. ‘పార్లమెంట్‌లో అధికారం దక్కాలంటే 272 సీట్లు కావాలి. కానీ ఇప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఉన్నది 170 మందే. ఎన్డీయే, థర్డ్‌వూఫంట్ ఎవరికీ అధికారానికి కావాల్సినన్ని సీట్లు వచ్చేలా లేవని సర్వేలే చెబుతున్నాయి. 10-20 సీట్లు వచ్చిన డీఎంకే, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కూర్చోమంటే కేంద్రం కూర్చుంది. లెమ్మంటే లేచింది. 2014లో అధికారం కోసం తహతహలాడే పార్టీలు మోకరిల్లి తెలంగాణ తెచ్చిచ్చిపోతాయి. అడిగేవాడు లేకుంటే ఇచ్చేవాడే ఉండడు’ అని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు రాజకీయ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్‌లోకి పోతోంది గెలవడానికేనని ఆయనే అంటున్నారని, ఆ విధంగా టీఆర్‌ఎస్‌లో చేరితే గెలుస్తారని ఆయనే ఒప్పుకుంటున్నారని అన్నారు. బాబుకు కుప్పం, శ్రీధర్‌బాబుకు మంథని, వైఎస్ పులి పోటీచేసేవారని కానీ కేసీఆర్‌కు తెలంగాణ అంతా కావాలని, అందుకే ప్రతి ఎన్నికల్లో వివిధచోట్ల పోటీచేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.