టీడీపీ, కాంగ్రెస్‌లను నామరూపాల్లేకుండా చేస్తం-కేసీఆర్‌

kcrr

టీడీపీని వంద శాతం నాశనం చేస్తాం
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మండిపాటు
‘ఖమ్మం జిల్లా బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీని పెట్టాలి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. కొత్త స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రధానమంవూతికి లేఖ రాస్తా. ప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తాం. ఇంటికో సంతకంతో కోటి సంతకాలను సేకరించి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోకాని, వరంగల్ జిల్లాలోకాని స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి భేషజాలకు పోవద్దు అని ఆయన సూచించారు. తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అవసరమైన అన్ని రకాల ముడిసరుకులు అందుబాటులో ఉన్నాయన్నారు. డోలమైట్, క్వార్ట్, గోదావరి నీళ్లు, రైల్వే లైన్, బొగ్గు, విద్యుత్, ఇతర వనరులన్నీ ఉన్నాయని ఆయన చెప్పారు. గనులను కేటాయించినపుడు కేంద్రానికి డిమాండ్, పరిమితులు పెట్టే విశేష అధికారాలు రాష్ట్రానికి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులో కొత్త స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ మంత్రులు ముఖ్యమంవూతిపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. ఒత్తిడి తీసుకురాలేకపోతే, క్యాబినేట్ నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ఫ్యాక్టరీని సాధించేదాక టీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందని వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘బాబు సొల్లు పురాణాన్ని వల్లిస్తున్నారు. టీడీపీ కూలిపోయి, కుంటుతోంది. అధికారంలోకి వచ్చే ఆశల్లేవు. నిరాశ, నిస్పృహలతో బాబు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. టీఆర్‌ఎస్‌ను ఫాంహౌజ్ పార్టీ అంటావా?.. అవును మాది ఫాం-హౌజ్ పార్టీయే. అక్కడ వ్యవసాయం చేస్తున్నా. ప్రభుత్వాన్ని ఫాం చేసేది మేమే. బాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో, ఏబీఎన్ ఛానల్‌లో దిక్కుమాలిన కథనాలు వేస్తున్నారు. ఇవి బాబు అజ్ఞానానికి, రాధాకృష్ణా పిచ్చి అక్కసుకు నిదర్శనం’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘రక్షణ స్టీల్స్‌పై ముందుగా స్పందించిందే టీఆర్‌ఎస్. బయ్యారంలో క్షేత్ర స్థాయిని టీఆర్‌ఎస్ బృందం సందర్శించింది. టీడీపీకి సొల్లు, సోయి లేని సమయంలోనే టీఆర్‌ఎస్ స్పందించింది. ప్రజలను సమీకరించి ఆందోళనలు చేశాం, బైక్ ర్యాలీలను నిర్వహించాం.

ఖమ్మం జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు.టీఆర్‌ఎస్‌ను సూట్‌కేసుల పార్టీ అంటావా? సూట్‌కేసులు మోసే దిక్కుమాలిన అలవాటు బాబుకే ఉంది. అవిశ్వాసం సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి బట్టలు విప్పి నగ్నంగా, నిస్సిగ్గుగా మద్దతునిచ్చిందే బాబు. అప్పుడు ఎన్ని సూట్‌కేసులు మోశారో బాబు జవాబు చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీని రెండు రకాల పార్టీగా చెప్పొచ్చు అని, దాన్ని బాబే నిర్ణయించుకోవాలన్నారు. టీడీపీని పిల్లి గడ్డం, బొల్లి పార్టీ అనాలా?, పాలు, కూరగాయలు అమ్మె హెరి పార్టీ అనాలా? అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. బాబూ! ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మాటలు జాగ్రత్త అని హెచ్చరించారు. అవాస్తవాలు మాట్లాడుతున్న బాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అబిడ్స్‌లో ముక్కు నేలకు రాయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తప్పుడు కథనాలను ప్రచురిస్తూ రాధాకృష్ణ తెలంగాణపై, టీఆర్‌ఎస్‌పై విష ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ వాదమవుతుందా? దీనిపై అడ్డగోలు రాతలేంటీ?.. రాధాకృష్ణా పిచ్చి ఎవరిది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు చేస్తే తప్పు అనిపించదు, అదే తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు. ఆనాడు లేని ప్రాంతీయ కోణం ఇప్పుడెందుకో? అని రాధాకృష్ణను నిలదీశారు. మెదక్ జిల్లా దుబ్బాకలో హైస్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లో విశాఖ ఉక్కు ఆందోళన సందర్భంగా తాను లాఠీ దెబ్బలు తిన్న విషయం ఇంకా గుర్తు ఉందన్నారు. విశాఖ స్టీల్స్‌లో 35వేల మందికి ఉద్యోగాలు ఉంటే అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది ఉన్నారు? మూడు, నాలుగు వందల మంది కూడా ఉండరని కేసీఆర్ చెప్పారు. లెక్క ప్రకారం 42శాతం ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకు ఉండాలన్నారు. దీనికి రాధాకృష్ణ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టీడీపీకి, రాధాకృష్ణకు రాష్ట్రవాదం లేదు, జాతీయ వాదమూ లేదన్నారు. విశాఖ ఉక్కు ద్వారా ఆంధ్రవాళ్లకు 10-15వేల మందికి ఉద్యోగాలు లభించాయి, తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే ఇక్కడి వాళ్లకూ 10-15వేల ఉద్యోగాలు దొరుకుతాయి, ఉద్యోగాలు అడగటం తప్పా? ఇది సంకుచితమా? అని ఆయన రాధాకృష్ణను ప్రశ్నించారు. పోరాడితేనే రాష్ట్రానికి గ్యాస్ వచ్చింది, ఎన్‌టీపీసీ వేయి మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం పోరాడితే సంహావూదిలో పెట్టారు. పోరాడితేనే రామగుండం ఎన్‌టీపీసీలో తెలంగాణకు 31.9శాతం ఉద్యోగాలు వచ్చాయి.

ఈ విషయాల్లో రాధాకృష్ణకు పరిజ్ఞానం ఉందా? ఆయన ప్రశ్నించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే అప్పుడు చంద్రబాబు స్పందించి తమిళనాడుకు చెందిన చిదంబరం, కేరళకు చెందిన ఆంటోని, కర్ణాటకకు చెందిన మొయిలీ ఎవరు.. తెలంగాణ ప్రకటించడానికి? అంటూ వ్యాఖ్యలు చేశారని, తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే సంకుచితం అవుతుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ బలపడుతుంటే రాధాకృష్ణ కూసాలు కదిలిపోతున్నాయని కేసీఆర్ విమర్శించారు. టీడీపీని కాపాడటమే రాధాకృష్ణ ఎజెండాగా మారిందని, టీఆర్‌ఎస్‌ను బేకార్ పార్టీగా చిత్రీకరించేందుకు నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ఆయా పార్టీల నాయకులు చేరితే రాధాకృష్ణ ఆశాడభూతి అంటూ ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. టీడీపీ తునాతునకలవుతుందని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో ప్రారంభమైందని, ఇంకా వలసలు ఉంటాయన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి పేపర్ అంతా ఫుల్‌గా రాతలు రాసుకున్నా పేజీలు సరిపోవని కేసీఆర్ ఎద్దేవా చేశారు. గంగుల చేరికతో టీడీపీ నేతలు, రాధాకృష్ణ గంగ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే కేశవరావును కించపరుస్తూ రాతలు రాయడమేంటి అని పశ్నించారు. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్న ఇంగితం లేకుండా వ్యంగ్యంగా కథనాలు రాస్తారా? ఇదేనా సంస్కారం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, వివేక్‌లపై ఆ రాతలేంటి? తెలంగాణ కోసం కలిసొస్తే పనికిరాని వాళ్లుగా చిత్రీకరిస్తావా? ఇదేం పద్ధతి అంటూ రాధాకృష్ణపై ధ్వజమెత్తారు. టీడీపీని నాశనం చేస్తాం, తప్పకుండా వంద శాతం చేస్తాం అని సవాల్ చేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్న ముఖ్యమంవూతికి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయనీయం, తెలంగాణను అడ్డుకున్న టీడీపీకి ఒక్క సీటు రానీయం అని కేసీఆర్ శపథం చేశారు. రేపటి నుంచి తెలంగాణలో ఇవే నినాదాలతో పని చేస్తామన్నారు. కాంగ్రెస్‌ను, టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తాం అని ఆయన అన్నారు. తెలివైన చాకలి రవిక, చీరను ఒకేసారి కలగలిపి బండకేసి కొడతారని ఉదహరించారు. రాజకీయ నాయకులు తమ భవిష్యత్తును వెదుక్కొవద్దా?, ఆ తాపవూతయం చేసుకోవద్దా? తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లో చేరవద్దా? అని ప్రశ్నించారు. రాధాకృష్ణా ! పిచ్చి రాతలు మానుకో, లేదంటే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి దరిక్షిదపుగొట్టు పత్రిక అని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌లో చేరే వారికి డెడ్‌లైన్ ఏమీ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరే వాళ్లు తెలంగాణ కోసమా? టికెట్స్, సీట్ల కోసమా? తేల్చుకోవాలని మాత్రమే చెప్పాం అన్నారు. మే నెల 15 తరువాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గొప్ప నిబద్ధత ఉన్న ఉద్యమకారుడు, అతను అడగక ముందే ఎమ్మెల్సీగా చేశానన్నారు. ఎవరి సర్వేలను నమ్మేది లేదని, తామే సొంతంగా సర్వేలు నిర్వహించుకుంటామన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి
పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించిన కేసీఆర్
మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి ఆదివారం టీఆర్‌ఎస్‌లోకి చేరారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయనను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. గొప్ప నిబద్ధత ఉన్న నిఖార్సయిన తెలంగాణవాది రమణాచారి అని ఆయన కొనియాడారు. 1969లో తెలంగాణ కోసం ఉద్యమించి నెలన్నరపాటు సంగాడ్డి జైలు జీవితాన్ని గడిపారని కేసీఆర్ చెప్పారు. ఎందరో ముఖ్యమంవూతుల దగ్గర రమణాచారి నిజాయితీగా విధులను నిర్వహించారన్నారు. రిటైర్డ్ అయ్యాక వచ్చిన పెన్షన్ బెనిఫిట్‌తో ఫ్లాట్ కొనుక్కున్న వ్యక్తి రమణాచారి అని ఆయన కొనియాడారు. చారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. రమణాచారి చేరికతో వేయి ఏనుగుల బలం వచ్చిందన్నారు.

సంచలనం ముందు పుట్టి..
కేసీఆర్ తరువాత పుట్టారు
సంచలనం ముందు పుట్టి, కేసీఆర్ తరువాత పుట్టారు అని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశానికి నిర్ణీత సమయానికి నాలుగు నిమిషాలు ముందుగానే కేసీఆర్ వచ్చారు. ఇంకొంత సమయం ఉంది కదా అని విలేకరులు హాల్‌కు బయటే వేచి ఉన్నారు. కేసీఆర్ హాల్‌లోకి చేరుకున్న విషయం తెలిసి వెంటనే వారు కూడా వచ్చి కూర్చున్నారు. ఈ సందర్భంలో, ఏదేమైనా సర్‌ప్రైజ్ చేయడంలో మీరే మేటి సార్ అని ఒక విలేకరి అన్నప్పుడు… కొన్ని సెకన్లు ఆలోచించి ఎస్.. సంచలనం ముందు పుట్టి, కేసీఆర్ తరువాత పుట్టారు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

టీడీపీని ఏమని పిలవాలి.. పిల్లి గడ్డం, బొల్లి పార్టీ అనాలా?, పాలు, కూరగాయలు అమ్మే హెరిటేజ్ పార్టీ అనాలా?.. అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలి. బాబూ! ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. పిచ్చి ప్రేలాపనలు మానుకో. నిస్సిగ్గుగా ప్రభుత్వాన్ని సమర్థించి ఎన్ని సూటుకేసులు మోశావు.. టీఆర్‌ఎస్‌ను ఫాంహౌజ్ పార్టీ అంటావా?.. అవును, మాది ఫాం-హౌస్ పార్టీయే.. ప్రభుత్వాన్ని ఫాం చేసేది మేమే.. టీడీపీని కాపాడాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్న ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవ్. టీడీపీకి, రాధాకృష్ణకు రాష్ట్రవాదం లేదు, జాతీయవాదమూ లేదు. ఆంధ్రజ్యోతి దరిద్రపుగొట్టు పత్రిక..రాధాకృష్ణా! పిచ్చి రాతలు మానుకో.. తెలంగాణపై విషాన్ని చిమ్మితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.