టీఆర్‌ఎస్‌లో చేరితే తప్పేంటి?

 

kkffఅది తెలంగాణ ఉద్యమ పార్టీ.. నాకు పదవులు కాదు.. ఉద్యమం ముఖ్యం
కేసీఆర్ ఆహ్వానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. జైపాల్‌డ్డితో ఫోన్లో మాట్లాడా
తెలంగాణపై తేల్చకుంటే హైకమాండ్‌తో చర్చలు బంద్
రెండ్రోజుల్లో మరోసారి ఎంపీలతో భేటీ.. ఆ తర్వాతే నిర్ణయం
కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు స్పష్టీకరణ
– అది తెలంగాణ ఉద్యమ పార్టీ
– నాకు పదవులు కాదు.. ఉద్యమం ముఖ్యం
– తెలంగాణపై తేల్చకుంటే
హైకమాండ్‌తో చర్చలు బంద్
– కేసీఆర్ ఆహ్వానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
– జైపాల్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడా
– రెండ్రోజుల్లో మరోసారి ఎంపీలతో భేటీ.. ఆ తర్వాతే నిర్ణయం
– నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నా కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రారు
– కాంగ్రెస్ సీనియర్ నేత కేకే స్పష్టీకరణ
తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ కాదని, అది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కే కేశవరావు అన్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఆ ఉద్యమంలో చేరితే ఎలాంటి తప్పులేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తే ఆ ఉద్యమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో చెప్పారని కేకే తెలిపారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ సమస్యలను పట్టించుకోవడం లేదని, అందుకే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తూ ఆయా ప్రాంతాల్లో బలపడుతున్నాయన్నారు. తెలంగాణపై తేల్చకుండా కాంగ్రెస్ అధిష్ఠానంతో టీ కాంగ్రెస్ ఎంపీల చర్చలంటూ ఏమీ ఉండబోవని తేల్చిచెప్పారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో కేకే కాసేపు మాట్లాడారు.

కేసీఆర్ ఆహ్వానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడానని, మరో రెండ్రోజుల్లో టీ కాంగ్రెస్ ఎంపీలందరూ సమావేశమై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే తాము తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని, ఎక్కువ రోజులు వేచి చూసే సమయం కాదన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోతే మనుగడ కష్టమని, తెలంగాణపై ఇంకా నాన్చివేత ధోరణి అవలంబించవద్దని ఆయన హైకమాండ్‌కు సూచించారు. వెంటనే తెలంగాణపై నిర్ణయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తామన్నారు.

రెండురోజుల క్రితం కేసీఆర్ తమ ఇంటికి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించారని కేకే తెలిపారు. కేంద్రంలో ముందుస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై తేల్చే పరిస్థితి కనిపించడం లేదని, తెలంగాణను ఎలా సాధించుకుందామని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో టీ కాంగ్రెస్ ఎంపీలు ముందునుంచి పోరాడుతున్నారని, మనమంతా కలిసి ఒక వేదిక ద్వారా తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే బాగుంటుంది కేసీఆర్ తనతో చర్చించినట్లు ఆయన వివరించారు. తెలంగాణ కోసం ఇప్పటికే టీఆర్‌ఎస్ వేదిక ఉందని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నదని, ఆ వేదిక మీదికి వచ్చి మీరు కూడా పోరాటం చేస్తే బాగుంటుందని, ఈ నెల 27న టీఆర్‌ఎస్ ఆవిర్భావం ఉంది కాబట్టి.. ఆలోపే వస్తే బాగుంటుందని కేసీఆర్ తమను ఆహ్వానించినట్లు కేకే తెలిపారు. ‘కేసీఆర్ ఆహ్వానంలో నాకేమీ తప్పేమి అనిపించలేదు. ఎందుకంటే టీఆర్‌ఎస్ అనేది రాజకీయ పార్టీ కాదు.. ఉద్యమ పార్టీ. తెలంగాణ కోసమే ఆ పార్టీ ఆవిర్భవించింది. పైగా తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ అనేకమార్లు చెప్పారు. కాబట్టి తెలంగాణ కోరుకునే వాళ్లుగా ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరితే ఎలాంటి తప్పులేద’ని ఆయన అభిప్రాయపడ్డారు. అంత మాత్రాన తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కాదని, ఒకవేళ చేరకపోయినా ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్లమవుతామన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందని అన్నారు.

సీట్లు కాదు, తెలంగాణ సాధనే లక్ష్యం
కేసీఆర్, తాము కలిసి కూర్చున్నంత మాత్రాన వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసమే చర్చించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని, అవి పిచ్చి కథనాలని కేకే మండిపడ్డారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణే ముఖ్యమని, అందుకోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు, తన కొడుకుకు సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. ఒక వేళ తన కుమారుడ్ని పోటీ చేయించాలనుకుంటే పీసీసీ చీఫ్‌గా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేసిన సమయంలోనే టికెట్ ఇప్పించుకునే వాడినని ఆయన పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు తన కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రాబోరని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ తెలంగాణను మరచింది
కేంద్రంలో రెండుమార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పూర్తిగా మరచిపోయిందని కేకే నిప్పులు చెరిగారు. 2004 ఎన్నికలకు ముందు మాట ఇచ్చి, ఎన్నికల ప్రణాళికలో చేర్చి ఇప్పటి వరకు దాన్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు కోరుతూ వెయ్యిమంది చనిపోతే కూడా అసెంబ్లీలో తీర్మానం చేయలేని దుస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు. తెలంగాణపై తేల్చనంత వరకు హైకమాండ్‌తో టీ కాంగ్రెస్ ఎంపీల చర్చలంటూ ఏమీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కేకే స్పందిస్తూ.. ‘ఆయన ఆయన అభిప్రాయాన్ని చెప్పుకున్నారు. కాని మా దగ్గరికి వచ్చి తెలంగాణ అని, సీఎం దగ్గరికి పోయి సమైక్యం అనడం ఆయన అవకాశవాదానికి నిదర్శనమ’ని మండిపడ్డారు. తమతో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఎవరు చర్చించలేదని, పైగా చర్చలకు ఆస్కారం లేదన్నారు. సోమవారం రాత్రి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయినప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకున్నారని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు పరిస్థితులు వివరిస్తామని బొత్స తనతో చెప్పినట్లు కేకే తెలిపారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.