టీఆర్‌ఎస్‌లోకి హన్మంత్‌షిండే

డిసెంబర్ 15 : నిజామాబాద్ జిల్లా జుక్కల్ టీడీపీ ఎమ్మెల్యే హనుమంత్‌షిండే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఆదివారంనాడు ఆయన కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరే విషయమై చర్చించారు. కేసీఆర్ నివాసంలో జరిగిన భేటీలో ఆయన పార్టీలో చేరే తేదీలపై చర్చించారని సమాచారం. హనుమంత్‌షిండేను పార్టీలోకి తీసుకువచ్చే అంశంపై కేసీఆర్ గతంలోనే నిజమాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యత ఇచ్చారు. వారు షిండేను పార్టీలోకి తోడ్కొని రావడంలో విజయవంతమయ్యారు. షిండే ఈ నెలలోనే జుక్కల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ లో చేరాలని నిర్ణయించారు. ఆయనతోపాటు ఆదిలాబాద్ జిల్లా బోథ్ టీడీపీ ఎమ్మెల్యే నగేష్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయన్ను పార్టీ లో చేర్చుకునే విషయంలో కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించాల్సి ఉందని తెలిసింది.

Shindeసమైక్య బాబుకు గుడ్‌బై చెప్పే తరుణం వచ్చింది: షిండే
2009లో వచ్చిన తెలంగాణను ఆపింది చంద్రబాబేనని షిండే విలేకరులకు చెప్పారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలంతా సమైక్య చంద్రబాబుకు గుడ్ బై చెప్పవలిసిన తరుణం ఆసన్నమైందన్నారు. జుక్కల్ టీడీపీ నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ బిల్లుపై చం ద్రబాబు వైఖరి చూసి ఆవేదన చెంది పార్టీ వదిలిపెట్టాలనే నిర్ణయానికి వచ్చానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరి నచ్చకనే తాను గతంలో వచ్చేశానని, ఆ దారిలో అనేక మంది బయటపడడం తథ్యమని అన్నారు.

ఆంధ్రాపార్టీలకు తెలంగాణలో చోటు లేదని, టీడీపీ ఖాళీ అయిపోవడం తథ్యమని చెప్పారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని విశ్వసిస్తున్నందువల్లనే ఇతర పార్టీలు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. తెలంగాణ బిల్లు వచ్చిన తర్వాత కూడా అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు ఇంకా కుట్రలు కొనసాగిస్తునే ఉన్నారని దుయ్యబట్టారు. ఈ తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే షిండే పార్టీకి గుడ్‌బై చెప్పి బయటపడడం శుభపరిణామమని అన్నారు. ఆయనను పార్టీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో టీడీపీకి పుట్టగతులుండవనే విషయాన్ని షిండే నిష్క్రమణ ధృవీకరిస్తున్నదని అన్నారు.

1698
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.