టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు

‘టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు పెరుగనున్నాయి. రాష్ట్రంలో త్వరలోనే పెనుమార్పులు సంభవించనున్నాయి. టీడీపీకి చెందిన 15మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన టీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎప్పుడైనా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయి’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన నివాసంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల జేఏసీ, టీజేఏసీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. అంతర్గతంగా సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ మనసు విప్పి మాట్లాడారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించారు. ‘త్వరలోనే రాష్ట్రంలో కీలక మార్పులు రావచ్చు. తాజా రాజకీయ పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం నిలబడదు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. అందుకు టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంది’ అని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు భారీగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నా,ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పారని సమాచారం.‘యూపీఏ, ఎన్‌డీఏ పరిస్థితి దేశవ్యాప్తంగా దారుణంగా మారుతోంది.
ఆ కూటములు సొంతంగా మెజారిటీ సాధించే పరిస్థితి లేదు’ అంటూ రాష్ట్రాల వారీగా ఆ కూటముల తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో కేసీఆర్ వివరించారని తెలిసింది. ‘దేశవ్యాప్తంగా ఇక ప్రాంతీయ పార్టీలదే హవా. ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితుల్లేవు’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేయాల్సినదంతా చేశాం. అనేక రూపాల్లో ఉద్యమాలను చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరావడం లేదు. రాజకీయంగా అస్తిత్వాన్ని పెంచుకోవడం ద్వారానే కేంద్రం మెడలు వంచగలుగుతాం. తెలంగాణ నుంచి కనీసం 15 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా కేంద్రాన్ని శాసించగలం. రాజకీయంగా బలపడాల్సి ఉంది. అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నా’ అని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ కోసం చేసిన ప్రయత్నాలు, ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చల సారాన్ని ఆయన ఈ భేటీలో వివరించారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తూనే, మరోవైపు రాజకీయంగా బలమైన శక్తిగా ఏర్పడటమే ఏకైక మార్గమని ఆయన చెప్పారు.

అందుకు అనుసరించాల్సిన వ్యూహాలను త్వరలోనే ఆచరణలో పెట్టనున్నట్లు చెప్పినట్లు తెలిసింది. సీమాంధ్ర పెట్టుబడిదారులైన రాజకీయ నాయకులు విషపూరితంగా కుట్రలను పన్నుతూ, ట్రాప్‌లో వేసుకునేందుకు ప్రయత్నాలు చేసే ప్రమాదం ఉంటుందని, వాటిని ఎప్పటికప్పుడు గ్రహించి తిప్పి కొట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం. రానున్న కాలంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారనుందని, త్వరలోనే భారీ సంచలనాలు చోటు చేసుకుంటాయని ఆయన చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.