టాస్క్‌ఫోర్స్ మేనేజైంది-కేటీఆర్

సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు టాస్క్‌ఫోర్స్ మేనేజ్ అయిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన్రు.  రాష్ట్ర విభజనపై కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  మీడియాతో కేటీఆర్ మాటలు… ‘విభజనపై టాస్క్‌ఫోర్స్ తయారు చేసిన నివేదిక సీమాంధ్రుల స్క్రిప్ట్. సీమాంధ్రుల దర్శకత్వంలోనే టాస్క్‌ఫోర్స్ నివేదిక తయారు చేసిన్రు. ఏక పక్షంగా నివేదిక రూపొందించారు. సీమాంధ్ర పాలకులు హైదరాబాద్‌ను స్కాం క్యాపిటల్‌గా మార్చారు. టాస్క్‌ఫోర్స్ నివేదిక తప్పుల తడకగా ఉంది. ముఖ్యమంత్రి కబ్జాలు టాస్క్‌ఫోర్స్ కమిటీకి కనబడలేదా? వైఎస్సార్, చంద్రబాబు పాలనలో చాలా కుంభకోణాలు జరిగాయి. ఎమ్మార్‌లో జరిగిన భారీ భూదోపిడీ కనబడలేదా? గజం లక్ష రూపాయాలు విలువ చేసే నందగిరి హిల్స్‌లో రూ. 80 కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసిన్రు. ఇవన్నీ టాస్క్‌ఫోర్స్ కమిటీకి కనబడలేదా? టాస్క్‌ఫోర్స్ కమిటీ కొంతమంది సీమాంధ్ర పారిశ్రామిక వేత్తలను రహస్యంగా కలిసి వారు చెప్పిందే ప్రామాణికంగా తీసుకోవడమేంటి? టాస్క్‌ఫోర్స్ క్షేత్రస్థాయిలో పని చేసి ఉండాల్సింది.

ఉద్యమకారులను, తెలంగాణవాదులను కించపరిచే విధంగా టాస్క్‌ఫోర్స్ నివేదిక ఉంది. సీమాంధ్రుల ఒత్తిడికి లోనై టాస్క్‌ఫోర్స్ కేంద్ర హోంశాఖకు తప్పులతడకగా నివేదిక ఇచ్చినట్లుంది. గవర్నర్ పాలనతో మరోసారి హైదరాబాద్‌పై పెత్తనానికి సీమాంధ్రులు యత్నం. హైదరాబాద్‌పై పెత్తనానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. అధికారం అండతో వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసింది సీమాంధ్రులే. చిత్తూరు జిల్లాలో సీఎం మంచినీటి స్కాంకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న పంజాబీలు, గుజరాతీలు, మార్వాడీలకు లేని భయం ఆంధ్రోళ్లకే ఎందుకు అని ప్రశ్నిస్తూ’ కేటీఆర్ తన మీడియా సమావేశాన్ని ముగించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.