జై తెలంగాణ అంటే దాడి చేస్తారా? : ఈటెల

 హైదరాబాద్ : గుండెలు మండి జై తెలంగాణ అంటే తమ బిడ్డలపై దాడి చేస్తారా అని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జై తెలంగాణ నినాదాలు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. తెలంగాణ నడి గడ్డమీద జై తెలంగాణ నినాదాలు చేసే స్వేచ్ఛ తమకు లేదా అని అడిగారు. తెలంగాణ నడిగడ్డపై జై సమైక్యాంధ్ర అని నినదిస్తే లేని తప్పు జై తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. జై తెలంగాణ అన్నందుకు కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్, ఓయూ విద్యార్థి నేత బాలరాజు యాదవ్‌ను సీమాంధ్ర గూండాలు, ఫ్యాక్షనిస్టులు చితకబాదిన్రు అని తెలిపారు. ఇంత హింస జరిగాక ఎందుకు కలిసుండాలని ప్రశ్నించారు. నిన్నటి ఘటనలతో తెలంగాణ ప్రజల్లో ఒక ఆలోచన మొదలైందని పేర్కొన్నారు. నిన్నటి సభ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభ అని రుజువైందన్నారు. ఏపీ ఎన్జీవోల సభపై టీ కాంగ్రెస్ నేతలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బు ఉందన్న మదంతో సీమాంధ్రులు తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.