జైల్లో పెట్టి ఉద్యమాన్ని ఆపలేరు: కేటీఆర్

తెలంగాణ నేతలను జైళ్లోపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తే సీమాంధ్ర సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. సడక్‌బంద్ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం బెంగళూరు రహదారిపై ఆరువేల మంది పోలీసులను మోహరించిందని ధ్వజమెత్తారు.

మేం ఆశించిన ప్రయోజనం నెరవేరింది: కేటీఆర్
నిన్న నిర్వహించిన సడక్‌బంద్ కార్యాక్రమం ద్వారా తెలంగాణ నేతలు ఆశించిన ప్రయోజనం నెరవేరిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. నిన్నటి సడక్‌బంద్‌లో పాలమూరు జిల్లాలోని ప్రతీబిడ్డా తమ సత్తా చూపారని అభినందించారు.

పిల్లల భవిష్యత్ దృష్ట్యా బంద్ కాల్ ఇవ్వలేదు: కేటీఆర్
తెలంగాణ పిల్లలు పరీక్షలు రాస్తున్నందున వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బంద్‌కు పిలుపునివ్వడంలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం విద్యార్థులు పరీక్షలు రాయడంలో తలమునకలై ఉన్నారని, వారి బంగారు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నేతల అరెస్టుపై తెలంగాణ బంద్‌కు పిలుపు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. సీమాంధ్ర సర్కార్ తెలంగాణ నేతలపై అక్రమంగా కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. రేపు కేసీఆర్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు, ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈవిషయంపై చర్చిస్తామని, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.