జైల్లోనే జగన్

jaganana
బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
మళ్లీ బెయిల్ కోరాలంటే 4 నెలలు ఆగాల్సిందే!
విజయసాయి బెయిల్ రద్దు.. నిమ్మగడ్డకూ సుప్రీం ఝలక్
నిరాశలో మునిగిన వైఎస్సార్సీపీ శ్రేణులు
బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం
జగన్ ప్రధాన కుట్రదారుడన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకోవాలి
నాలుగు నెలల్లో సీబీఐ దర్యాప్తు ముగించాలి
బెయిల్ పిటిషన్‌పై విచారణలో
సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
– పక్బడందీ కుట్రలతో జరిగే ఆర్థిక
నేరాలతో ప్రజాధనం పెద్ద ఎత్తున
దుర్వినియోగం అవుతున్నది.
– ఇలాంటి ఘోరమైన నేరాలు
దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా
ఉంటున్నాయి.
– దేశ ఆర్థిక స్వస్థతను భంగపరిచే ఆర్థిక
నేరాలపై కఠినంగా వ్యవహరించాలి.
– ఇలాంటి కేసులలో బెయిల్ మంజూరు
చేసేటప్పుడు భిన్నంగా పరిశీలించాలి
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటూ చెంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌డ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు ఏడాదికాలంగా జైల్లో ఉన్న జగన్‌కు ఈసారైనా బెయిల్ వస్తుందని ఆయన పార్టీ శ్రేణులు, కుటుంబసభ్యులు ఆశపడినా.. అత్యున్నత న్యాయస్థానం వాటిపై నీళ్లు చల్లింది. జగన్‌ను ప్రస్తుత దశలో విడుదల చేస్తే తీవ్ర ఆర్థిక నేరం విషయంలో జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ బెయిల్ పిటిషన్‌ను గురువారం తిరస్కరించింది. దీంతో జగన్ కనీసం మరో నాలుగు నెలలు జైల్లోనే ఉండక తప్పదు. ఈ మేరకు జస్టిస్ పీ సదాశివం, జస్టిస్ ఎంవై ఇక్బాల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం గురువారం ఉదయం పదకొండున్నర ప్రాంతంలో తీర్పును వెలువరించింది. సీబీఐ తన దర్యాప్తును నాలుగు నెలల్లో పూర్తి చేసి, ‘చార్జిషీట్లు’ సమర్పించాలని, ఆ తర్వాత కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.ఆస్తుల కేసులో మొదటి నిందితుడైన జగన్ (ఏ-1)కు బెయిల్ మంజూరుచేసిన పక్షంలో ఆయన సాక్షులను ప్రభావితం చేసి, మెటీరియల్ సాక్ష్యాలను తారుమారు చేయడం ద్వారా దర్యాప్తును సజావుగా సాగనీయకుండా చేసే అవకాశాలు ఉన్నట్లు కోర్టు అభివూపాయపడింది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తులకు తన క్లయింట్‌కు ఎటువంటి సంబంధం లేదని జగన్ తరఫు న్యాయవాది చేసిన వాదనలను పరిగణలోనికి తీసుకున్నామని, కానీ ఆర్థిక లావాదేవీల్లో ప్రధాన కుట్రదారుడు, వాటి కారణంగా ఆర్థికంగా లాభపడ్డది జగనే అంటూ సీబీఐ చేసిన వాదనలను స్వీకరించాల్సిన ఆవశ్యకత ఉందని తీర్పులో పేర్కొంది. దర్యాప్తును పూర్తిచేసి మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేసేందుకు సమయం కావాలన్న సీబీఐ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. గురువారం (మే 9) నుండి 4 నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్లు దాఖలుచేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అ తర్వాతే సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం జగన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్వతంవూతంగా విచారించి, పిటిషన్ యోగ్యత మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. సీబీఐ న్యాయవాది చేసిన వాదనలు, అక్రమాస్తుల కేసులో దర్యాప్తుపై హైదరాబాద్ రీజియన్‌కు చెందిన సీబీఐ డైరక్టర్ అందించిన స్థాయీ నివేదిక (స్టేటస్ రిపోర్ట్)ను పరిశీలించాక జగన్‌కు బెయిల్ నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది.

ఆర్థిక నేరాల్లో బెయిళ్లపై ప్రత్యేకంగా పరిశీలించాలి
జగన్ బెయిల్‌ను నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పలు ఘాటైన వాఖ్యలు చేసింది. ఆర్థిక నేరాల్లో బెయిల్ మంజూరు చేసే సమయంలో సాధారణ నేరాల్లో బెయిల్ మాదిరికాకుండా భిన్నంగా పరిశీలించాలని స్పష్టం చేసింది. పకడ్బందీ కుట్రలతో (డీప్ రూటెడ్ కాన్‌స్పిరసీ) జరిగే ఆర్థిక నేరాలతో ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతున్నదని పేర్కొంది. ఇలాంటి ఘోరమైన నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. దేశ ఆర్థిక స్వస్థతను భంగపరిచేలా ఉన్న ఆర్థిక నేరాలపై కఠినంగా వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి నేరాల్లో బెయిల్ మంజూరు చేసే సమయంలో నేరారోపణ స్థాయి, ఆరోపణలను రుజువు చేసేందుకు సాక్ష్యాలు, శిక్షలు విధించేందుకు కావాల్సిన తీవ్రత, నిందితుడి స్వభావం, నిందితుడికి ప్రత్యేకమైన పరిస్థితులు, దర్యాప్తులో సహకరించే విధంగా నిందితుడు హాజరయ్యే అవకాశాలు, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంపై అనుమానాలు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశ, ప్రజల ప్రయోజనాలలతోపాటు.. మరిన్ని లోతైన అంశాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాతే ఆర్థిక నేరాల్లో బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

మరో ప్రయత్నమూ విఫలం
అక్రమాస్తుల కేసులో గతేడాది మే 27న జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. తనను అరెస్ట్ చేసి మూడు నెలలు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టును జగన్ ఆశ్రయించారు. అయితే అన్ని చోట్లా నిరాశే ఎదురైంది. దీని తర్వాత తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ ఒక పిటిషన్‌ను, రాజ్యాంగ హక్కు (స్టాట్యూటరీ బెయిల్) బెయిల్ మంజూరు చేయాలంటూ మరో పిటిషన్‌ను గత సంవత్సరం నవంబర్‌లో జగన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వేర్వేరుగా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది. వీటిని సవాల్ చేస్తూ జగన్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా చుక్కెదురవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం తుదివాదనలు విన్నది. రిజర్వ్ చేసిన తీర్పును గురువారం వెల్లడించింది.
Vijaya-Saireddy
జూన్ 5లోగా విజయసాయి లొంగిపోవాలి
జగన్ అక్రమాస్తుల కేసులో రెండవ నిందితుడు, జగన్ ప్రధాన అనుచరుడు, చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. విజయసాయిడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం, దానిని హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ పీ సదాశివం, జస్టిస్ ఇక్బాల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో తక్షణమే విజయసాయి లొంగిపోవాల్సి ఉంది. అయితే, ఆయన కూతురు వివాహం మే 26న ఉంది. ఈ కారణంతో జూన్ 5లోగా విజయసాయి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. విజయసాయికి బెయిల్ ఇవ్వడంలో సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సరైన ఆధారాలు లేకుండా, కేసు తీవత్ర, ఆర్థిక నేరాలను పరిగణలోనికి తీసుకోకుండానే విజయసాయికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చిందని, దాన్ని అదే రీతిలో హైకోర్టు సమర్థించిందని తీర్పులో పేర్కొంది. విజయసాయిడ్డిని కేవలం జగన్ సంస్థల తరఫు ఆడిటర్‌గానే కింది కోర్టులు పరిగణించి బెయిల్ ఉత్తర్వులు జారీచేశాయని, కానీ జగన్ ఆర్థిక నేరాలకు ఆయన ప్రధాన సలహాదారుడని సీబీఐ చేసిన వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసులో మొదటి నిందితుడైన జగన్‌ను అరెస్ట్ చేయలేదని, అలాంటి సమయంలో విజయసాయిని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని కింది కోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జగన్ సంస్థల్లోకి క్విడ్ ప్రో కో ద్వారా నిధులు తరలించడంలో విజయసాయిదే కీలకపాత్ర అంటూ సీబీఐ చేసిన వాదనలను కోర్టు సమర్ధించింది.

విజయసాయికి బెయిల్ మంజూరు విషయంలో సీబీఐ కోర్టు అనవసర విషయాలను పరిగణలోనికి తీసుకున్నట్లుగా సీబీఐ చేస్తున్న వాదనతో ఏకీభవిస్తున్నామని న్యాయమూర్తులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక నేరాల స్వభావం, నిందితుడి స్వభావంవంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జగన్ లావాదేవీల్లో కుమ్మక్కైన విజయసాయిడ్డి దేశంలో పలువురు పెట్టుబడిదారులతో మంతనాలు, సంప్రదింపులు జరిగినట్లు, తద్వారా జగన్ కంపెనీల్లోకి క్విడ్ ప్రో కో ద్వారా నిధులు మళ్లినట్లు ఉన్న మెటీరియల్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు తేలికగా విస్మరించాల్సిందికాదని కోర్టు వ్యాఖ్యానించింది. విజయసాయి బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటగా మే 30లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన కూతురి వివాహం పనులు ఉన్న విషయాన్ని విజయసాయి తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించడంతో, తిరిగి సీబీఐ తరఫు న్యాయవాదులను సంప్రదించిన న్యాయస్థానం జూన్ 5లోగా విజయసాయి లొంగిపోవాలని స్పష్టం చేసింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి, సీబీఐ చార్జీషీట్లు దాఖలు చేసిన అనంతరం విజయసాయిడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

తీర్పులో ‘చార్జిషీట్లు’ అనే పదాన్ని ఉపయోగించిన సుప్రీం
జగన్ ఆక్రమాస్తుల కేసులో మొదటిసారిగా సుప్రీంకోర్టు చార్జిషీట్లు అనే పదాన్ని ఉపయోగించింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ లేదా చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐకి సూచించింది. ఇప్పటికే ఇదే కేసులో ఐదు చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ, మరికొన్ని రోజుల్లో మూడు చార్జిషీట్లు దాఖలు చేయనున్నట్లు జగన్ బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా సీబీఐ తెలిపింది. వీటి ఆధారంగానే చారిషీట్లు నాలుగు నెలల్లో దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు అవగతమవుతోంది.

బయటికి వచ్చి.. మళ్లీ లోపలికి
జగన్ ఆక్రమాస్తుల కేసులో విజయసాయిడ్డిని సీబీఐ అధికారులు 2012 జనవరి 2న అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం అదే సంవత్సరం మార్చి 21 దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. మార్చి 31న సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో విజయసాయిడ్డిని రెండవ నిందితుడిగా పేర్కొన్నారు. అనంతరం విజయసాయి ఏప్రిల్ 2న బెయిల్ కోరగా.. ఏప్రిల్ 13న బెయిల్ వచ్చింది. దీనిని హైకోర్టులో సీబీఐ సవాలు చేసింది. దీంతో విజయసాయి బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు, తిరిగి సీబీఐ కోర్టుకే నిర్ణయాన్ని వదిలేసింది. అయితే మరో విచారించిన సీబీఐ కోర్టు.. విజయసాయికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో సీబీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు ఉత్తర్వులను హైకోర్టు 2012 జూన్13న సమర్ధించడంతో సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. బెయిల్ రద్దు చేయించగలిగింది.
Nimmagadda
నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ నిరాకరణ
వాన్‌పిక్ కేసులో అరెస్టయి, చెంచల్‌గూడ జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నాలుగు నెలల్లో సీబీఐ దర్యాప్తు పూర్తయిన అనంతరం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. నిమ్మగడ్డ ప్రసాద్ వాన్‌పిక్ అంశంలో నిందితుడనిసీబీఐ చేసిన వాదనలతో ఏకీభవిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓడరేవుల మంత్రితో నిమ్మగడ్డ లావాదేవీల వ్యవహారాన్ని కోర్టు ప్రస్తావించింది. ప్రజా అవసరాల కోసం వాడాల్సిన వనరులను అభివృద్ధి పేరిట హస్తగతం చేసుకోవడం, పెద్ద సంఖ్యలో భూములు పొందడంలో నిమ్మగడ్డ ప్రసాద్ తీరుపై సీబీఐ ఏప్రిల్ 30న సమర్పించిన స్థాయీ నివేదికను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దేశంలో గత కొన్నేళ్లుగా వైట్ కాలర్ నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి నేరాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంటుపరుస్తున్నాయని, దేశ ప్రగతిని అడ్డుకునేవిధంగా ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రసాద్‌కు బెయిల్ ఇచ్చిన పక్షంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టంచేసింది.
ysrcp
సుప్రీం తీర్పును గౌరవిస్తాం: విజయమ్మ
హైదరాబాద్, మే 9 (టీ మీడియా): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌డ్డికి బెయిల్ రాకపోవడం తమను నిరాశ పర్చిందని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని అన్నారు. జగన్ బెయిల్‌పై బయటకు వస్తారని ప్రతి ఒక్కరూ ఆశలు పెట్టుకున్నారని, కానీ నిరాశే మిగిలిందని చెప్పారు. కేంద్రం పంజరంలో సీబీఐ చిలుకగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగన్‌కు బెయిల్ వస్తుందని భావించామని అన్నారు. జగన్‌కు బెయిల్ రాకపోయినా ఎవరూ అధైర్యపడొద్దని, ప్రజలకు తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ బెయిల్‌పై బయటకు వచ్చే వరకు పార్టీని తాను నడుపుతానన్నారు. కాంగ్రెస్‌తో విభేదించినందుకే సీబీఐని అడ్డం పెట్టుకుని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ రకమైన వేధింపులను కాంగ్రెస్ కొనసాగిస్తున్నదని ఆరోపించారు. అదే పద్ధతులను ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

కర్ణాటకలో అప్పటి సీఎం యడ్యూరప్పను పదవిలో నుంచి దించడం, జైలుకు పంపడంతోపాటు బీజేపీని కాంగ్రెస్ ముక్కలు, చెక్కలు చేసిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌డ్డిని పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ న్యాయవాదులు పూటకో మాట వల్లిస్తున్నారని.. జగన్ ఆస్తులు రూ.లక్ష కోట్లు అని, మరోసారి రూ.40వేల కోట్లు అంటూ భిన్నవాదనలు వినిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో సీబీఐ ఏమీ తేల్చలేకపోయిందన్నారు. ఏడాదిగా జైలులో ఉన్న జగన్‌కు బెయిల్ ఇస్తే.. సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారని ప్రశ్నించారు. అవినీతి మంత్రులు దర్జాగా బయటే తిరుగుతుంటే.. తప్పు తేల్చకుండా జగన్‌ను ఎంతకాలం జైలులో ఉంచుతారని కాంగ్రెస్‌ను నిలదీశారు. స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని విజయమ్మ వెల్లడించారు. 2014 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి అధికార పగ్గాలను చేపడతామని, రాజన్న స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుంటామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు కొణతాల రామకృష్ణ, శోభానాగిడ్డి, సోమయాజులు పాల్గొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.