జూన్ 2.. తెలంగాణ అవతరణ

స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం పరిపూర్ణమైంది! సొంత పాలనకు ఆరాటపడిన పది జిల్లాల ప్రజ పరవశించిపోయింది! జూన్ 2.. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కరించనున్న తేదీ! ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న ‘నవ తెలంగాణ శకం’ వాస్తవరూపం దాల్చుతున్న అపురూప సందర్భం! ఇది.. తెలంగాణ మళ్లీ పుడుతున్న చారిత్రక ఘట్టం! ఇది.. తెలంగాణ ప్రజలకు నిజమైన పండుగరోజు! ఇదే నవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం! సరిగ్గా మరో 88 రోజుల తర్వాత సకల బానిస బంధనాలు తెగిపడనున్నాయి!
 దశాబ్దాల వివక్ష పాలన నుంచి విముక్తి పొంది.. తెలంగాణ సమాజం స్వేచ్ఛను అనుభవించనుంది! మనకోసం.. మన భావితరాల బంగారు భవిష్యత్తుకోసం.. మనమే ఎంచుకునే మనదైన పాలనకు విజయ దర్వాజ చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నది! ఈ విజయం వెనుక వెయ్యికి పైగా బలిదానాలున్నాయి! ఈ విజయం వెనుక లక్షల మంది కష్టనష్టాలున్నాయి! గోసలున్నాయి.. లాఠీ దెబ్బలే తిన్నారో.. కరుకుబూట్ల కర్కశత్వాన్నే చూశారో.. ఈసడింపులు.. అవమానాలు.. ఇంకెన్నెన్ని భరించారో! ఏమైతేనేం.. ప్రతిఫలం దక్కింది! ఈ జీవితకాలంలో తెలంగాణ చూస్తామో లేదోనన్న అనుమానాలు ఇక పటాపంచలు! నేడు ప్రకటించే ఎన్నికలు ముగిసిన తర్వాత.. 2014 జూన్ 2న ఏర్పడబోయేది తెలంగాణ ప్రభుత్వమే!

హైదరాబాద్, మార్చి 4 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అప్పాయింటెడ్ డే ప్రకటించింది. జూన్ 2నుంచి తెలంగాణ రాష్ట్రం తన పరిపాలన ప్రారంభిస్తుందని హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు మంగళవారం రాత్రి తెలిపారు. దీంతో భారతదేశం చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ తనదైన ఉనికి తిరిగి సంపాదించుకోనుంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇదే తేదీ ఆవిర్భావ దినంగా ఉంటుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే మార్చి 1న రాష్ట్రపతి సంతకంతో తెలంగాణ రాష్ట్ర నోటిఫైడ్ డేట్ వెల్లడైన సంగతి తెలిసిందే. అంటే.. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత సరిగ్గా మూడు నెలలకు తెలంగాణ ఏర్పాటుకానున్నది. రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలువుతున్న నేపథ్యంలో అప్పాయింటెడ్ డే ఇంకా ప్రకటించని పక్షంలో దాని వెల్లడిని నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టుకు అవకాశం లేకపోలేదన్న వాదనల నేపథ్యమూ హోంశాఖ హడావుడి ప్రకటనకు ఒక కారణంగా భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేయడానికి ఒక రోజు ముందు ఈ కీలక ప్రకటన వెలువడటం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తర్వాత ఎలాంటి గందరగోళానికి తావులేకుండానే చూసేందుకే జూన్ రెండును కేంద్రం అప్పాయింటెడ్ డేగా నిర్ధారించినట్లు చెబుతున్నారు. దీంతో ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుకు ఆటంకాలు తొలగిపోయినట్లయింది. అప్పాయింటెడ్ డే అధికారికంగా వెల్లడైన నేపథ్యంలో అవశేష తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడిగా ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందా? లేక ఉమ్మడిగానే ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

జూన్ 2.. జేష్ఠ శుద్ధ పంచమి.. కాంతి వంతమైన రోజు
తెలంగాణ ఆవిర్భవించనున్న జూన్ 2వ తేదీ తిథి, వార, నక్షత్రాల బలం అద్భుతంగా ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు. జేష్ఠశుద్ధ పంచమి, ఉత్తరాయణం, సోమవారం రోజున తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అవుతున్నదని వాస్తు పండితులు లక్ష్మణ శర్మ తెలిపారు. ఉగాది పర్వదినం నుంచి ప్రారంభమయ్యే జయనామ సంవత్సరంలోని గొప్ప రోజులలో జేష్ఠశుద్ధ పంచమి చాలా శ్రేష్ఠమైనదని ఆయన వివరించారు. పుష్యమి నక్షత్రమైన సోమవారం రోజు రాష్ట్ర ఆవిర్భావం జరుగుతున్నతని, పుష్యమినక్షత్రాధిపతి చంద్రుడి శుభ దృష్టి వలన వర్షాలు సమృద్ధిగా పడుతాయని, బంగారు పంటలు పండి, బంగారు తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. జూన్ 2వ తేదీన పంచమి తిథి ఉదయం ఆరుగంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఉండడం మరో విశేషమని అన్నారు. పంచమి తిథి గ్రహాలన్నింటికీ ఇష్టమైన రోజని, సూర్యుడు కూడా పంచమి రోజున చాలా కాంతివంతంగా ఉంటాడని మరో వాస్తు పండితులు సాది కమలాకరశర్మ తెలిపారు. పంచమి తిథి గ్రహాలన్నింటికీ ఇష్టమైన రోజని, ఆ రోజు ఆవిర్భవిస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ముందంజలో అభివృద్థి పథంలో పయనిస్తుందని చెప్పారు.

1948, సెప్టెంబర్ 17
నిజాం పాలన నుంచి స్వాతంత్య్రం
1956 నవంబర్ 1
ఆంధ్రాలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం
1969
సొంత రాష్ట్రం కోసం తొలి దశ ఉద్యమం
2001 ఏప్రిల్ 27
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం
2009 డిసెంబర్ 9
తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన
2011 సెప్టెంబర్ 13
చరిత్రాత్మక సకల జనుల
సమ్మె ప్రారంభం
2013 జూలై 30
తెలంగాణ ఏర్పాటుకు
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం
2013 అక్టోబర్ 3
రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ నిర్ణయం
2014 ఫిబ్రవరి 18
తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2014 ఫిబ్రవరి 20
విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
2014 మార్చి 1
రాష్ట్రపతి సంతకంతో
గెజిట్ నోటిఫికేషన్
2014 జూన్ 2
తెలంగాణ ఆవిర్భావ తేదీ

2236
This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.