జీహెచ్‌ఎంసీపై గవర్నర్‌గీరీ ! – రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్

రాష్ట్రపతి నుంచి వచ్చిన ఆంధ్రవూపదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును 13 షెడ్యూళ్లతో రూపొందించారు. మొత్తం బిల్లు కాపీ 65 పేజీల్లో ఉంది. దీనినే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో మొదటి షెడ్యూల్లో రాజ్యసభ సభ్యుల వివరాలు, ప్రాంతాల వారీగా కేటాయింపును ప్రస్తావించారు. శాసనసభ, లోక్‌సభ స్థానాల కేటాయింపు రెండో షెడ్యూల్‌లో ఉంది. శాసన మండలి స్థానాల పునఃర్విభజన, శాసనమండలి సభ్యుల విభజన మూడు, నాలుగవ షెడ్యూళ్లలో ఉన్నాయి. తెలంగాణలోని దళిత, వర్గాల వివరాలను ఐదవ షెడ్యూల్‌లో తెలంగాణ గిరిజన వర్గాల వివరాలను ఆరవ షెడ్యూల్‌లో ప్రస్తావించారు. నిధులు, అప్పుల పంపకాలపై ఏడవ షెడ్యూల్‌లో వివరించారు. ఉద్యోగుల పెన్షన్ల గురించి ఎనిమిదవ షెడ్యుల్లో వివరించారు. ప్రభుత్వ, కార్పొరేషన్ల కంపెనీల వివరాలు తొమ్మిదో షెడ్యూల్‌లో, రాష్ట్రస్థాయి సంస్థల పంపిణీ వివరాలు పదో షెడ్యూల్‌లో, నదీ జలాల నిర్వహణ, బోర్డుల విధివిధానాలు పదకొండవ షెడ్యూల్‌లో ఉన్నాయి. బొగ్గు, విద్యుత్ విధివిధానాలను పన్నెండవ షెడ్యుల్‌లో ఇచ్చారు.

విద్య, మౌలిక వసతుల వివరాలతో పడమూడవ షెడ్యూల్ ఉంది. సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. కనుక సీమాంవూధులు వివాదం చేసిన భద్రాచలం, మనగాల తెలంగాణలోనే అంతర్భాగంగా ఉంటాయి. విభజన అనంతరం పదేళ్ల వరకూ రెండు రాష్ట్రాలకే ఉమ్మడి గవర్నర్ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇదే కాలానికి ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది. ఇక్కడి ప్రజల రక్షణ, శాంతి భద్రతలు వంటి అంశాలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో పారుతున్న కృష్ణ, గోదావరి నదులపై వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులు వస్తాయి. రెండు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడుతున్న తరుణంలో తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను అందిస్తుంది. హైదరాబాద్ ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో ఒక అదనపు యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని రెండు రాష్ట్రాలు మూడేళ్లు వినియోగించుకోవచ్చు. ఈ వ్యవధిలో ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలను రెండు రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తారు. సహజవాయువు పంపిణీలో ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగిస్తారు.

ఏ ప్రాంతంలో అయితే సముద్రం ఉంటుందో ఆ ప్రాంతంలో దొరికే అయిల్, గ్యాస్‌లో ఆ ప్రాంతానికే రాయల్టీ లభిస్తుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పాలసీని రూపొందిస్తుంది. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటారు. విభజన తరువాత ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, 50 మంది ఎమ్మెల్సీలు, 25 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.