జీవోఎం నివేదిక ఫైసలా.. రాయల ముద్ర!

న్యూఢిల్లీ, నవంబర్ 29 :రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తన నివేదికలో రాయల తెలంగాణ ఏర్పాటుకు సిఫారసు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జీవోఎం ఈ మేరకు తాను రూపొందించిన నివేదికను శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి అందజేసింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలుపుతూ రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. హైదరాబాద్ స్థితి విషయంలో జీహెచ్‌ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ దాని పాలన వ్యవహారాలను (శాంతి భద్రతలను) గవర్నర్ చేతికి అప్పగించాలని జీవోఎం సిఫారసు చేసినట్లు తెలుస్తున్నది. dhamodhara
రాష్ట్ర విభజనకు 11 అంశాలను ఎంచుకున్న జీవోఎం.. ఈ రెండు విషయాల్లో తప్పించి.. మిగిలిన వాటిల్లో సాఫీగానే కసరత్తు పూర్తి చేసింది. ఈ రెండు అంశాలపై డిసెంబర్ 3న జరిగే కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. జీవోఎం నివేదికపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 3న ప్రత్యేకంగా సమావేశమవుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పారు.

తెలంగాణను ఎలా ఏర్పాటు చేయాలన్న అంశంలో వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నామని, కేంద్ర కేబినెట్ సమావేశం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. అదే రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా హైదరాబాద్‌లో జరుగనుంది. వాస్తవానికి డిసెంబర్ 4న కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుందని, అంతకు ముందు రోజు కేంద్ర మంత్రుల బృందం చివరి సమావేశం జరుగుతుందని ప్రకటించారు. కానీ.. షెడ్యూలును ముందుకు జరుపడంతో 2నే జీవోఎం తుది సమావేశాన్ని నిర్వహించనుంది. లేనిపక్షంలో మంగళవారం ఉదయమే సమావేశం జరుపుతారు. దానికి ముందు ఒకటో తేదీన కూడా సమావేశమై.. అప్పటికి వచ్చిన సలహాల మేరకు ఏమైనా మార్పులు ఉంటే చేస్తారని తెలుస్తున్నది. మొత్తం మీద జీవోఎం చివరి సమావేశం తెలంగాణ భవితవ్యానికి అత్యంత కీలకంగా మారనుంది. అయితే రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయల తెలంగాణ అంశం జీవోఎం చర్చల్లో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం ధ్రువీకరించారు.
sonia
అయితే.. ఉభయ ప్రాంతాల ప్రజలకు రాయల తెలంగాణ విషయంలో లీకులు ఇచ్చి.. ప్రతిస్పందనలను బట్టి నిర్ణయం తీసుకునే ఆలోచన కాంగ్రెస్ నేతల మాటల్లో కనిపిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడున జరిగే కేంద్ర కేబినెట్ భేటీ వరకూ ఈ అంశాన్ని నాన్చాలనే ఉద్దేశం కాంగ్రెస్ అధిష్ఠానంలో ఉన్నదని చెబుతున్నారు. ఒకవైపు అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వచ్చిన డిప్యూటీ సీఎంతో దిగ్విజయ్‌తో నేరుగా సమావేశం కాగా.. జీవోఎం కీలక సభ్యుడు జైరాంరమేశ్ ఫోన్‌లో మాట్లాడారు. ‘రాయల తెలంగాణ ఇవ్వాలనుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంటి?’ అని దామోదరను జైరాం ప్రశ్నించారని సమాచారం. తెలంగాణ మంత్రులు, టీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను కూడా ఈ విషయంలో సేకరించి తమకు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తున్నది. దామోదరతో తన నివాసంలో 30 నిమిషాలు భేటీ అయిన దిగ్విజయ్‌సింగ్ కూడా రాయల తెలంగాణ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. రాయలతెలంగాణ ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రాంతంలో పర్యవసానాలను దిగ్విజయ్ అంచనా వేశారని తెలుస్తున్నది. చంద్రబాబు, జగన్‌ల దూకుడును సీమాంధ్రలో, టీఆర్‌ఎస్ సత్తాను తెలంగాణలో తగ్గించే వ్యూహం కూడా కొత్త వాదంలో ఉన్నదని అంటున్నారు.

మూడు దాకా సాగదీతే!
దామోదరతో సమావేశాలు, ఫోన్ సంభాషణలు చోటు చేసుకోవడానికి ముందే జైరాం రమేశ్ జీవోఎం నివేదిక కాపీని పట్టుకుని దిగ్విజయ్‌సింగ్ నివాసానికి వెళ్లారు. నివేదికను ఆయనకు అందించిన జైరాం.. హైదరాబాద్, రాయల తెలంగాణ అంశాలపై ఇంకా తుది నిర్ణయానికి రాని విషయాన్ని తెలియజేశారని సమాచారం. ఈ రెండు అంశాలపైనా ఇద్దరు నాయకులూ చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ అంశాలను కేబినెట్ భేటీ జరిగే డిసెంబర్ మూడు దాకా సజీవంగానే ఉంచాలని, దీనిపై జరిగే చర్చ ద్వారా వచ్చే అభిప్రాయాలను అనుసరించి కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని వారు నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాతే దామోదరకు జైరాం నుంచి ఫోన్ వెళ్లిందంటున్నారు. స్పీకర్ ఆన్ చేసి జైరాం మాట్లాడుతుంటే దిగ్విజయ్ వారి సంభాషణలను విన్నారని చెబుతున్నారు.

ఈ వ్యవహారాలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ కోర్‌కమిటీ ప్రధాని మన్మోహన్ నివాసంలో సమావేశమైంది. జీవోఎం నివేదికను హోం మంత్రి షిండే సభ్యులకు అందించారు. ఈ సమావేశానికి ముందే సోనియాగాంధీతో జైరాం భేటీ అయ్యారు. దామోదరతో మాట్లాడిన వివరాలను తెలిపారు. 3న కేబినెట్ సమావేశం వరకూ ఈ రెండు విషయాలను అలానే ఉంచుదామని వారు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ మేరకే కోర్‌కమిటీలో నివేదికపై నిర్ణయానికీ రాలేదని చెబుతున్నారు. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జరిగిన చర్చల్లో కమల్‌నాథ్ పాల్గొన్నట్లు తెలిసింది. తెలంగాణ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోర్‌కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. అవసరమైతే మరో రెండు రోజుల పాటు సమావేశాలను పొడిగించాలని కోర్‌కమిటీ భావించినట్లు తెలుస్తున్నది. అయితే బిల్లు ప్రవేశపెట్టడంఎలా సాధ్యమని అనంతరం విలేకరుల వద్ద కమల్‌నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. అహ్మద్ పటేల్ మాత్రం శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని చెప్పడం చర్చకు తావిచ్చింది.

రాయల తెలంగాణ చర్చలో ఉంది : దామోదర
రాయల తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం చర్చిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ధ్రువీకరించారు. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం విలేకరులు ఆయనను చుట్టుముట్టగా.. ‘రాయల తెలంగాణ అంశాన్ని అధిష్ఠానం చర్చిస్తున్నది. అయితే మేం పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నాం’ అని చెప్పి వెళ్లిపోయారు. అయితే.. దిగ్విజయ్‌తో జరిగిన చర్చల్లో, జైరాంతో జరిగిన ఫోన్ సంభాషణల్లో రాయల తెలంగాణ ఏర్పాటును దామోదర నిర్దంద్వంగా వ్యతిరేకించినట్లు తెలిసింది.

రాయల తెలంగాణ ఎందుకు వద్దో చాలాసేపు ఫోన్‌లోనే జైరాంకు వివరించిన దామోదర.. అనంతరం దిగ్విజయ్ నివాసానికి వెళ్లి ఆయనకు కూడా అవే అంశాలు స్పష్టం చేసినట్లు తెలిసింది. రాయల తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకురావడం తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశమే అవుతుందని అన్నట్లు సమాచారం. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రతిపాదనను బలవంతంగా రుద్దాలనుకోవడం సరికాదని వాదించినట్లు తెలిసింది. అయితే.. కృష్ణాజలాల పంపిణీని సులభతరం చేయడం, అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు సీమాంధ్రతో సమానంగా ఉంచడం వంటి అంశాలను ప్రస్తావించిన దిగ్విజయ్.. ఈ కారణాలతోనే తామీ ప్రతిపాదన చేసినట్లు చెప్పారని, అయితే అవి పసలేనివంటూ దామోదర కొట్టిపారేశారని సమాచారం. రాయల తెలంగాణ ఏర్పాటుతో కృష్ణా జలాల పంపిణీ సమస్యలు తీరవని, శ్రీశైలం ఎగువన నిర్మించిన పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టుల సమస్యలు ఎప్పుడైనా వెంటాడేవేనని, కృష్ణా జలాలను కడప, నెల్లూరు జిల్లాలు పోతిరెడ్డిపాడు ద్వారా వినియోగించుకుంటుండటంతో అది ఎన్నడైనా సమస్యగానే ఉంటుందని తెలిపినట్లు సమాచారం.

తెలంగాణ ఏర్పాటు చేసి, నదీ జలాల పంపిణీ కోసం కేంద్రం ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ నెలకొల్పడమే సరైన మార్గమని ఆయన వాదించినట్లు చెబుతున్నారు. రెండు జిల్లాలను తెలంగాణలో కలపడం వల్ల అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాలు పెరుగుతాయనే ఆలోచన కూడా సరికాదని, ఇన్నాళ్లూ పార్టీలో ఉండి, పదవులన్నీ పొంది, చివరకు పార్టీకే ద్రోహం చేసిన ఓ సామాజిక వర్గాన్ని తిరిగి పెంచి పెద్దచేయడం సరికాదని దామోదర విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. గాంధీ కుటుంబాన్ని నిత్యం కించపరుస్తున్న రాయలసీమ రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తారా?అని నిలదీసినట్లు తెలిసింది. తెలంగాణ ప్రజల త్యాగాలను అపహాస్యం చేసి, వారి ఆకాంక్షలపై నీళ్లు చల్లవద్దని వారించినట్లు సమాచారం. సీమాంద్రులను సంతృప్తి పరిచే పేరుతో జీహెచ్‌ఎంసీ పరిధిని గవర్నర్ పాలనలో ఉంచడం సరికాదని చెప్పారని తెలిసింది. ఆంక్షలవల్ల తెలంగాణ ప్రజలు పార్టీపై కోపం పెంచుకుంటారని, దాని ప్రభావం ఎన్నికల్లో పార్టీపై కనిపిస్తుందని, దాంతో న ఘర్‌కా న ఘాట్‌కా’ అన్నట్లు పార్టీ పరిస్థితి మారుతుందని హెచ్చరించినట్లు తెలిసింది.

-రెండున్నర నెలల తర్వాత.. కీలక పరిణామాల మధ్య..3న రాష్ట్ర కేబినెట్ భేటీ
సరిగ్గా 74 రోజుల తర్వాత రాష్ట్ర మంత్రివర్గం డిసెంబర్ 3న సమావేశం కానున్నది. కేంద్ర కేబినెట్ సమావేశం కూడా అదే తేదీన జరుగుతుండడం విశేషం. చివరిసారిగా రాష్ట్ర కేబినెట్ సమావేశం సెప్టెంబర్ 20న జరిగింది. నెలలో రెండుసార్లు కేబినెట్ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించినప్పటికీ.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో అది ఆచరణకు నోచుకోలేకపోయింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం.. ఆయనపై పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించడంతోపాటు.. మొత్తంగా మంత్రి వర్గమే తెలంగాణ, సీమాంధ్రగా చీలిపోయి ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న కేబినెట్ సమావేశం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా గత రెండున్నర నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనుంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.