జీవోఎంకు టీఆర్ఎస్ నివేదిక

హైదరాబాద్: తెలంగాణ ప్రక్రియను ఇంకా ఆలస్యం చేయకూడదని, ఆపే ప్రయత్నం చేయకూడదని టీఆర్‌ఎస్ జాతీయ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. వెంటనే పూర్తి తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి టీఆర్‌ఎస్ తరపున నివేదిక ఇచ్చామని ఆయన వివరించారు. విభజన తర్వాత తెలంగాణలో శానన మండలిని కొనసాగించాలని నివేదికలో కోరామని ఆయన తెలిపారు. తెలంగాణపై మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్పా టీఆర్‌ఎస్ దేనికీ ఒప్పుకోదని ఆయన స్పష్టం చేశారు. విభజన తర్వాత హైదరాబాద్‌ను మూడేళ్లపాటు తాత్కాలికంగా రాజధానిగా ఉంచాలని కోరామని అన్నారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఫజల్ ఆలీ కమిషన్ కూడా చెప్పిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను నిర్మించాలని, పదిహేను వందల మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రమే ఇవ్వాలని జీవోఎంను కోరామని ఆయన చెప్పారు. అలాగే కృష్ణా, గోదావరి నదులపై రెండు జాతీయ ప్రాజెక్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

అక్రమంగా నీటి తరలింపులను అంగీకరించం: కేకే
సీమాంధ్ర ప్రాంతానికి అక్రమంగా నీటి కేటాయింపులు అంగీకరింపబోమని కేకే స్పష్టం చేశారు. న్యాయంగా నదీ నీళ్లలో ట్రిబ్యునల్‌ల తీర్పు ప్రకారం వాటా కేటాయించాలని ఆయన కోరారు. అంతకు మించి కేటాయింపులులేని అన్యాయంగా ఒక్క చుక్క నీటి తరలింపును అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. రెండు రాష్ట్రాలకు వెంటనే రెండు హైకోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధానిగా పాలన కోసం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, సాధ్యమైనంత త్వరగా ఆంధ్రా రాజధానిని నిర్మించుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్రుల భూకబ్జాలు, అక్రమ పెట్టుబడులపై వెంటనే తేల్చాలని కేకే డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఒక గిరిజన వర్సిటీని నిర్మించాలని కోరారు. బీబీనగర్‌లో నిర్మిస్తున్న నిమ్స్‌ను ఏయిమ్స్‌గా మార్చాలని విజ్ఞప్తి చేశారు.

‘1956 కన్నా ముందున్న ఆస్తులను మాకే ఇవ్వాలి’
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత విలీనం కన్నా ముందున్న ఆస్తులను తమకే ఇవ్వాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈమేరకు ఇవాళ టీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విలీనం కన్నా ముందు తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ తమకే చెందుతాయని వాటిని తమకే కేటాయించాలని వారు అన్నారు. ఈ విషయాలను జీవోఎంకు నివేదించామని వారు తెలిపారు. న్యాయప్రకారం సింగరేణిని కూడా తెలంగాణకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టిలక్-371(డి)ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ కూడా తెలంగాణకే చెందుతుందని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణకు మంజూరైన రైల్వేలైన్లను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.