జార్ఖండ్ సీఎం రాజీనామా

– అసెంబ్లీని రద్దుచేయాలంటూ గవర్నర్‌కు లేఖ సమర్పణ
– ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్
mundaన్యూఢిల్లీ, జనవరి 8: జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్‌ముండా మంగళవారం రాజీనామా చేశారు. అసెంబ్లీని రద్దుచేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేశారు. సంకీర్ణ సర్కారులోని భాగస్వామ్య పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సోమవారం మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. మంగళవారం జేఎంఎం లాంఛనంగా గవర్నర్‌కు లేఖ అందించింది. దాంతో ముఖ్యమంత్రి అర్జున్‌ముండా మంగళవారం గవర్నర్ సయద్ అహ్మద్‌ను కలుసుకుని రాజీనామా లేఖ సమర్పించారు. కేబినెట్ సహచరులు గోపాలకృష్ణ పటార్ (జేడీయూ), చంద్రవూపకాశ్ చౌదరి (ఏజేఎస్‌యూ), పలువురు బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు ఆయన ఉదయం 11.45 గంటలకు గవర్నర్‌ను కలుసుకున్నారు. సభ రద్దుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని ముండా అనంతరం విలేకరులతో చెప్పారు. కాగా, తుది నిర్ణయం తీసుకునేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంవూతిగా కొనసాగాలని అర్జున్‌ముండాను గవర్నర్ సయద్ అహ్మద్ కోరినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. మొత్తం 82 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ, జేఎంఎంలకు 18 మంది చొప్పున ఎమ్మెల్యేలున్నారు. ఆరుగురు ఏజేఎస్‌యూ, ఇద్దరు జేడీయూ, ఇద్దరు స్వతంవూతులు, బలపరీక్షలో ఓటింగు హక్కు ఉన్న ఓ నామినేటెడ్ సభ్యుడి మద్దతుతో 28 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది.

సంకీర్ణ ఒప్పందం ప్రకారం తమకు ఇప్పుడు అధికారం అప్పగించాలన్న డిమాండ్‌తోపాటు జేఎంఎం డిమాండ్లన్నింటిని బీజేపీ తోసిపుచ్చడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, మైనారిటీలో పడిపోయాక సభ రద్దుకు సిఫార్సు చేసే అధికారం లేదని జేఎంఎం, కాంగ్రెస్ అభ్యంతరం తెలిపాయి. సోమవారమే తాము మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించినందున కేబినెట్ సిఫార్సు నిలువదని జేఎంఎం నేత, ఉపముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. మంగళవారం కేబినెట్ సమావేశం కాకముందే జేఎంఎం ఈ మేరకు లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించిందని చెప్పారు. ఆయనతోపాటు ఆయన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్, ఇతర పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్ళారు. మైనారిటీలో పడిన ప్రభుత్వం చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత షకీల్ అహ్మద్ అన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అనుసరిస్తోంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.