జర్నలిస్టులు ఉద్యమాలు ఎందుకు చేయొద్దు?

(పోరుతెలంగాణ శ్రీనివాస్‌): జర్నలిస్టు అంటేనే ఉద్యమకారుడు. అధికారంలో ఉన్నోళ్లకు ఊడిగం చేస్తే తప్పు. పైరవీలు చేస్తే తప్పు. ఎదుటివారి పొట్టకొట్టడం తప్పు. తోటి జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తీసివేయాలంటూ యాజమాన్యాలకు లేఖలు రాయడం తప్పు.  కానీ  జర్నలిస్టుగా ఉంటూ ఉద్యమాలు చేయడంలో తప్పేముంది.
జర్నలిస్టులు ఉద్యమాలు ఎందుకు చేయొద్దు.
అమర్‌జీ  ఎవరైనా మీ ఇంట్లో కూర్చుండి మిమ్మల్నే తిడుతుంటే నేను జర్నలిస్టును కదా? నేను రాసే వార్తలో, విశ్లేషణలో అందరి దృష్టికి తీసుకెళ్తనని నోరుమూసుకుని కూర్చుంటరా? మాటకు మాట బదులిస్తరా? సమైక్యవాదులు ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ నడిబొడ్డున తెలంగాణ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తుంటే.. ఒంట్లో తెలంగాణ రక్తం ప్రవహిస్తున్న ఎవరికైనా కడుపు మండుతది.  గుండె రగులుతది. కళ్లముందే కన్నతల్లిలాంటి ఉద్యమాన్ని కించపరుస్తుంటే ఊరుకోవడానికి తెలంగాణ జర్నలిస్టులు.. ఏపీయూడబ్ల్యూజే నేతలు కాదు, ఐజేయూ సెక్రటరీ జనరల్‌ లూ కాదు. బరాబర్‌ నిలదీస్తరు?

సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియాన్ని పగలగొట్టారని నొక్కి చెప్తున్న మీరు.. ఆ తెలంగాణ పోరాటయోధుడి పేరుపెట్టిన ఆడిటోరియాన్ని అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేసే సమైక్యవాదులకు వేదికగా ఎందుకు మార్చారు?  భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో తెలంగాణవాళ్ల మనోభావాలను కించపరిచే అధికారం మీకెవరిచ్చిన్రు. మీ భావప్రకటనా స్వేచ్ఛ పరిధిలో తెలంగాణ ప్రజలు ఎందుకు లేరు?

పరకాల ప్రభాకర్ అభిప్రాయాలతో లేదా విశాలాం ధ్ర మహాసభ పేరిట వాళ్లు రాస్తున్న రాతలతో ఏకీభావం ఉన్నందున ఆడిటోరియం వాళ్లకు యూనియన్ అద్దెకు ఇచ్చిందని ఎవరైనా అనగలరా అని అమర్ గారు అన్నరు?  అంటం.. ఎందుకనం.. తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపడుతాయని తెలిసీ.. పరకాల, నలమోతులకు అవకాశం కల్పించడం.. వాళ్ల రాతలతో ఏకీభవించడమే అనుకోవాలి.  2004 ఎన్నికల ముందు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్‌ సార్‌ను విజయవాడ ప్రెస్‌క్లబ్‌కు ఆహ్వానించి ఉద్యమం గురించి మాట్లాడించినందుకు సంతోషం.. అప్పుడు కాదు అమర్‌జీ.. ఇప్పుడు సామాజికాంధ్ర నేతలకు అదే విజయవాడ ప్రెస్‌క్లబ్ లో ప్రత్యేకాంధ్రవాదాన్ని వినిపించడానికి అవకాశం కల్పించండి.. పరకాల ప్రభాకర్‌కు ఇప్పించినంత సెక్యూరిటీ ఇప్పించండి. విజయవాడలోనూ భావప్రకటన స్వేచ్ఛ ఉన్నదని నిరూపించండి.

ఇంతవరకు కార్మికులకు అండగా ఉండటానికే ఏ సంఘమైనా పాటుపడింది. పడుతున్నది. కానీ ఏపీయూడబ్ల్యూజే మాత్రం తెలంగాణవాదం వినిపించిన జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తీసివేయాంటూ యాజమాన్యాలకు లేఖలు రాసింది. మీదికెళ్లి వివరణ కోరింది. మీకెందుకియ్యాలె వివరణ.. తెలంగాణ ప్రజలపై సమైక్యవాదులను ఉసిగొల్పిన మీరు ప్రజలకు వివరణ ఇవ్వండి. తెలంగాణ జర్నలిస్టు యోధుడి పేరుపెట్టిన సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియాన్ని పరకాల ప్రభాకర్ లాంటి మూర్ఖులకు వేదికగా చేసినందుకు మీరు తెలంగాణ జాతికి వివరణ ఇవ్వండి.

 

This entry was posted in CRIME NEWS.

Comments are closed.