జరిమాన ఏస్తం.. జైల్ల పెడ్తం

చల్లో అసెంబ్లీని నిర్వీర్యం చేసేందుకు సర్కారు అన్ని మార్గాలనూ ఆశ్రయిస్తోంది. చలో అసెంబ్లీలో పాల్గొంటే జరిమానా, జైలు శిక్ష విధిస్తామని తహసీల్దార్లతో బెదిరింపులకు పాల్పడుతోంది. ఆందోళనలో పాల్గొనవద్దని హితబోధ చేయిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఉద్యమంలో చురుకుగా పాల్గొనే నాయకులు, ఉద్యమకారులు, తెలంగాణవాదులను నాలుగు రోజులుగా పోలీసులు అక్రమంగా అరెస్టుచేసి, బైండోవర్ చేస్తున్న విషయం తెలిసిందే.

బైండోవర్ అయిన తెలంగాణవాదులకు 14 వరకు బయటకు వెళ్లవద్దని, చలో అసెంబ్లీలో పాల్గొనవద్దని, నిబంధనలకు విరుద్ధంగా పాల్గొంటే రూ.10వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామంటూ గ్రేటర్ ఎమ్మార్వోలు బెదిరిస్తున్నారు. కీలక నేతలను ఠాణాలకు తరలించకుండా సాయంత్రం వరకు జీపుల్లో తిప్పుతున్నారని, మరికొందరిని రహస్య ప్రదేశాలకు తరలించి దాచిపెపడుతున్నారు. కొంతమందిని షాడో బృందాలు వెంటాడుతున్నాయి. కీలక నాయకుల వ్యూహరచన వంటి అంశాలను సేకరించి చలో అసెంబ్లీకి అడ్డుకట్టే వేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నిర్బంధాన్ని బద్దలు కొట్టి చలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని తెలంగాణవాదులు తేల్చిచెబుతున్నారు. ఎమ్మార్వోల బెదిరింపులను ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం జీవిత ఖైదుకైనా సిద్ధమేనంటూ స్పష్టం చేస్తున్నారు.

చలో అసెంబ్లీకి వెళ్తే రేషన్ బంద్

చలో అసెంబ్లీకి వెళ్తే రేషన్ బంద్- పింఛన్లు, పథకాలు కట్..ఖాకీమార్కు ‘డప్పు చాటింపు’
జనగామ: చలో అసెంబ్లీకి ప్రభుత్వం కక్షగట్టి అనుమతి నిరాకరిస్తే, పోలీసులు మరిన్ని అడుగులు ముందుకేస్తున్నారు. బుధవారం రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఎస్సై ఆదేశాలతో ‘చలో అసెంబ్లీకి వెళ్తే పిం ఛన్లు, రేషన్ సరుకులను నిలిపివేస్తాం. ప్రభుత్వ పథకాలు అందనివ్వం’ అని గ్రామ మస్కూరి డప్పు చాటింపువేశారు. ప్రభుత్వ పథకాలు, రేషన్ సరుకులు నిలిపివేస్తామని చాటింపు వేయించే అధికారం, ఆదేశాలు పోలీసులకు ఎవరిచ్చారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. చలో అసెంబ్లీకి వెళ్లేవారికి వాహనాలు అద్దెకు ఇవ్వొద్దని నోటీసులు ఇవ్వడం, ప్రధాన రహదారుల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేసి వాహనాలన్నీ తనిఖీ చేయడం షరా మామూలే. తెలంగాణవాదులను అక్రమం గా అరెస్టు చేసి బైండోవర్ చేయడం కూడా యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా పోలీసులు రేషన్ బంద్ చేయిస్తామని చాటింపు వేయించడం పై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

పోలీసుల ఓవర్ యాక్షన్.. కూలీల బైండోవర్క

కరీంనగర్:ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు చివరకు కూలీలను కూడా వదలటం లేదు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ఎదురుగా అడ్డాపై పనికోసం వేచిచూస్తున్న కూలీలను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ‘మాకేం తెల్వది. మమ్ములను ఎందుకు తీసుకొచ్చిన్రు. మా పని చెడగొట్టకుండ్రి’ అని కూలీలు బతిమాలినా పోలీసులు వినలేదు. ఉదయం పది గంటల సమయం దాటిపోయినా తహసీల్దార్ రాకపోవడంతో కూలీలు ఆందోళనకు దిగారు. పోలీసుల అత్యుత్సాహంతో రోజంతా నష్టపోయామని, దీనికెవరు బాధ్యులని నిలదీశారు. పోలీసులు మాత్రం కనికరించకుండా తహసీల్దార్ వచ్చేదాకా వారిని కదలనీయకుండా అక్కడే ఉంచారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.