జనవరిలో జంబో డీఎస్సీ

డీఎస్సీ-2012 నియామకాలు పూర్తికాకముందే రాష్ట్ర ప్రభుత్వం మరో జంబో డీఎస్సీకి పచ్చజెండా ఊపింది. జనవరి చివరివారంలో డీఎస్సీ-2013 నోటిఫికేషన్ జారీ చేసి, అక్టోబర్‌లోగా నియామకాల ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి తెలిపారు. 30వేల ఖాళీలు భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. డీఎస్సీ-2012 నియామకాల ప్రక్రియను డిసెంబర్ 17నాటికి పూర్తి చేసి.. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ చివరి వరకు జిల్లాల్లోని తాజా ఖాళీల వివరాల సేకరణ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. కాగా, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సుమారు మరో 20 వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది. వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి టెట్ పరీక్షను రద్దు చేసి డీఎస్సీ, టెట్‌ను కలిపి ఒకే పరీక్ష ‘టెస్ట్’ నిర్వహిస్తామని ఇప్పటికే మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి ప్రకటించారు. టెస్ట్ పరీక్ష ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాగా, ఈ పరీక్ష విధి విధానాలు, పరీక్ష నిర్వహణపై అధ్యయనానికి ఈ నెలాఖరున ఓ అధికారుల బృందాన్ని తమిళనాడుకు పంపాలని విద్యాశాఖా భావిస్తున్నది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.