జనగళం -డాక్టర్. చెరుకు సుధాకర్

వేల మిలియన్ మార్చ్‌ల రూపమా- ఐలన్నా!

అవును, అక్షరాలు దిద్దాల్సిన బాల్యం
యుద్ధబాల శిక్షను దిద్దడం నేర్పింది
వడివడిగా నడవడమూ నేర్పింది
పసులగాచే బాల్యం,
వెన్నెల రాత్రుల్లో అన్నల పాటలకు
కోరస్ ఇచ్చి ఇచ్చి
అలుపెరగని మార్చింగ్ సాంగ్ నేర్పింది-
పాలకంకుల కాపాడడానికి విసిరిన
వడిసెల రాయి
గురి చూసి కొట్టే నైపుణ్యం నేర్పింది
నిన్న ఎనుగు దాటి, మంచె దాటి,
తూర్పు కనుమలు దాటి,
ఎల్లలు దాటి ఎదిగిన
నీగెరిల్లా నైపుణ్యం
శత్రువును బీరి పోయేలా చేసింది
నల్లగొండో, నల్లమల్లో,
రాచకొండో, పాలమూరో, కృష్ణపట్టో..
కారుణ్యాల దండకారణ్యమో..
పాలబుగ్గల యెలమందల,
పల్లెటూరి పిల్లగాల్ల,
పసులగాచే మొనగాల్ల పలుకరించిన
పసిమొగ్గలాంటి నీ నవ్వు
మాయదారి రాజ్యం,
దారి కాచే శత్రువు మధ్య
ఇట్లా చిక్కుబడి- ఖండ, ఖండాలయి
మమ్మల్నిట్లా వెక్కిరిస్తుందనుకోలేదు
మెరికలా మెరిసిన నీ
రాబిన్‌హుడ్ అలీవ్‌క్షిగీన్,
ఎవర్‌క్షిగీన్ జ్ఞాపకం..
ఆగని గెరిల్లా ప్రస్థానం ఇట్లా కత్తి గాట్లకు
పీలికలై జల్లడైన జాబిలై జాలీ- జాలీలై
సంగెం మృత్యు సంగమమై
గోకారం మృత్యు స్వీకారమై
తెలంగాణ దూందాం- మృత్యుధూమమై
కొనపురి కొన ఊపిరి
మింగేస్తుందనుకో లేదు
దూపగొన్న పల్లె గొంతుకలో ఉద్యమ
జలపాతాన్ని వొంపిన సాంబశివుడా!
నా గొల్లకుర్మ భగీరథుడా!
తెలంగాణ పాట నిండా
మార్మొగిన యుద్ధభేరీ!
దాసిడ్డిగూడెం పల్లె మట్టిలో
కలిసిపోయిన!తమ్మీ !
ఎక్కడయితేనేమి రేపునెట్లా
రూపు కట్టాల్నో
పోరలు నేర్చుకుంటూనే ఉన్నరు
ఐలన్నా..అప్పుడే నీ
గుండెచప్పుడు ఆగిపోయి
మూడు వందల అరవై రోజులయ్యింది
చడీ చప్పుడు కాకుండా-
దొంగలు, దోపిడీ గాండ్లు
రాజ్యం నడుపుతనే ఉన్నారు
నిన్నిట్లా ఉద్యమ ప్రతీక చేసి
తెలంగాణ తెస్తామని
ప్రతిజ్ఞ చేయుడు కాక
ఏమి చేయ్యొస్తది?
ఆకాశం కింద, నీ నిలు స్థూపానికి
పిడికిపూత్తి సెల్యూట్ చేయుడు కాక
ఏమి చెయ్యొస్తది?
-డాక్టర్. చెరుకు సుధాకర్

This entry was posted in POEMS.

Comments are closed.