జనం నుంచి వనంలోక- తరలిన సమ్మక్క – సారలమ్మ..

మేడారం, ఫిబ్రవరి 15: రెండేళ్లకోసారి వనం విడిచి జనంలోకి వచ్చి.. నాలుగురోజులపాటు కోట్లాది మందికి దర్శనమిచ్చే మేడారం సమ్మక్కసారలమ్మలు.. శనివారం తిరిగి వనప్రవేశంచేశారు. ఈ వేడుకను చూసేందుకు జనహోరు పోటెత్తింది. తల్లీబిడ్డలకు మొక్కులు చెల్లించుకోవడంలో భక్తులు మునిగితేలారు. చల్లంగ కాపాడమంటూ వేడుకున్నారు. సామాన్యుల నుంచి అసామాన్యులవరకు ఇక్కడికి వచ్చి అమ్మలిద్దరినీ దర్శించుకున్నారు. జాతరలో భాగంగా బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క.. గద్దెలపై కొలువుదీరారు. సారలమ్మ రాకకు ముందునుంచే భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క ఆగమనంతో పోటెత్తిన భక్తజనం తల్లుల మొక్కులరోజున రెట్టింప్పయింది.

mdrwagతల్లీబిడ్డలిద్దరూ గద్దెలపై కొలువుదీరినప్పటినుంచి కొనసాగుతున్న భక్తజన ప్రవాహం వనప్రవేశంనాడు కూడా కొనసాగింది. జాతరలో చివరిఘట్టం దేవతల వనప్రవేశం సందర్భంగా శనివారం సాయంత్రం సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులును ఏటూరునాగారం మండలం కొండాయికి ఆదివాసీ వడ్డెలు(పూజారులు) సాగనంపారు. అంతకుముందు వారు వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెలను శుద్ధి చేసి ఆదివాసీ సంప్రదాయలతో భక్తుల కోలాహాలం నడుమ వనం చేర్చారు. అయినా.. మేడారానికి భక్త ప్రవాహం కొనసాగుతూనే ఉంది.

mdrwag1మరో రెండురోజులు భక్తుల తాకిడి: తల్లుల వన ప్రవేశంచేసిన అనంతరం కూడా మేడారానికి భక్తులు తరలివస్తూనే ఉన్నారు. మరో రెండురోజులపాటు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జాతరలో అమ్మవార్లను దర్శించుకుంటున్న సందర్భంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరుతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. భక్తులకన్నా తమ బందుగణానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో భక్తులు పోలీసులపై తిరగబడ్డారు. భక్తులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. చివరకు శనివారం పోలీస్ బాసులు ఐజీ రవి గుప్తా, డీఐజీ కాంతరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా మంచపై కూర్చోని జాతరను పర్యవేక్షించారు. సమ్మక్కసారలమ్మల వనప్రవేశం రోజున కూడా పోలీసులు ఇబ్బందులకు గురిచేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతరకు కోటిన్నర వరకు భక్తులు తరలిరాగా నాలుగు రోజుల్లో రూ. 1500 కోట్ల మేర వ్యాపారం జరిగిందని అంచనా.

కేసీఆర్ తరఫున బంగారం
వరంగల్‌లోని న్యాయవాదులు శనివారం మేడారంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తరఫున ఆయన ఎత్తు 54 కిలోల బంగారాన్ని(బెల్లం) వనదేవతలకు మొక్కులుగా సమర్పించారు. నాడు పెత్తందారితనానికి వ్యతిరేకంగా ఆదివాసీ సామాన్యుల పక్షాన నిలబడి కలబడి చరిత్రలో ఈనాటికి నిలిచినవారు సమ్మక్క-సారలమ్మ అయితే సీమాంధ్రుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకుసాగుతున్న వ్యక్తి కేసీఆర్ అని వారు పేర్కొన్నారు. వరంగల్ బార్ కౌన్సిల్ సభ్యులు ముద్దసాని సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమైన సమ్మక్క-సారలమ్మను స్వయంగా దర్శించుకోలేకపోయినా తెలంగాణవాదులుగా వారి కర్తవ్యదీక్షను గుర్తెరిగి ఆయన ఎత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు షేక్ అబ్దుల్‌నబీ, చిల్లా రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

కోటి మందికి పైగా భక్తులు
– వరంగల్ జిల్లా కలెక్టర్ జీ కిషన్
గతంలో కంటే భక్తుల సౌకర్యార్థం పలు అభివద్ధి పనులు చేపట్టామని దీంతో మేడారం జాతర విజయవంతమైందని వరంగల్ జిల్లా కలెక్టర్ జీ కిషన్ తెలిపారు. ఈ మహా జాతరకు కోటికిపైగా భక్తులు తరలివచ్చారని ఆయన చెప్పారు. జాతర విజయవంతమైందని, తమకు ఎన్నో అనుభూతులను మిగిల్చిందన్నారు. ఇందుకు సహకరించిన అధికారులు, సిబ్బందితోపాటు ప్రతి ఒక్కరికీ ఆయన కతజ్ఞతలు తెలిపారు. జాతర సక్సెస్ కోసం ఆరు నెలల ముందునుంచే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాగా, జాతర సందర్భంగా రహదారులను వెడల్పుచేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది వాస్తవమేనని, వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లీయరెన్స్‌కు చర్యలు చేపట్టామని రూరల్ ఎస్పీ కాళిదాస్ అన్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.