జడ్జిపైనే నిందలా?

 

HIGH-COURT -శ్రీకృష్ణ కమిటీ నివేదికను బహిర్గతపరచాలనడం తప్పా?
-కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై ఆగ్రహించిన హైకోర్టు ధర్మాసనం
-ఆ వ్యాఖ్యలు తొలగిస్తారా? మమ్మల్నే తొలగించమంటారా?
-కేంద్రానికి హైకోర్టు ప్రశ్న..విచారణ వాయిదా
-తెలంగాణపై రహస్య అధ్యాయాన్ని వెల్లడించాలని గతంలో పిటిషన్
-బహిర్గతపరచాలని జస్టిస్ నర్సింహారెడ్డి బెంచ్ ఆదేశం
-సింగిల్ బెంచ్ ఆదేశాలపై కేంద్రం అప్పీల్ పిటిషన్
ప్రత్యేక తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం బహిర్గతపరచాలంటూ ఆదేశాలు జారీచేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహాడ్డిపై కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. న్యాయమూర్తికి దురుద్దేశాలను ఆపాదించడమేమిటని ప్రశ్నించింది. పిటిషన్‌లో పేర్కొన్న ఆ వ్యాఖ్యలను కేంద్రం తొలగిస్తుందా? లేదా? సమాధానం చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ విలాస్ వీ అఫ్జల్‌పుర్కర్ల ధర్మాసనం కోరింది. ఒకవేళ కేంద్రం తొలగించనిపక్షంలో సదరు వ్యాఖ్యలను కోర్టునే తొలగించమంటారా అని ప్రశ్నించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ద్విసభ్య ధర్మాసనం సోమవారం కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్‌కు ఆదేశాలు జారీచేసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని బహిర్గతపరిచేలా కేంద్రానికి ఆదేశాలు జారీచేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం నారాయణడ్డి, ఎం సంగాడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్ నర్సింహాడ్డి ఆధ్వర్యంలోని సింగిల్ బెంచ్ ఆ 8వ అధ్యాయాన్ని బహిర్గతపరచాలని 2011 మార్చి 23న కేంద్రానికి ఉత్తర్వులు జారీచేసింది.

సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్‌చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ వేసింది. 8వ అధ్యాయాన్ని కమిటీ రహస్య నివేదికగా పేర్కొందని, అందులో ప్రభుత్వానికి చేసిన సిఫార్సులున్నాయని, అందుకే అధ్యాయాన్ని వెల్లడించడానికి ఆస్కారం లేదని తెలిపింది. అధ్యాయంలో పేర్కొన్న సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందంటూ బహిర్గతపరచడానికి కేంద్రం విముఖత చూపింది. అంతేకాకుండా జస్టిస్ ఎల్ నర్సింహాడ్డికి దురుద్దేశాలు ఆపాదించింది. కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ ప్రతుల్లో కొన్ని వాక్యాల్లో వాటిని పేర్కొన్నారు. ఈ అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ విల్సన్ వాదనలు వినిపించారు. తెలంగాణ రా్రష్ట్ర ఏర్పాటు అంశంపై ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలను సంప్రదించిన అనంతరం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించిందని తెలిపారు. 8వ అధ్యాయంలో కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసిందని చెప్పారు.

అధ్యాయాన్ని బహిర్గతపరచాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణడ్డి, సంగాడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసే అవకాశాన్ని వినియోగించుకోకుండా, నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ ప్రజావూపయోజనవ్యాజ్యంగా భావించి ద్విసభ్య ధర్మాసనం విచారించాల్సి ఉండేదని, సింగిల్ జడ్జికి విచారించే అర్హత లేదని తెలిపారు. నారాయణడ్డి, సంగాడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు రామకృష్ణాడ్డి, గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. కమిటీ నివేదిక ఆధారంగానే కేంద్రం ఆల్‌పార్టీ సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుపై ప్రజాధనం ఉపయోగించి ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతపరచాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ- అఖిలపక్ష సమావేశం ఎప్పుడుందని అదనపు సొలిసిటర్ జనరల్‌ను (ఏఎస్‌జీ) ఉద్దేశించి ప్రశ్నించింది. దీనిపై ఏఎస్‌జీ విల్సన్ తనకు తెలియదని సమాధానమిచ్చారు. డిసెంబర్ 28వ తేదీన హోంమంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్నట్లుగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అప్పుడు న్యాయస్థానం స్పందిస్తూ- ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకోకపోతే ఎలా అని ఏఎస్‌జీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కేంద్రవూపభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో సింగిల్ జడ్జిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సరికావని, వాటిని తొలగిస్తారా? లేదా తమనే తొలగించమంటారా తెలుపాలని ఆదేశించింది.అదే విధంగా కేసును విచారించే అధికారం సింగిల్ జడ్జికి ఉందా? లేదా? అనే అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అవకాశం ఇవ్వని కేంద్రం
– తెలంగాణ ప్రాంతానికి చెందిన పొన్నం అశోక్‌గౌడ్‌ను దూరం పెడుతున్న ప్రభుత్వం
తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం బహిర్గతపరచాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌చేస్తూ కేంద్రం దాఖలుచేసిన అప్పీల్ పిటిషన్‌పై వాదనల్లో విచిత్రం చోటుచేసుకుంటోంది. దీనిపై వాదనలకు కేంద్రం ఇప్పుడు రాష్ట్ర అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అవకాశం ఇవ్వడంలేదు. దేశవ్యాప్తంగా ప్రతి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను నియమిస్తారు. కేంద్రవూపభుత్వం, అనుబంధ సంస్థలపై దాఖలైన పిటిషన్లలో కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, ఆయన సహచరులు వాదనలు చేస్తారు. రాష్ట్ర హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా పొన్నం అశోక్‌గౌడ్ ఉన్నారు.

ఈయన తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతానికి చెందినవారు. సింగిల్ బెంచి ఇచ్చిన ఆదేశాలను సవాల్‌చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ నుంచి కేసులో వాదనలు వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. రాష్ట్ర అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అందుబాటులో ఉండగానే చెన్నైకి చెందిన అదనపు సొలిసిటర్ జనరల్ విల్సన్‌ను ప్రత్యేకంగా ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం నగరానికి రప్పిస్తోంది. పిటిషన్ దాఖలు నుంచి ప్రతిసారీ విచారణకు చెన్నైకి చెందిన అదనపు సొలిసిటర్‌కే అవకాశం ఇస్తూ పొన్నం అశోక్‌గౌడ్‌ను దూరం పెడుతోంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.