జగన్‌ను ఉరితీయాలి

ఆయనలాంటి అవినీతిపరుడు మరొకరు లేరు
– బ్రదర్ అనిల్ పేదల ఇళ్లు కూల్చి చర్చీలు కడుతున్నారు
– జగన్ కుటుంబాన్ని వెలివేయాలి: మంత్రి ఆనం ఫైర్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ లాంటి అవినీతిపరుడు మరొకరు ఉండరని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణడ్డి ధ్వజమెత్తారు. దేశంలో ఎవరికైనా ఉరి తీయాలంటే తొలుత జగన్‌ను ఉరితీయాలని ఆయన అన్నారు. చెంచల్‌గూడ జైల్లోనే కార్యాలయం పెట్టుకొని వ్యవహారాలు నడిపిస్తున్నారని జగన్‌పై మండిపడ్డారు. నెల్లూరులో శుక్రవారం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబంపై ఘాటైన విమర్శలు సంధించారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి విమర్శలు చేయని ఆనం రామనారాయణడ్డి.. శుక్రవారం ఒక్కసారిగా విరుచుకుపడటం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.

జగన్ చేసిన తప్పులు, దోపిడీల వల్ల వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, జైళ్లకు వెళుతున్నారని ఆనం అన్నారు. అవినీతి సొమ్మును దాచుకుని జైలుపాలయ్యారని, జగన్‌లాంటి అవినీతి పరుడ్ని ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. మరో వైపు జగన్ బావ బ్రదర్ అనిల్ పేదల ఇళ్లను ఆక్రమించుకుని చర్చీలు నిర్మిస్తున్నారని మంత్రి ఆరోపించారు. జగన్‌ను ఉత్తపుణ్యానికే జైల్లో పెట్టారంటూ వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ ఎందుకు జైలుకు వెళ్లాడో, అతడ్ని జైల్లో ఎందుకు పెట్టారో విజయమ్మ, షర్మిలకు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ కుటుంబాన్ని వెలివేయాలని ప్రజలకు మంత్రి ఆనం పిలుపునిచ్చారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.