చెయ్యి కోసివ్వాలా..రక్తంతో రాసివ్వాలా? తెలంగాణపై ఏం చేస్తే నమ్ముతారు?

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 11 : తెలంగాణ అంశంలో ఏం చేస్తే మమ్మల్ని నమ్ముతారో చెప్పండి. చేయి కోసివ్వాలా..? రక్తంతో జై తెలంగాణ అని రాసివ్వాలా..? తెలంగాణ వస్తుంది నాదీ భరోసా అని బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ పార్టీ తెలంగాణ నేతలకు తేల్చి చెప్పారు. తెలంగాణ నేతల యెండెల లక్ష్మీనారాయణ, యెన్నెం శ్రీనివాసరెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, చెన్నమనేని విద్యాసాగరరావు, బద్దం బాల్‌రెడ్డి, టీ రాజేశ్వరరావు, ధర్మారావు తదితరులు ఢిల్లీలో మంగళవారం సుష్మను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణపై బీజేపీ యూ టర్న్ తీసుకుందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలంగాణ నేతలు చెప్పటంతో సుష్మ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

sushmaswrajhoతెలంగాణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఉభయసభల్లో ఆమోదం పొందుతుంది. కాంగ్రెస్ కూడా బీజేపీ కనుసన్నల్లోకి వచ్చింది. మనం చేసిన ఒత్తిడి కారణంగా తెలంగాణను వ్యతిరేకిస్తున్న తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలను సస్పెండ్ చేసింది అని సుష్వాస్వరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని మీడియాలో 90 శాతం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, కొన్ని రోజులు ఆ మీడియాను చూడకండి అని సూచించారు. ఈనెల 13న బిల్లు లోక్‌సభకు వచ్చిన వెంటనే పాస్ చేసి పంపిస్తామన్నారు. ఆ వెంటనే బిల్లు రాజ్యసభకు వెళ్లి అక్కడ కూడా ఆమోదం పొందుతుందని, మీరు నిశ్చింతగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఒక వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆందోళనకు గురికావద్దని హితవు పలికారు. అనంతరం టీ బీజేపీ నేతలు ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లుపై బీజేపీ యూటర్న్ తీసుకున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. టీడీపీ టీ నేతలు బీజేపీపై అనవసరంగా బురదజల్లుతున్నారని విమర్శించారు.

ప్రతిరోజూ పాతివ్రత్యం నిరూపించుకోవాలా?: జవదేకర్
తెలంగాణ విషయంలో బీజేపీ తన పాతివ్రత్యాన్ని ప్రతిరోజు నిరూపించుకోవాల్సిన పనిలేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌జవదేకర్ అన్నారు. రాజ్యసభలో మంగళవారం బిల్లు ప్రవేశపెడుతారని ముందుగా ప్రకటించిన కాంగ్రెస్, ఎందుకు పెట్టలేదని పార్టీని ప్రశ్నించారు. సొంత పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న సీఎంపై చర్యలు ఎందుకు తీసుకోవటంలేదని నిలదీశారు.

ఎన్నెంపై చర్యలకు క్రమశిక్షణా సంఘం సిఫారసు
హైదరాబాద్: బీజేపీ జాతీయ నేత ఎం వెంకయ్యనాయుడుపై విమర్శలు చేసిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాసరెడ్డిపై బీజేపీ సీమాంధ్ర ప్రతినిధులు పార్టీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వివరణ కోరాలని, లేదంటే చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డికి క్రమశిక్షణా సంఘం సిఫారసు చేసినట్లు తెలిసింది.

పార్టీ విశ్వసనీయతను మంటగలపొద్దు
హైదరాబాద్: తెలంగాణ అంశంలో భిన్నస్వరాలు వినిపిస్తున్న బీజేపీ సీమాంధ్ర నేతలపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం అసహనం వ్యక్తం చేసింది. పార్టీపై విశ్వాసం సన్నగిల్లేలా ప్రవర్తిస్తున్నారని మండిపడింది. రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంత నేతలతో సోమవారం వేర్వేరుగా సమావేశమైన బీజేపీ అగ్రనేతలు, పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రవర్తించొద్దని సీమాంధ్ర నేతలను హెచ్చరించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని మరువొద్దని సూచించినట్లు సమాచారం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సూచనల మేరకే సీమాంధ్ర నాయకులను అధిష్ఠానం హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. సీమాంధ్ర సమస్యల పరిష్కారం పేరుతో ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర నేతలతోపాటు వెంకయ్యనాయుడు వంటి జాతీయ నేతలు కూడా ఢిల్లీలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆ పార్టీ వైఖరిపై సందేహాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ పరిమాణాలను జాగ్రత్తగా గమనిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, సీమాంధ్ర నాయకులను దారిలో పెట్టాలని, లేని పక్షంలో పార్టీకి నష్టం తప్పదని అధిష్ఠానాన్ని హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సంఘ్‌పరివార్ ముఖ్య నేత ఒకరు ధ్రువీకరించారు. తెలంగాణ అంశంలో బీజేపీ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.