చిన్నరాష్ట్రాలే మేలు-తెలంగాణకు ‘ఎకనమిస్ట్’ మద్దతు

చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో పరిపాలనలో మరింత సౌలభ్యం ఉంటుందని ప్రముఖ ఆంగ్ల మేగజైన్ ‘ది ఎకనమిస్ట్’ పేర్కొంది. చిన్న రాష్ట్రాలు సాధిస్తున్న ఆర్థిక, సామాజిక అభివృద్ధిని తన కథనంలో ప్రస్తావించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు మద్దతు పలికింది. ఎప్పటికైనా సొంత రాష్ట్రం ఏర్పడుతుందన్న ఆశతో తెలంగాణలోని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొంది. ఇదే డిమాండ్‌తో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని, పలువురు యువకులు నడిరోడ్డుపై పెట్రోలు పోసుకుని దహించుకుపోయిన విషయాన్ని ప్రస్తావించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు వారి స్వార్థ ప్రయోజనాల కారణంగా నెరవేరలేదని తెలిపింది. గత ఏడాది కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నెల రోజుల్లో ఈ సమస్యకు తుది పరిష్కారం చూపుతామని చెప్పారని, కానీ.. జరిగింది మాత్రం ఏమీ లేదని పేర్కొంది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇలాంటి హామీలు తెలంగాణ విషయంలో మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎకనమిస్ట్ పత్రిక తన కథనంలో అభివూపాయపడింది.

‘తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధించినకాంగ్రెస్.. సీమాంవూధలోనూ 21 స్థానాలు గెల్చుకుంది. దీంతో తెలంగాణ ఏర్పాటు విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నది’ అని పేర్కొంది. ‘తెలంగాణ మోసానికి గురైంది. చేసిన ఏ వాగ్దానాలూ నిలువలేదు’ అని ఢిల్లీకి చెందిన అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన సతీశ్ మిశ్రా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. ‘చిన్నరాష్ట్రాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యంతోపాటు అభివృద్ధి వేగవంతమవుతుంది. విశాల భూభాగమైన ఉత్తరవూపదేశ్‌ను దశాబ్దాల కిందటే నిర్వహణకు వీలుగా విభజించాల్సి ఉండింది. గత ఎన్నికలకు ముందు అప్పటి సీఎం మాయావతి ఉత్తరవూపదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించే తీర్మానం ముందుకు తెచ్చారు. స్థానికంగా ఈ డిమాండ్లకు మద్దతు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఆమె అవకాశవాదంతో ఈ చర్యకు పూనుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయారు. దేశంలో పలు ప్రాంతాల్లో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయి. అసోంలో ముస్లిం వలసలను నిరోధించేందుకు కొంత భాగాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని బోడో తెగ గిరిజనులు కోరుతున్నారు. బెంగాల్‌లో ఒక భాగంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉంది. మహారాష్ట్రలోని పశ్చిమభాగంలో ప్రజలు విదర్భ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. స్వాతంవూత్యానికిపూర్వం దేశంలో 500కుపైగా రాచరిక సంస్థానాలు ఉండేవి.

ప్రతి దశాబ్దానికో రెండు దశాబ్దాలకో కొత్త రాష్ట్రాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి 1956లో పలు కొత్త రాష్ట్రాలు సాంస్కృతిక ఐక్యత, భాష వంటి డిమాండ్లపై ఆవిర్భవించాయి. ఇటీవల రాష్ట్రాల విభజనలో అభివృద్ధి, ఉత్తమ పరిపాలన వంటి అంశాలు జత చేరుతున్నాయి’ అని ఎకానమిస్ట్ విశ్లేషించింది.
బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మూడు కొత్త రాష్ట్రాలు మొత్తంగా విజయవంతమయ్యాయని పేర్కొంది. ‘యూపీ నుంచి విడదీసిన కొండ ప్రాంతాల రాష్ట్రం ఉత్తరాఖండ్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. సామాజిక రంగంలోనూ అభివృద్ధి చెందింది. అంతేకాక యూపీని వివిధ రంగాల్లో సులభంగా అధిగమించింది. పన్ను ఆదాయాలు, పర్యాటక రంగం దాని అభివృద్ధికి దోహదం చేశాయి’ అని తన కథనంలో పేర్కొంది. ‘ఒకప్పటి మధ్యవూపదేశ్‌లో భాగమైన ఛతీస్‌గఢ్.. వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉంది.

మునుపటి కంటే ఇప్పుడు ఆర్థికంగా ఎంతో మెరుగుదల కనబరుస్తోంది. దాని ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ రాష్ట్ర వృద్ధిని నిరంతరం పెంచుతున్నారు. ప్రజా ఆహార పంపిణీలో కృషి కారణంగా వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామన్న ధీమాతో ఆయన ఉన్నారు’ అని తెలిపింది. ‘బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్ బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ.. కొత్త చిన్న రాష్ట్రంగా బీహార్ మంచి ఎదుగుదలను నమోదు చేసింది. విభజన తర్వాత బీహార్‌లో ఆర్థిక వృద్ధి రెండంకెలకు చేరుకుంది. సామాజికంగా పురోగతి సాధించింది. ఒకప్పుడు వెనుకబాటు తనానికి ఉదాహరణగా నిలిచిన బీహార్ ప్రస్తుతం స్థానిక నాయకత్వంలో మంచి అభివృద్ధిని సాధిస్తోంది’ అని ప్రస్తావించింది.

భారత్ మొత్తంగా వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్న క్రమం లో ఏర్పడిన చిన్న రాష్ట్రాలకు అదృష్టం కలిసివచ్చిందని, అదే సమయంలో పరిపాలన విషయం కూడా అందుకు సహకరించిందని ఎకానమిస్ట్ విశ్లేషించింది. చిన్న రాష్ట్రాల ప్రభుత్వాలు స్థానిక విజయాల్లో ముఖ్య భూమిక పోషించాయని తెలిపింది.

దేశంలోని దాదాపు 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జానభాపరంగా ఒకొక్కటి ఒక్కో తీరున ఉన్నాయని పేర్కొంది. యూపీ, మహారాష్ట్ర వంటి భారీ రాష్ట్రాలే కాకుండా (ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి జనాభా అమెరికాకంటే ఎక్కువ) పది లక్షలలోపు జనాభా ఉన్న రాష్ట్రాలూ ఉన్నాయని తెలిపింది.

భారత్‌లో రాష్ట్రాలను ఎలా పునర్విభజించాలో నిర్ణయించేందుకు ఒక కొత్త కమిషన్ అవసరమని ఎకానమిస్ట్ అభివూపాయపడింది. కేవలం తదుపరి ఎన్నికల్లో చూసుకుందామనుకునే రాజకీయ నాయకులకు వదిలిపెట్టడం పొరపాటే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇప్పటికే భారత్‌లోని రాష్ట్రాలు సగటున ఒకొక్కటి మూడున్నర కోట్ల మందితో ఉన్నాయని, మొత్తంగా పరిపాలనకు వీలులేని విధంగా భారీ స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. ఈ శతాబ్ది మధ్య నాటికి దేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని అంచనా వేసిన ఎకానమిస్ట్.. వారిని ఉత్తమమైన చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే 20 లేదా 30 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.