చిత్తూరు వెళ్లకుంటే ఇక్కడే కర్రీపాయింట్ పెట్టుకో కిరణ్-కేసీఆర్

 తెలంగాణ వస్తే కిరణ్‌కుమార్ చిత్తూరు వెళ్లాల్సిన అవసరంలేదని కేసీఆర్ అన్నారు. ఇక్కన్నే ఓ కర్రీపాయింట్ లేదా ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకుని హైదరాబాద్‌లోనే ఉండొచ్చని కేసీఆర్ తెలిపారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తాను హైదరాబాద్‌లోనే పుట్టానని, తాను హైదరాబాదీనేనని పలుమార్లు అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోతే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికీ తమిళనాడులోనే ఉండేవాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది గనుక ఇక్కడికి వచ్చాడని అన్నారు.

ఉద్యోగుల విషయంలో కాకిలెక్కలే: కేసీఆర్

తెలంగాణ వాళ్లకు దక్కాల్సిన ఉద్యోగాల్లో సీమాంధ్ర ప్రాంతం వాళ్లు అక్రమంగా వచ్చారని తాము పోరాటం చేశామని కేసీఆర్ తెలిపారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై మీడియాతో మాట్లాడారు. 610 జీవో ప్రకారం 58,956 మంది ప్రాంతేతర ఉద్యోగులు ఉన్నారని కేసీఆర్ వివరించారు. గిర్లిగాని కమిటీ, 610 జీవోలు చూడకుండానే వెళ్లి పోవాల్సిన ఉద్యోగులు పద్దెనిమిది వేల మంది ఉద్యోగులేనని కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు. 83 వేల మంది ఉద్యోగులను తరలించమని జీవోలు జారీ చేసింది ఆంధ్ర సీఎంలే కదా అని కేసీఆర్ ప్రశ్నించారు. సకల జనుల సమ్మె కాలంలో ఎనబై ఆరు శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారని సీమాంధ్ర మీడియానే కదా రాసింది అని ఆయన గుర్తు చేశారు. మొన్న తెలంగాణ ఏర్పాటును సీడబ్ల్యూసీ ప్రకటించిన తర్వాత ‘మేం పోనేపోం అంటూ రోడ్లపైకి వచ్చిన వేలాది మంది ఉద్యోగులు ఎక్కడి వాళ్లు’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగుల విషయంలో తెలంగాణ వాళ్లకు అన్యాయం జరిగింది నిజంకాదా అని నిలదీశారు. తెలంగాణ ఫేర్ షేర్ ఎక్కడాలేదని, అంతా 4-6 శాతమేనని ఆవేదనతో అన్నారు. అన్ని హెచ్‌ఓడీల్లో ఆంధ్రోళ్లే తిష్ట వేశారని విమర్శించారు.

ఎవరినీ నేను వెళ్లిపొమ్మనలేదు: కేసీఆర్
తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర వాసులను తాను వెళ్లిపోమని అనలేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత ఉద్యోగులు ఇక్కడి సెక్రటేరియట్‌లో పనిచేస్తారని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు సీమాంధ్ర సెక్రటేరియట్‌లో పనిచేస్తారని మాత్రమే తాను అన్నానని పేర్కొన్నారు. అసలు వెళ్లండి అనే మాటను తాను ఉచ్చరించలేదని స్పష్టం చేశారు. అయినా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో ఆంధ్రా సర్కారు నిర్ణయిస్తుందని తెలిపారు. అసలు మీ ప్రాంత ఉద్యోగుల మా వద్ద పనిచేస్తే మా సర్కార్‌కే కదా టాక్స్ వస్తుందని ఆయన వివరించారు. అలాంటప్పుడు మేమెందుకు పొమ్మంటామని అన్నారు. ఒకవేళ ఎవరైనా నిజంగానే సీమాంధ్ర వాసులను ఇక్కడి నుంచి పొమ్మంటే వాళ్ల తరపున నేనే కొట్లాడుతానని సీమాంధ్రులకు కేసీఆర్ హామీనిచ్చారు.

హైదరాబాద్‌లో అందరున్నారు: కేసీఆర్
హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రా ప్రజలు ఉన్నారని కేసీఆర్ అన్నారు. భిన్నసంస్కృతికి నగరం అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఎవరు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరంలేదని తెలిపారు. ‘ఇక్కడ గుజరాతీలు, మరఠాలు, సింధీలు, తమిళనాడుకు చెందిన వాళ్లున్నారు. వాళ్లందరిని వెళ్లిపొమ్మంటున్నామా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘మన వాళ్లు కూడా అమెరికాలాంటి విదేశాల్లో ఉన్నారు. మా తెలంగాణ ప్రాంతం వాళ్లే గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలస పోతున్నారు. వాళ్లు అక్కడికి వెళ్లి అక్కడి చట్టాలకు లొబడి పనిచేసుకుంటున్నారు, అంతేగానీ అహ్మదాబాద్ మాది, సూరత్ మాది, ముంబై మాదని అనడంలేదుగదా’ అని కేసీఆర్ తెలిపారు. ‘బతకడానికి వెళ్లి కొన్నాళ్లకు రాజధాని మాదే అంటే వాళ్లు ఊరుకుంటారా?’ అని అడిగారు. వలస వెళ్లిన వాళ్లు సిటీని కబ్జా పెడతామనడం ఎక్కడైనా ఉందా అని అన్నారు.

విద్యుత్‌పై సీఎం చెప్పిన లెక్కలు అవాస్తవాలు: కేసీఆర్

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడుతుందని సీఎం చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే కరెంట్ పోను 418 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4825 మెగావాట్లు అని పేర్కొన్నారు. థర్మల్ పవర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి 2282 మెగావాట్లు, హైడల్ పవర్ నుంచి 543 మెగావాట్లు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఏడాది మొత్తం తెలంగాణకు హైడల్ పవర్ కెపాసిటీ 800 మెగావాట్లు అని తెలిపారు. తెలంగాణకు 2458 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, తెలంగాణకు మొత్తం అవసరమైన విద్యుత్ 6848 మెగావాట్లు అని చెప్పారు. కేంద్రం దగ్గర 200 మెగావాట్ల విద్యుత్ ఉంటుందని పేర్కొన్నారు.

నిన్న సీఎం ప్రెస్‌మీట్ తర్వాత ఛత్తీస్‌గఢ్ సీఎంతో తాను స్వయంగా మాట్లాడానని కేసీఆర్ తెలిపారు. రెండున్నర నెలల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు గ్రిడ్ కనెక్టీవిటీ ఏర్పాటు చేయొచ్చు అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 నుంచి 1500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. గోదావరికి అవతలికి ఇవతలికి లైన్ వేసుకుంటే 600 మెగావాట్లు విద్యుత్ వస్తుందని తెలిపారు.

తెలంగాణలో అదనంగా 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేసుకుంటామని చెప్పారు. ఇంకా మిగులు విద్యుత్ ఉండేలా చూసుకుంటామని చెప్పారు. తెలంగాణలో 6,620 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయడానికి ప్రోగ్రామ్డ్ ప్రాజెక్టులున్నాయని పేర్కొన్నారు. చెన్నూరులో వదిలేసిన బొగ్గు గనులను రీ – ఒపెన్ చేస్తామన్నారు. మరో 3-4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు. కేటీపీఎస్‌లో మరో 800 మెగావాట్లు, భూపాలపల్లిలో మరో 800 మెగావాట్లు, సత్తుపల్లిలో 600 మెగావాట్లు, రామగుండంలో 1320 మెగావాట్లు ఉత్పత్తి చేసుకుంటామని పేర్కొన్నారు.

రాష్ట్రం విడిపోతే ఆంధ్రకు 300 మెగావాట్లకు పై చిలుకు మిగులు విద్యుత్ ఉంటుందని చెప్పారు. ఒరిస్సా నవ్‌గావ్‌సలేలో 2500 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ సమస్య మీద తాము నిపుణులను తీసుకొస్తం.. మీరు నిపుణులను తీసుకురండి.. బహిరంగ చర్చకు సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరారు. మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు విద్యుత్ ఎంత అని ప్రశ్నించారు. తమ కంటే 90 శాతం వరస్ట్ రేంజ్‌లో ఉన్నారు అని గుర్తు చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.