చారిత్రక తెలంగాణకు ఆటంకాలు వద్దు-జైపాల్‌రెడ్డి

రాయల తెలంగాణ ప్రతిపాదనను తాను సూత్రప్రాయంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ ఆ ప్రతిపాదనకు అనుకూలంగా లేరన్నారు. టీజేఏసీ నేతలతో భేటీ అనంతరం సోమవారం పొద్దుపోయిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలకే కాకుండా అనంతపురం, కర్నూలు ప్రజలకూ ప్రయోజనం లేదన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన కొత్తది కానప్పటికీ సీడబ్ల్యూసీ తీర్మానంలోగానీ, కేబినెట్ నిర్ణయంలోగానీ ప్రస్తావించని అంశాన్ని ముందుకు తీసుకురావడం అప్రస్తుతమన్నారు. జూలై 30 నాటి సీడబ్ల్యూసీ తీర్మానమే తెలంగాణ ఏర్పాటుకు కొలమానం కావాలని ఆయన స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తాను వ్యక్తిగతంగా అన్ని స్థాయిల్లో వ్యతిరేకిస్తానని, కాంగ్రెస్ పెద్దలకు వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ఈ ప్రతిపాదనతో తెలంగాణ ఏర్పాటు దిశగా సాగుతున్న ప్రక్రియకు అనవసరంగా అంతరాయం కలిగించినట్లు అవుతుందన్నారు. తెలంగాణతో సహా రాయలసీమ ప్రజల మనోభావాలను గాయపరచడం సరైంది కాదని జైపాల్ అన్నారు. చారిత్రకంగా పది జిల్లాల ప్రాంతంగా కొనసాగుతున్న తెలంగాణను ఆటంకపరచడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల సెంటిమెంటుతో ఆడుకోవద్దని కేంద్రానికి హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కర్నూలు, అనంతపురం ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు. కృష్ణా జలాల వినియోగానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయని, దేశంలో చట్టం, రాజ్యాంగం ఉన్నాయని, వాటికి అనుగుణంగానే ప్రభుత్వాలు నడుచుకుంటాయని స్పష్టం చేశారు.

బిల్లు రాదన్న సంగతి తెలియదు
శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లురాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ అన్నట్లు తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వెళ్లి రావాల్సి ఉంటుందన్నారు. అక్కడినుంచి రాష్ట్రపతికి వచ్చి, అనంతరం కేబినెట్‌కు బిల్లు తిరిగి చేరుకున్నప్పుడు మాత్రమే కమల్‌నాథ్ ఆ బిల్లును ప్రతిపాదించడం జరుగుతుందని చెప్పారు. తన ముందుకు రాని బిల్లు గురించి ముందస్తుగా ఎట్లా ప్రతిపాదిస్తారని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ రాయల తెలంగాణను అధిష్ఠానం ముందుకు తెస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు ‘అంత దూరం వెళితే నా దగ్గర సమాధానం లేదు’ అన్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందని తనకు పూర్తి విశ్వాసమున్నదని చెప్పారు.

చంద్రబాబూ.. రాజనీతిజ్ఞతతో ఆలోచించు
కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును విమర్శిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన విమర్శలను జైపాల్‌రెడ్డి ఖండించారు. కర్ణాటక వారైనంత మాత్రాన వ్యక్తిగతంగా వీరప్పమొయిలీ, జైరాం రమేశ్, మల్లిఖార్జున ఖర్గేలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బాబు రాజనీతిజ్ఞతతో ఆలోచిస్తే మంచిదన్నారు. న్యాయపరమైన వ్యవస్థలను ప్రభావితం చేసే విధంగా బ్రిజేశ్‌కుమార్‌కు వ్యక్తిగతంగా దురుద్దేశాలు ఆపాదించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.