చలో అసెంబ్లీ ప్రజాస్వామ్య విజయం

చలో అసెంబ్లీ కార్యక్షికమం విజయవంతమై తెలంగాణ ఉద్యమ చరివూతలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా భూమి పుత్ర పోరాటాలకు స్ఫూర్తిదాయకమిది. ఈ గడ్డ మాది, ఈ పట్నం మాది, ఈ అసెంబ్లీ కట్టడాలు మావి అంటూ ఆంధ్ర వలస వాదుల ఆధిపత్యాన్ని నిలదీయడంలో తెలంగాణ జనం సఫలమయ్యారు. భూమి పుత్రులుగా తమ హక్కును చాటుకోవడానికి ఎన్ని విధాల ప్రతీకాత్మక కార్యక్షికమాలు చేపట్టాలో అన్నీ చేపట్టారు. ఆంధ్ర సర్కారును దోషిగా నిల బెట్టారు. రాష్ట్ర అసెంబ్లీ నైతిక దారివూద్యాన్ని, వలసవాద స్వభావాన్ని కూడా వేలెత్తి చూపారు. చలో అసెంబ్లీ ఉద్యమం హైదరాబాద్ నగరంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల పొడుగునా పోలీసు శిబిరాలు ఏర్పాటు చేసి అడ్డుకున్నా, వాహన యజమానులను బెదిరించినా అనేక మంది హైదరాబాద్ చేరుకోగలిగారు.

శాసనసభ చుట్టూరా ఐదు కిలోమీటర్ల పరిధిలో అంచెలంచెలుగా అనేక బారికేడ్లు అమర్చినా, వేలాదిమంది పోలీసులు కాపలా కాసినా, దఫదఫాలుగా వందలాది మంది ఉద్యమకారులు అసెంబ్లీ భవనం ముందుకు రాగలగడం ఊహాతీ తం. అనేక మంది జనం పోలీసులను ఎదిరించి నిలిచిన నేపథ్యంలోనే కొన్ని బృందాలు అసెంబ్లీ చేరుకొని తెలంగాణ ఆకాంక్షను చాటగలిగాయి. అసెంబ్లీ ముందుకు చేరగలిగిన ఆ కొద్ది మంది ఉద్యమకారులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కోట్లాదిమంది తెలంగాణ బిడ్డలకు ప్రతినిధులు. హైదరాబాద్‌కు చేరలేక పోయిన అనేకమంది జిల్లా కేంద్రాలలో ఇతర చోట్లా చేపట్టిన నిరసన కూడా ప్రశంసించదగినదే. ప్రజానీకం అసెంబ్లీ వైపు చొచ్చుకు వస్తుంటే, శాసన సభలోని తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రజల ఆకాంక్షపై చర్చించాలని పట్టుబట్టారు. అసెంబ్లీ ఆవరణలోనే సీమాంధ్ర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీ భవనంపై నల్ల జెండాను రెపపలాడించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఇంతగా ప్రజా ఉద్యమం పెల్లుబికితే, అనేక మంది హైదరాబాద్ వరకు తరలి వస్తే శాసన సభలోని అధికార పార్టీ సభ్యులు ఏమి చేస్తున్నట్టు! ఈ ఉద్యమం తమ నిష్క్రియాపరత్వాన్ని, ఆంధ్ర వలస స్వభావాన్ని ఎత్తి చూపడానికే సాగుతున్నదనే సోయి అన్ని ప్రాంతాల శాసన సభ్యులకు ఉండాలె. కానీ ఇంత ఉద్యమం సాగుతున్నా తెలంగాణ ఆకాంక్షను గుర్తించే సంస్కారం శాసన సభకు లేక పోయింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు అనేక సార్లు ఈ విషయమై శాసన సభలోనే అనేక రూపాలలో ఆందోళన చేశారు. సస్పెండయిన సందర్భాలు కూడా ఉన్నాయి. శుక్రవారం నాడు కూడా ప్రజల ఆకాంక్ష చాటడానికి గేటు వద్ద నిరసన తెలిపారు. వీరు పోడియం వద్ద చేరి పట్టుపట్టినప్పుడైనా ఆంధ్ర సభ్యులలో, మంత్రులలో, ముఖ్యమంవూతిలో కదలిక కనిపించాల్సింది. స్పీకర్ శాసన సభను వాయిదా వేశారే తప్ప తెలంగాణ ఆకాంక్షను గుర్తించడానికి సిద్ధపడలేదు. ఆంధ్ర సభ్యుల దాకా ఎందుకు, తెలంగాణకు చెందిన ఒక్క మంత్రయినా, అధికార పక్షానికి చెందిన ఒక్క శాసన సభ్యుడైనా ఇది అన్యాయమని నినదించి, ఉద్యమకారులతో చేతులు కలిపారా? బయట ప్రజలు నినదిస్తుంటే, లోపల మొఖాలు వేల్లాడేసుకుని కూర్చోవడం ప్రజా ప్రతినిధి లక్షణం కాదు. జనం అసెంబ్లీ ముందుకొస్తే బారికేడ్లు పెట్టుకుని బతికే నేతలు రేపు జనం మధ్యకు వెళ్లగలరా?

తెలంగాణ కోసం ఇక్కడి సభ్యులు ధర్నా చేస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం ‘తమాషా చేస్తున్నారా’ అంటూ ఎకసెక్కం చేసిండట! రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరిట తమాషా సాగుతున్నదని శుక్రవారం నాడు తెలంగాణ జనమే చాటి చెప్పారు. హైదరాబాద్ వైపు సాగుతున్న జన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఆంధ్ర సర్కారు అనేక రూపాలలో సాగించిన దమన నీతి ప్రపంచ నియంతలు పాఠాలు నేర్చుకునేదిగా ఉన్నది. పోలీసులపై ఆధారపడి ప్రజల ఆకాంక్షను తొక్కిపెట్టడమే ప్రజాస్వామ్యం పేరిట ఇప్పుడు సాగుతున్న తమాషా! రాష్ట్రానికి పెద్ద దిక్కయిన గవర్నర్ ప్రభుత్వానికి హిత వాక్యాలు చెబుతాడనుకుని తెలంగాణ వాదులు ఆయనను కలిసి, చలో అసెంబ్లీ కార్యక్షికమానికి అనుమతి ఇప్పించాలని అడిగారట. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కదా అని మరి ఎందుకు వస్తున్నారని గవర్నర్ ఎదురు ప్రశ్న వేశాడట! దీనిని బట్టి ప్రజాస్వామ్య సూత్రాల పట్ల గవర్నర్‌కున్న అవగాహనా రాహిత్యం తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రజాజీవితంలో తలపండిన వారిని కాకుండా మాజీ పోలీసు అధికారిని గవర్నర్‌గా నియమించడం తమాషా కాదా! అసమ్మతికి తావు లేనప్పుడు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది! ఎంత ఉత్తమ ప్రభుత్వమైనా చెత్తగానే ఉంటుందని, అటువంటిది ప్రభుత్వమే చెత్తదైతే భరించలేమనీ… ప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడడమే దేశభక్తుని కర్తవ్యమనీ ప్రముఖ రాజకీయ పండితుడు, ఉద్యమకారుడు థామస్ పైన్ అభివూపాయపడ్డాడు.

అమెరికా స్థాపనలో కీలక పాత్ర పోషించి, ‘అమెరికా స్వతంత్ర ప్రకటన’ రాసిన థామస్ జెఫర్సన్ ‘దేశ భక్తికి అత్యున్నత రూపమే అసమ్మతి’ అని అభివర్ణించాడు. ప్రముఖ తాత్వికుడు, శాసనోల్లంఘన గొప్పతనాన్ని ఆవిష్కరించిన మేధావి థోరూ అభివూపాయపడినట్టు- ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడే సార్వభౌముడు. పౌరుడు బదలాయించినప్పుడే ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది కనుక, పౌరుడు కోరుకున్నప్పుడు చట్ట వ్యవస్థకు అతీతంగా కూడా ఉండగలుగుతాడు…నిరసన అనే ఆయుధాన్ని ప్రయోగిస్తాడు….చట్టం ద్వారానే న్యాయం సిద్ధించాలని ఎదురు చూస్తూ ఉంటే, జాప్యం జరిగి అన్యాయమే రాజ్యమేలుతుంది… నిరంకుశత్వానికి తలొగ్గడం వల్ల ఎక్కువ హాని జరుగుతున్నప్పుడు శాసనోల్లంఘన తప్పు కాదు. అది చట్టాన్ని ధిక్కరించడం కాదు, చట్టాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి దారి తీస్తుంది. తెలంగాణ ప్రజలు జరిపిన చలో అసెంబ్లీ ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తుందే తప్ప చట్టాన్ని ధిక్కరించే చర్య కాదు. తెలంగాణ ప్రజలు గోప్యంగా చట్టాన్ని ఉల్లంఘించ లేదు. ప్రభుత్వ అనుమతి నిరాకరణను సూత్ర బద్ధంగా బహిరంగంగా వ్యతిరేకించి తమ హక్కును, ఆకాంక్షను చాటుకున్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.